శుక్రవారం, మే 27

కార్డే కదా అనుకుంటే .... కాటేస్తుండీ ! ..



యువతను ఆకట్టుకునే సర్పాలు చాలాచాలా ఉన్నాయి. ఫ్రెండ్స్‌తో సరదా చేయడం, క్లాసులు డుమ్మాకొట్టి పిక్చర్లకు వెళ్లడం, పిక్‌నిక్‌లకు చెక్కేయడం, పరీక్షల్లో తేలిగ్గా పాసవడానికి టెక్స్ట్ పేపర్లు అందుబాటులోకి రావడం.. వగైరాలన్నమాట. వీటికి మించిన సర్పం ఒకటి పడగవిప్పి బుస కొడుతోంది.
ఇది జేబులో నక్కి ఉన్నట్టే ఉండి ఒక్కసారిగా కోరలు తెంచుకుని భయపెడుతుంది. ఆ భయానికి యువత ఇంట్లోంచి పారిపోవడమో లేక ప్రాణాలను విడవటమో జరుగుతోంది. జేబులో దాగే ఆ కాలసర్పం ‘క్రెడిట్ కార్డ్’!
ఆ కార్డులను భారీగా మన దేశంలో కూడా విద్యార్థులకు అలవాటు చేస్తున్నారు. నేటి వాడకందారే రేపటి వినియోగదారుడన్న నిజాన్ని క్రెడిట్ కార్డు యాజమాన్యాలు బాగా గ్రహించి స్టూడెంట్ కార్డులను ప్రవేశపెట్టాయి. వీటితో విద్యార్థులు తమ తక్షణ అవసరాలను తీర్చుకోడానికి అంటే పుస్తకాలు వగైరాలను కొనుక్కోవడానికి, ఫీజులు, క్యాంటీన్ ఖర్చులకు, అదనపు అవసరాలు తీర్చుకోవడానికి దోహదపడుతుంది. అయితే, పనిలో పనిగా ఈ స్పెషల్ కార్డుపై ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి అనేక సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. యువత వక్రమార్గంలో పయనించడానికి కూడా ఇవి దోహదం చేస్తున్నాయి. పిజ్జా కార్నర్లు, బర్గర్ సెంటర్లు, డిస్కో థెక్‌లు, గార్మెంట్ షాపులు, షూ మార్టులు, పబ్‌లు కూడా స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.
‘మీ జేబులో ప్లాస్టిక్ మనీ అంటే.. క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. ఆనందం మీ చెంతే’ అని కూడా ప్రచారాలు బాగా ఊరిస్తుంటాయి. మన దేశంలో ఇంకా అలవాటు కాలేదు గానీ, విదేశాల్లో అయితే ప్రధానంగా అమెరికాలోనైతే ఏకంగా కాలేజీల్లోనే ఈ కార్డుల అమ్మకం కోసం , ఉద్యో గాల కోసం నిర్వహించే క్యాంపస్ సెలెక్షన్‌లా.. ‘క్యాంపస్ మార్కెటింగ్’ జరుగుతోంది. ‘ఇక్కడే అప్లికేషన్ నింపండి, తక్షణ బహుమతిగా.. ఇవి అందుకోండి’ అంటూ టీ షర్ట్‌లు, కోక్ టిన్నులు, రంగురంగుల ఆట వస్తువులు ఎర వేస్తున్నారు.
కార్డుపై ఇచ్చిన మొత్తాన్ని వాడుకుని నెలవారీగా కనీస మొత్తాన్ని చెల్లిస్తే చాలునని చెప్పడంతో లేబ్రాయపు యువత చిక్కుకుపోతోంది. పైగా ఒక కార్డుపైన వాడుకునే మొత్తాలనుబట్టి, క్రెడిట్ రిపోర్టును బట్టి ఇతర కార్డుల యాజమాన్యాలు కూడా యువతకు కార్డులను అంటగడుతున్నాయి.
ఈ కార్డులపై ఇచ్చే అరువు మొత్తంలో రెండు వంతులు వస్తురూపేణా కొనుగోళ్లకు, ఒక వంతును నేరుగా ధనరూపేణా వాడుకోవచ్చు. అంటే ఉదాహరణకు 15 వేల రూపాయలు క్రెడిట్ లభిస్తే, దానిలో పది వేల రూపాయల విలువైన వస్తువులను ఈ-కార్డును ఆమోదించే షాపులలో కొనవచ్చు. ఒక 5 వేల రూపాయల వరకు సొమ్మును నేరుగా ఎటిఎంలలో విత్‌డ్రా చేసుకుని వాడుకోవచ్చు. ఈ మొత్తానికి గాను వారు వేసే సాలుసరి వడ్డీ (ఎఆర్‌పి) 13 శాతం అనుకుందాం. దీనికి కొంత వ్యవధిని ఇస్తారు. ఈలోగా మీకు సదరు కార్డు వాళ్ల నుంచి వచ్చే నెలవారీ స్టేట్‌మెంట్‌లో ‘మీరు ఇంత మొత్తం బకాయి ఉన్నారు. అయినప్పటికీ మీరేమీ వర్రీ కావద్దు. కేవలం 2 లేదా 3 శాతం మాత్రమే చెల్లించండి చాలు. క్రెడిట్ పాలసీ కొనసాగుతుంది’ అని పేర్కొంటారు.
అక్కడే అసలు కిటుకంతా ఉంది. కార్డు హోల్డర్ ఆ మంత్రానికి లొంగిపోయి కనీస మొత్తాన్ని చెల్లించి ఊరుకుంటాడు. ఇలా నెలవారీగా కొంత కొంత చెల్లించడంవల్ల అసలు తీరదు సరికదా, తడిసి మోపెడై మూడేళ్లలో రెట్టింపై కూర్చుంటుంది. అంటే సుమారుగా 24 శాతం వడ్డీ పడుతుందన్నమాట.
కార్డు తీసుకోవడానికి ముందు..
* నిజంగా మనకు కార్డు అవసరమా?
* కార్డును సరిగ్గా వాడగలమా?
* కనీస మొత్తాన్ని చెల్లించడానికి తగినన్ని ఆదాయ వనరులు మనకు ఉన్నాయా?
* అన్నింటికీ మించి, ఏ నెలకానెల పూర్తి రుణాన్ని చెల్లించగల స్థోమత ఉందా?
ఇవన్నీ ఆలోచించుకునే క్రెడిట్ కార్డు తీసుకోవాలి.
కార్డు తీసుకున్నాక..
* కనిపించిన ప్రతి వస్తువునల్లా కొనవద్దు.
* ఇ-షాపింగ్‌ను చేయడం అసలుకే ముప్పు.
* వస్తువుల కొనుగోలులో బేరమాడానికి ఎలాంటి సందేహం, మొహమాటం వద్దు.
* కనీస మొత్తాలను మాత్రమే చెల్లిస్తే చాలు.. అని ఏ మాత్రం అనుకోవద్దు. తరువాత మోసాల బారిన పడవద్దు.
* సాధ్యమైనంత వరకూ ఎప్పటికప్పుడు పూర్తి బకాయిలను చెల్లించేయండి.
* క్రెడిట్ బ్యాలెన్స్‌ను అదుపులో ఉంచుకోండి. క్యాష్ విత్‌డ్రాలు వద్దు.

- కంచర్ల
 

మంగళవారం, మే 24

గతమంతా నిదురలోన...




నిద్ర - శారీరక, మానసిక ఆరోగ్యాలను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. రోజుకి ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోతే చాలా మంచిది.
చాలా తక్కువ మందికి పడక మీదికి చేరుకోగానే నిద్ర పడుతుంది. అది అదృష్టంగా భావించవచ్చు. అయితే మంచం ఎక్కినా కూడా ఎక్కువమంది టీవీ చూడటమో, మొబైల్‌లో ముచ్చట్లు చెప్పుకోవడమో చేస్తుంటారు. ఈ రెండు పనులు చాలు నిద్రకు మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడానికి.
ఇవేవీ చేయకపోయినా - నిద్ర పట్టని వాళ్లు కొందరుంటారు. వీళ్లకి బుర్రలో సుడిగాలిలా ఆలోచనలు రేగుతుంటాయి. దాంతో మనసు చెదిరిందంటారు. నిద్ర పట్టకపోవడానికి ఇలాంటి కారణాలెన్నో..
గాఢంగా, హాయిగా మంచి నిద్రకు దగ్గరవ్వాలంటే కొన్ని టిప్స్ తెలుసుకోవాల్సిందే. ఏళ్ల తరబడి చెబుతున్నదే అయినప్పటికీ ‘నిద్ర’ కుపక్రమించే ముందు ఆ ఆలోచనలేవీ మదిలో మెదలవన్నది ఆనాటి ప్రశే్న. కాబట్టి కొన్ని సూచనలూ సలహాలూ ‘బుర్ర’లోకి ఎక్కిస్తే నిద్ర దానంతట అదే వస్తుందన్నది తాజా ఉదాహరణ. ముందుగా నిద్రకు ఒక షెడ్యూల్ తయారుచేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే సమయం, మేలుకునే సమయం రెండూ కూడా క్రమం తప్పకుండా ఒకే సమయాల్లో ఉండేలా చూసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. అలా రోజూ కుదరని వాళ్లు కనీసం వారంలో మూడు రోజులపాటు రోజుకి అర్ధగంట తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. కాఫీ, చాక్లెట్లలో కెఫెన్ ఉంటుంది. కాబట్టి వాటికి దూరం. కెఫెన్ నిద్రపట్టకుండా చేయడమే కాకుండా నిద్ర పోయిన తర్వాత కూడా మాటిమాటికీ మెసిలేలా చేస్తుంది. అంటే గాఢనిద్రకు దూరం చేస్తుందన్నమాట.
బాగా మెత్తగా లేదా గట్టిగా ఉన్న పరుపు మీద నిద్రపోవద్దు. పరుపు కొని తొమ్మిదేళ్ల పైన అయితే లోపల స్ప్రింగ్ మాట్రెన్‌ను మార్చేయాలి. పొగ, మందు అలవాట్లకు దూరం కావాలి. ధూమపానం, మద్యం కూడా కెఫెన్ లాగానే నిద్రపై ప్రభావం చూపుతుంది. మనం చేసే వృత్తిలో పని వత్తిడి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నిద్రకు మూడు గంటల ముందు వత్తిడి ఉండకూడదు. మానసిక సమస్యలు, ఆందోళనకరమైన ఇతర అనారోగ్యాలుంటే వైద్యుల్ని సంప్రదించటం మంచిది. ఎలాంటి సమస్యలున్నా నిద్రపోయే ముందు వాటి గురించి ఆలోచించనే కూడదు.
కడుపు నిండుగా తినో లేదా ఆకలితోనో నిద్రకు ఉపక్రమించొద్దు. పొట్ట నిండుగా ఉంటే నిద్రపట్టక అటూ ఇటూ కదులుతూ ఉంటారు. ఖాళీ పొట్ట వల్ల అసౌకర్యంగా, గడబిడగా ఉంటుంది. నిద్రకు గంట ముందే భోజనం చేయాలి. సినిమాలు చూస్తూనో, పార్టీల వల్లనో, టీవీ ప్రోగ్రాంల వల్లనో రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం వంటివి చేయొద్దు. ముఖ్యమైన కార్యక్రమాలను రాత్రిళ్లు ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత మంచిది. నిద్రకు బాగా ప్రాధాన్యత నివ్వాలి. నైట్ డ్యూటీ చేసేవాళ్లు టీ తాగడం మంచిది కాదు. నిద్ర మేల్కొనేందుకు టీ తాగుతారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్రకు కేటాయించిన సమయంలో ఎలాంటి ఆలోచనలు రాకుండా, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ నిద్రపోతే చాలు. నైట్ డ్యూటీలోనయినా నిద్ర కళ్లకు దూరంగా ఉండొచ్చు.

- కంచర్ల