శుక్రవారం, నవంబర్ 22

ఇల్లే ఔషధ శాల

ఇల్లే ఔషధ శాల
          ప్రతి చిన్న విషయానికి ఆసుపత్రికి పరుగుపెట్టడం ఆ రోజుల్లో మనకు అలవాటై పోయిందిగానీ చిన్న చిన్న అనారోగ్యాలకు మన వంటిల్లే ఔషధశాలగా పనిచేస్తుంది.
మనం వంటల్లో ఉపయోగించే చాలా వాటిల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
అంతకుమించి ఇవి శరీరానికి ఎలాంటి హాని కూడా చేయవు. కాబట్టి తరచుగా వచ్చే చిన్నపాటి అనారోగ్యాలు, దెబ్బలు, గాయాలకు వంటిల్లే క్లినిక్ సెంటర్. మీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెతుక్కునే ముందు ఒకసారి వంటింట్లోకి వెళితే బాధితుల బాధకు దివ్యౌషధాలు దొరుకుతాయి.

నోటిపూతకు:

       చాలామందికి నోటిపూత చాలా బాధిస్తుంది.  అంతేకాదు మందులు వేసుకున్నా అంత త్వరగా తగ్గదు.  ఒక్కోసారి నోట్లో పుళ్లు మానేసరికి వారాలు, నెలలు కూడా పట్టవచ్చు.
నోటిపూతకి టీ బ్యాగులతో మంచి చికిత్స చేయవచ్చు. టీలో ఉన్న టానియన్స్ నోటిపూత బాధనుంచి వెంటనే ఉపశమనం కల్గిస్తుంది. ఇది పొక్కులపై పూతగా ఏర్పడి బాధను తగ్గిస్తుంది. టీ బ్యాగుని గోరువెచ్చని నీటిలో ముంచి తర్వాత దానిని నాల్కమీద ఉంచుకోవాలి.
కొన్ని నిమిషాలు అలాగే ఉంచితే బాధ తగ్గుముఖం పడుతుంది.

చక్కని శ్వాసకు:

       శ్వాస సమస్యతో బాధపడే ఆస్తమా వ్యాధిగ్రస్తులకు  హఠాత్తుగా తమ ఇన్‌హేలర్ అయిపోతే వెంటనే ఒక కప్పు కాఫీ తాగమంటున్నారు పరిశోధకులు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులను తొలగించే మందులు ఎలా పనిచేస్తాయో కెఫిన్ రసాయనిక చర్య కూడా అంత బాగా పనిచేస్తుంది.  అయితే ఇన్‌హేలర్‌కి బదులు పూర్తి ప్రత్యామ్నయంగా కాఫీనే వాడమని చెప్పడంలేదు. ఇన్‌హేలర్ అందుబాటులో లేనపుడు, అత్యవసర సమయాల్లో
రెండు కప్పులు బ్లాక్ కాఫీ తాగితే సరిపోతుంది.

పొట్ట సమస్యలకు:

 అల్లం టీని చాలామంది వాడుతుంటారు. అది రుచికే కాదు వైద్యానికీ భేషైనది. అజీర్తి, కడుపులో తిప్పడం లాంటి  బాధలు అల్లం టీతో వెంటనే సర్దుకుంటాయి. అలాగే వాంతులు వచ్చినట్లుండటం,  తల తిప్పటం మొదలైన వాటిని కూడా తగ్గించగలుతుంది
  .

కాలిన గాయాలకు:

 కాలిన గాయాలకు తేనె బాగా పనిచేస్తుంది.
చర్మం కాలినపుడు జరిగే హాని చాలావరకు గాయాలమీద కింద బొబ్బలవల్లే జరుగుతుంది.
చర్మం కాలినపుడు బొబ్బలు, వాపు రాకుండా నివారించే చర్యలో తేనె బాగా పనిచేస్తుందని
వైద్యులు పరిశోధనలు చేసి చెబుతూనే ఉన్నారు. చిన్నపాటి కాలిన గాయాలకు తేనెని వాడవచ్చు.  ముందు చర్మంపై కాలిన ప్రదేశాన్ని నీటి ధారకింద ఒక నిమిషంపాటు ఉంచాలి.
దీనివల్ల చర్మం ఇంకా లోపల ఉడికిపోవటం తగ్గుతుంది. తరువాత ఆ ప్రదేశంలో  సున్నితంగా తేనెని రాసి, బాండేజ్ వేయాలి. అయితే దీనిని   చిన్న గాయాలకు మాత్రమే వాడటం మంచిది.

తెగిన గాయాలకు:

చర్మం తెగి గాయమైతే అది మరింత హాని చేయకుండా  తెగిన చోట వెంటనే చిటికెడు నల్ల మిరియాల పొడిని చల్లాలి.  దీనిలో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గాయాన్ని త్వరగా మానేలా చేస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా నిరోధిస్తుంది. యాంటీ సెప్టిక్ ఎలాగైతే మంటపుడుతుందో అలాగే నల్ల మిరియాల పొడి కొన్ని సెకన్లపాటు మంటపుడుతుంది.
ఇది చర్మ కణాలకు ఎలాంటి హాని చేయదు.

వెక్కిళ్ళకు:

వెక్కిళ్ళు ఒక్కోసారి చిరాకు, అసౌకర్యానికి గురిచేస్తుంటాయి.
వీటిని ఆపడం అసాధ్యమవుతుంది. అప్పుడు ఒక చెంచా పంచదారను తింటే చాలు.
వాటంతట అవే తగ్గిపోతాయి.

దోమలు, తేనెటీగలు కుడితే:

తేనెటీగ కుట్టి బాధపడుతున్నపుడు, దోమలు కుట్టినపుడు వచ్చే దురదలకు  బేకింగ్ సోడా చక్కగా పనిచేస్తుంది. నొప్పిని తగ్గించటమే కాకుండా వాపుని రాకుండా ఆపుతుంది.
అలాగే మచ్చలు కూడా ఏర్పడవు.

జలుబుకు:

 తగిన శాస్ర్తియాధారాలు లభించినప్పటికీ జలుబుకి  మసాలాలు దట్టించిన ఆహారం, కోడి మాంసం వంటివి తీసుకుంటే  ఉపశమనంగా ఉండటం గమనించవచ్చు. జలుబుకు చేపల కూర పులుసు మరీ బెస్ట్. 
మురికిని వదిలించేందుకు: స్నానానికి ఉప్పు వాడకం వింటున్నాం కాని  ఇదో కొత్త పద్ధతి. ఒక కప్పు పంచదార తీసుకుని పేస్టులా కలపాలి. దీనిని ఒళ్ళంతా పట్టించుకుని స్నానం చేయడం ద్వారా మురికి బాగా వదులుతుంది.  మీకిష్టమైన క్లెన్సర్‌ను కూడా దీనితోపాటు వాడవచ్చు.

  పాలిచ్చే తల్లుల కోసం:

   తల్లికి పాలు గడ్డకట్టడంవల్ల రొమ్ముల్లో వచ్చే వాపు, నొప్పులకు క్యాబేజి ఆకులు
 ఉపశమనం ఇస్తాయి. చెస్ట్‌పై క్యాబేజి ఆకులను పది పదిహేను నిమిషాలు పెట్టుకుంటే నొప్పులు తగ్గడమే కాకుండా వాపూ తగ్గుతుంది. అలాగే బహిష్టుకి ముందు వచ్చే రొమ్మునొప్పికి క్యాబేజి ఆకులు ఉడికించి కట్టడంవల్ల మంచి ఫలితం లభిస్తుంది. క్యాబేజీకి ఆకులు (పైపొరలు) పెద్దవి చేసి వాటిని మెత్తబడేవరకు ఉడికించి, వీటిని గోరువెచ్చగా అయ్యాక నొప్పిగా ఉన్న రొమ్ముల మీద బాగా చల్లారేదాకా ఉంచితే ఉపశమనం తప్పక ఇస్తుంది.

గొంతు నొప్పులకు:

గొంతు నొప్పిగా ఉంటే గోరువెచ్చని నీటితో ఒక స్పూను ఉప్పు కలుపుకుని బాగా పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడునుంచి నాలుగుసార్లు చేయవచ్చు. అలాగే బాగావేడి చేసి
నోరు పూసిన వారు కూడా ఇలానే చేస్తే ఉపశమనం ఇస్తుంది.

శిరోజాలకు:

నూనె, గుడ్డు, పాలు కలుపుకుని  ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని స్నానం చేయడంవల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది. అందంగా, శిరోజాలకు మెరుపును సంతరించుకుంటుంది.
వెంట్రుకలు వూడిపోకుండా మిశ్రమం బాగా పనిచేస్తుంది.

కళ్ళకు:

బంగాళా దుంపలను చక్రాలుగా కోసుకుని కళ్ళపై ఐదారు నిమిషాలు ఉంచుకుంటే
కళ్ళ కింద చర్మం జారడం, కళ్ళకు కలిగిన శ్రమ తగ్గుతాయి.
ఇలాగే దోసకాయ కూడా పనిచేస్తుంది. కళ్ళు మంటలు తగ్గుతాయి.
అందానికి, ఆరోగ్యానికి ఇవన్నీ దివ్యౌషధాలే!

-      కంచర్ల సుబ్బానాయిడు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి