మనసులో మాట

అందరూ ఆలోచించాలి

శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన ఠిపోర్టు ఆలోచనాపరులందరూ సావధానంగా పరిశీలించదగ్గది. నివేదిక ప్రధానాంశాల గురించి టీవీ చానెళ్లలో వచ్చిన తొలి విశేషాలను, వాటిపై పావు పండితుల తెలిసీ తెలియని వ్యాఖ్యానాలను చూసి కమిటీ కొండను తవ్వి ఎలుకను పట్టిందని చాలామంది సహజంగానే పెదవి విరిచారు. తెలంగాణ రాష్ట్రం సంగతి ఎటూ తేల్చకుండా తెలంగాణకు కమిటీ రిపోర్టు తీరని అన్యాయం చేసినట్టు తెలంగాణ వాదులు కుతకుతలాడుతున్నారు. కాని నివేదికను సావధానంగా, సాకల్యంగా ప్రశాంత చిత్తంతో పరిశీలిస్తే కమిటీని తప్పు పట్టవలసింది ఏమీ కనిపించదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలో వద్దో తేల్చాలన్నది శ్రీకృష్ణ కమిటీ పరిశీలనాంశాల్లోనే లేదు కనుక ఆ సంగతి ఇదమిత్థంగా తేల్చకపోవటం కమిటీ తప్పుకాదు. రాష్ట్రంలోని ఇటీవలి పరిణామాలను అధ్యయనం చేసి, వివిధ వర్గాల డిమాండ్లను పరిశీలించి, విభిన్న వర్గాల అభిప్రాయాలను సేకరించి, ఏమి చేయదగునన్న దానిపై తోచిన సూచనలివ్వడం వరకే కమిటీకి అప్పగించిన పని. ఆ బాధ్యతను శ్రీకృష్ణ కమిటీ మొత్తంమీద సంతృప్తికరంగానే నిర్వర్తించింది.
ఏ కమిటీ అయినా సిఫారసులను మాత్రమే చేయగలదు. వాటిని పాటించాలా, వద్దా, ఏ మేరకు అమలు చేయవచ్చునన్నది నిర్ణయించవలసింది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరాల్సిందేనని కమిటీ చెప్పినా, ప్రభుత్వం తలచుకుంటే ఆ సిఫారసును చెత్తబుట్టలో పడవేయవచ్చు. తెలంగాణ ఇవ్వనేకూడదని కమిటీ చెప్పినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కావాలనుకుంటే వచ్చే పార్లమెంటు సెషనులోనే బిల్లుపెట్టి తెలంగాణను ఇచ్చెయ్యవచ్చు. అంటే కమిటీది కేవలం సలహాదారు పాత్రే తప్ప నిర్ణయాత్మక శక్తికాదు. కాబట్టి తెలంగాణను తక్షణం వేరు చెయ్యాలని సూచించనంతమాత్రాన తెలంగాణ ప్రయోజనాలకు తీరని విఘాతం అయినట్టు తల్లడిల్లవలసిన పనిలేదు. తెలంగాణ వాదంలో న్యాయం ఉందన్నది నిస్సందేహం. తెలంగాణ ప్రజానీకంలో సర్వేసర్వత్రా వేర్పాటు సెంటిమెంటు సెగలు కక్కుతున్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. కాని శ్రీకృష్ణ కమిటీని నియమించింది కేవలం తెలంగాణకు సంబంధించే కాదు. రాష్ట్రం మొత్తాన్నీ దృష్టిలో ఉంచుకుని పరిస్థితిని అవలోకించవలసినప్పుడు మిగతా ప్రాంతాల వాదాలను, సెంటిమెంట్లనుకూడా అనివార్యంగా పరిగణనలోనికి తీసుకోక తప్పదు.
సంక్షోభాన్ని గట్టెక్కటానికి శ్రీకృష్ణకమిటీ ఆరు ఉపాయాలను సూచించింది. మంచిచెడ్డలను, సాధక బాధకాలను వివరించిన మీదట వాటిలో నాలుగు (1. యథాస్థితిని కొనసాగించటం 2. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు; హైదరాబాద్ నగర కేంద్ర పాలితం 3. రాయల తెలంగాణ, కోస్తా ఆంధ్ర రాష్ట్రాలు 4. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు, విశాల హైదరాబాద్ కేంద్ర పాలితం) ఆచరణసాధ్యం కాదని తేల్చింది. తెలంగాణ వేర్పాటు డిమాండుకు ఇంతవరకు సీమాంధ్రులు వ్యతిరేకించడానికి సమైక్యాంధ్రంటే మక్కువకంటే కూడా… రెండు తరాలుగా ప్రగాఢ అనుబంధం పెంచుకున్న హైదరాబాద్ నగరాన్ని కోల్పోతామన్న భయం ఒక ముఖ్య కారణం. తప్పనిసరై తెలంగాణను విడగొట్టవలసి వస్తే హైదరాబాద్ నగరాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంచేసి తెలంగాణకు వేరే రాజధాని చూసుకోమనడం మేలని సీమాంధ్రవర్గాల్లో విస్తృతంగా వినవస్తున్నది. ప్రతిష్టంభన తొలగించటానికి ఇదొక్కటే వాస్తవిక పరిష్కారమని భావిస్తున్నవారు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కాని ఇది కుదిరేపనికాదని శ్రీకృష్ణకమిటీ ఇప్పుడు చెప్పకనే చెప్పింది. ఇది తెలంగాణ వాదులకు సహజంగానే సంతోషం కలిగిస్తుంది. కాబట్టి దీనిపై సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని భయపడనవసరం లేదు. ఎందుకంటే కమిటీ నివేదిక మొత్తంమీద సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నది కనుక!
నాలుగు ప్రత్యామ్నాయాలను కమిటీ ఈ చేత్తో ప్రతిపాదించి ఆ చేత్తో కొట్టి పారేశాక నివేదికలో చివరికి నిలిచే మార్గాంతరాలు రెండు. సీమాంధ్ర, తెలంగాణాలుగా రాష్ట్రాన్ని విడగొట్టి, హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధానిని చేయటం, సొంత రాజధాని అమరేదాకా సీమాంధ్రకు రాజధాని హైదరాబాద్‌ను కొనసాగనివ్వటం వీటిలో మొదటిది. తెలంగాణ వాదులు పట్టుబట్టి కోరుతున్నదికూడా ఇదే. ఇది కుదరక, వేరే దారి లేక, తప్పనిసరి అయిన పక్షంలో రాష్ట్రాన్ని విభజించవచ్చునని శ్రీకృష్ణకమిటీ చెప్పింది. అయితే దానివల్ల సీమాంధ్రలో ఉత్పన్నమయ్యే ప్రజా వ్యతిరేకత, హింసా వెల్లువల అవాంఛనీయ పరిణామాలను, భాష ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టటంవల్ల ఇతర రాష్ట్రాలలో ఇటువంటి డిమాండ్లు ముమ్మరమయ్యే అవకాశాన్ని, నదీ జలాలు, వనరులు వగైరాల పంపిణీకి సంబంధించి తలెత్తే పేచీలను, అసాంఘిక శక్తుల విజృంభణ ప్రమాదాన్ని ఈ సందర్భంలో దృష్టిలో ఉంచుకోవాలని కమిటీ చెప్పిన సంగతులను కూడా ప్రజాక్షేమం కోరే వారందరూ సావధానంగా పరిశీలించాలి.
విభజనవల్ల అనర్థాలకు, విపరిణామాలకు విరుగుడుగా, ఉన్నంతలో ఉత్తమ పరిష్కారంగా శ్రీకృష్ణకమిటీ చివరికి తేల్చింది- తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ వాసుల ప్రయోజనాలకు గట్టి రక్షణలతో తెలంగాణ ప్రాంతీయ మండలిని చట్టప్రకారం ఏర్పాటుచేస్తూ ఇప్పుడున్న రాష్ట్రాన్ని ఇలాగే కొనసాగించాలన్నది. తెలంగాణవాదులు దీన్ని వినగానే పెదవి విరవడం సహజం. సమైక్యవాదాన్ని ఏదోవిధంగా నిలబెట్టే ఎత్తుగడగానే ఇది వారికి కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతీయ మండలి ఆలోచన పాసిపోయిన పాతచింతకాయ పచ్చడి అనే వారికి అనిపిస్తుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో నాలుగు దశాబ్దాల కిందటి వేర్పాటు ఉద్యమాల దరిమిలా ఆరు సూత్రాల పథకంలో భాగంగా అవతారమెత్తిన ప్రాంతీయ బోర్డులు అజాగళస్త్తనాల్లా చివరికి ఎలా నిరర్థకమయ్యాయో అందరికీ తెలిసిందే. కాబట్టి అదే పనికిమాలిన పాత ప్రయోగాన్ని మళ్ళీ తమమీద రుద్ది ప్రత్యేక రాష్ట్రానికి దానే్న ప్రత్యామ్నాయమని అనుకోమంటే తెలంగాణ వాసులెవరికైనా సహజంగానే ఒళ్ళు మండుతుంది.
కాని- ఈ సందర్భంలో గమనించాల్సిన విషయం ఒకటుంది. శ్రీకృష్ణ కమిటీ చెప్పింది పాత ప్రాంతీయబోర్డులనే పునరుద్ధరించమని కాదు. అవి ఎందుకు నిష్ఫలమయ్యాయన్నది నివేదికలో వివరంగా చర్చించి, మళ్ళీ అటువంటి వైఫల్యాలకు ఆస్కారం లేకుండా ప్రాంతీయ మండలికి చట్టప్రతిపత్తిని, చట్టబద్ధ అధికారాలను కల్పించాలని, వాటిని సార్థకం చేయడానికి గట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సూచించింది. ఇందుకు సంబంధించి కొన్ని నిర్దిష్ట ప్రతిపాదనలనూ చేసింది. అవి సమగ్రం కాకపోవచ్చు. అన్ని చెడుగులకూ అవే పరిష్కారాలూ కాకపోవచ్చు. కాని- తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న వివిధ సామాజిక వర్గాలను ఆ దిశగా పురికొల్పిన పరిస్థితులను, ఇనే్నళ్లుగా ఆయా వర్గాలకు జరిగిన అన్యాయాలను సానుభూతితో అర్థం చేసుకుని. ఇకపై అట్టివి మళ్ళీ జరగబోవన్న భరోసా ఆయా వర్గాలకు కలిగే విధంగా, ప్రస్తుత రాష్ట్ర చట్రంలో అంతర్భాగంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసే అవకాశం ఉన్నదని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. వాస్తవానికి ఈ రకమైన ఆలోచన రాష్ట్రానికి కొత్తది కాదు. ఉదాహరణకు తెలంగాణ హితైషి, సీనియర్ రాజకీయవేత్త, అచ్చమైన గాంధీవాది అయిన ఎం.ఎస్.రాజలింగం ఇదే ప్రతిపాదనను ఎప్పటినుంచో చేస్తున్నారు.
ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే చేసినది కాబట్టి శ్రీకృష్ణ కమిటీ చేసిన ఈ సిఫారసును ముందస్తు దురభిప్రాయాలతో ముందే కొట్టి వేయటం తగదు. ప్రస్తుత రాష్ట్రాన్ని కమిటీ కొనసాగించాలన్నంత మాత్రాన సీమాంధ్రుల నెత్తిన పాలుపోసినట్టు కాదు. ముఖ్యంగా నదీ జలాల వాడకం వగైరాల విషయంలో కమిటీ సూచించిన వ్యవస్థవల్ల ప్రాంతీయ పేచీలు తలెత్తే ఆస్కారం ఉంది. సీమాంధ్రకు ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. దానిపై ఆ ప్రాంతంలో వ్యతిరేకత రావచ్చు. వివరాల్లోకి వెళితే వివాదాస్పద అంశాలు కొన్ని ఉన్నా మొత్తంమీద కమిటీ సూచించిన మొదటి పరిష్కారం- సీమాంధ్రులకు ఇది ఆమోదయోగ్యం అనడంలో సందేహం లేదు. తెలంగాణవాసులే దీనిపై ఒక నిర్ణయానికి రావాలి. ‘సెకండ్ బెస్ట్’ అని శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయపడ్డ రాష్ట్ర విభజననే ఏకైక పరిష్కారమని రుజువు చేయడానికైనా… ‘్ఫస్ట్‌బెస్ట్’ అన్న ‘సమైక్య రాష్ట్రం – ప్రాంతీయ మండళ్ల’ ఆలోచన ఎందువల్ల పనికిరాదో నిరూపించగలగాలి. మొత్తం రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ అంతటా దీనిపై విస్తృతమైన చర్చ జరగాలి. ఏది ఏమైనా కమిటీ నివేదిక ప్రాధాన్యం కొంతమేరకే. అంతిమంగా ఏమి చెయ్యాలో తేల్చవలసింది. తేల్చుకోవలసింది కేంద్ర ప్రభుత్వం. తలనెప్పిని పార్టీలమీదికి బదలాయించి, అఖిలపక్షాల పేరంటాలు పెట్టి, మాయలేడి లాంటి ‘ఏకాభిప్రాయం’ సన్నాయి నొక్కులు నొక్కి సమస్యను మాగవేయటం ఇంకెంత మాత్రమూ తగదు.