వంటగదిని అందంగా అమర్చుకోవాలనే కోరిక ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. రంగు రంగుల డిజైన్లు ఉన్న క్యాబినెట్స్, గ్రానైట్ టాప్, గ్లాస్ హబ్, బాస్కెట్స్, గ్లాస్ చిమ్నీ…ఇలా ప్రతీ వస్తువు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నారు. తక్కువ స్థలంలోనే కిచెన్‌ను అందంగా తీర్చిదిద్దుకోవాలనే తపన ఎక్కువయింది. ఆ క్రమంలో రెడీమేడ్ కిచెన్‌లు ఆదరణ పొందుతున్నాయి. విదేశీ కంపెనీలు కూడా సరసమైన ధరలకు ఆకర్షణీయమైన రెడీమేడ్ వంటగదులను అందిస్తున్నాయి.
ఇంట్లో అందరికీ ఇష్టమైన ప్రదేశం వంటగది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సమయం కిచెన్‌లోనే గడుపుతుంటారు. ఇప్పుడున్న బిజీ జీవనంలో కుటుంబసభ్యులందరూ కలిసేది కిచెన్ దగ్గరే అనడంలో సందేహం లేదు. అందుకే వంటగదిని ఆకర్షణీయంగా, సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చు గురించి పెద్దగా ఆలోచించడం లేదు. సంప్రదాయ కిచెన్‌ల స్థానంలో మోడ్రన్ కిచెన్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. హై-ఎండ్ అపార్టుమెంటుల్లో నివసించే వారి దగ్గరి నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరూ వీటి వైపు మొగ్గు చూపుతున్నారు.
మాడ్యులర్ కిచెన్
ఈ రెడీమేడ్ కిచ్‌న్ అందుబాటులోకి వచ్చాక వంటగది రూపమే మారిపోయింది. ఇంటీరియర్ డెకరేషన్‌లో ఇది సరికొత్త మార్పులను తీసుకువచ్చింది. ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా సులభంగా వంట చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత. వంటగది విస్తీర్ణంను బట్టి కిచెన్ క్యాబినెట్‌లను డిజైన్ చేయించుకోవడం వల్ల వస్తువులను నీట్‌గా సర్దుకునే అవకాశం ఉంది. వంటపాత్రలు శుభ్రం చేసుకోవడానికి వీలుగా సింక్, కూరగాయలు తురుముకోవడానికి గ్రానైట్ టాప్ ఉంటుంది.హబ్స్‌లో కూడా బోలెడు వెరైటీలున్నాయి. గ్లాస్ హబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది ఇప్పుడు గ్లాస్‌హబ్‌నే ఎంచుకుంటున్నారు. పొగ బయటకు వెళ్లడానికి వీలుగా చిమ్నీ ఉంటుంది. ఇందులో కూడా చాలా రకాలున్నాయి. 4వేల నుంచి 40 వేల రూపాయల ధర ఉన్న చిమ్నీ కూడా ఉంది. గ్లాస్ చిమ్నీకి ఇప్పుడు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. వంట సామగ్రి, పాత్రలు పెట్టుకోవడానికి వీలుగా పుల్ అవుట్ డ్రాలు ఉంటాయి. వంటపాత్రలు భద్రపరుచుకోవడానికి అనువుగా షట్టర్స్ ఉంటాయి. మాడ్యులర్ కిచెన్ యాక్సెసరీస్‌లో చాలా రకాలున్నాయి. అనేక రకాల రంగుల్లోనూ, డిజైన్లలోనూ మాడ్యులర్ కిచెన్‌లు లభిస్తున్నాయి.
ఇల్లు మారినా ఓకె
మాడ్యులర్ కిచెన్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే మాడ్యూల్స్‌ను సులువుగా విడదీసుకోవచ్చు. ఇల్లు మారాల్సి వచ్చినపుడు ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా సులువుగా విప్పుకోవచ్చు. కొత్త ఇంటికి తరలించుకుని మళ్లీ బిగించుకోవచ్చు. మాడ్యులర్ కిచెన్ కాకుండా కార్పెంటర్ చేత కిచెన్ ఏర్పాటు చేయించుకుంటే ఆ కలపను తొలగించడం సాధ్యం కాదు. డ్యామేజీ ఎక్కువగా ఉంటుంది. మరో చోట బిగించడం కష్టంతో కూడకున్న పని. మాడ్యులర్ కిచెన్‌లో ఈ సమస్య ఉండదు. కొన్ని రోజులు పోయాక మళ్లీ కొత్త లుక్ కావాలనుకున్న వారు షట్టర్స్ మార్పించుకోవచ్చు. కొత్త డిజైన్లు ఉన్న షట్టర్స్ వేసుకోవడం వల్ల కొత్తదనం వస్తుంది. సంప్రదాయ కిచెన్ టాప్‌ను నిర్మించుకున్న వారు కూడా మాడ్యులర్ షట్టర్స్‌ను తెచ్చుకుని బిగించుకోవచ్చు.సైజుతో పని లేదనుకుంటే పది అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పులో తీసుకోవచ్చు. ఇది మాడ్యులర్ కిచెన్‌లో లభించే సాధారణ సైజు. ఒకవేళ ఇంకా పెద్దగా కావాలనుకునే వారు ఆ మేరకు సైజులు ఇచ్చి తయారు చేయించుకోవాల్సి ఉంటుంది. మధ్యతరగతి ప్రజలుసైతం మాడ్యులర్ కిచెన్ పట్ల మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఈ సౌకర్యాలే. అందుకే రాబోయే రోజుల్లో ఈ రెడీమేడ్ కిచెన్‌దే హవా అనడంలో సందేహం లేదు.
ఇటలీకి చెందిన ఆర్మోనీ కంపెనీ స్ట్రెయిట్ లైన్ మాడ్యులర్ కిచెన్‌ను తక్కువ ధరకే అందిస్తోంది. 10్ఠ2 సైజు గల మాడ్యులర్ కిచెన్ లక్షా యాభైవేలకు లభిస్తోంది. ఇందులో కార్‌కస్ ఎమ్‌డీఎఫ్‌తో తయారవుతుంది. హబ్, గ్రానైట్ టాప్ ఇండియావి, మిగతా యాక్సెసరీస్ అన్నీ ఇటలీ నుంచి దిగుమతి అయినవి ఉంటాయి. కిచెన్ ఎక్కువ సైజులో కావాలంటే ధర మారుతుంది. కంప్లీట్ ఇంపోర్టెడ్ ఇటాలియన్ మాడ్యులర్ కిచెన్ కావాలన్నా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 3.5 లక్షల నుంచి మొదలుకుని రూ. 40 లక్షల వరకు ఉంది. యాక్సెసరీస్, డిజైన్లను బట్టి ధర మారుతుంది.
గోద్రేజ్
ఇందులో నాలుగు రకాల మాడ్యులర్ కిచెన్‌లు అందుబాటులో ఉన్నాయి. స్ట్రెయిట్ కిచెన్, గ్యాలరీ కిచెన్, ఎల్ షేప్‌డ్ కిచెన్, యూ షేప్‌డ్ కిచెన్ అని నాలుగురకాల డిజైన్లు లభిస్తున్నాయి. వీటి తయారీలో గాల్వనైజ్‌డ్ స్టీల్‌ను ఉపయోగించారు. దీని మూలంగా ఎక్కువ కాలం మన్నుతాయి. క్యాబిన్‌ట్ డోర్స్ స్టీల్‌తో తయారు చేసినవే. కలవతో చేసినవి కూడా అందుబాటులో ఉన్నాయి. అభిరుచిని బట్టి ఎంచుకోవచ్చు.
లీనియర్ కిచెన్
దేశీయంగా తయారయ్యే మాడ్యులర్ కిచెన్ ఇది. కార్‌కస్ ఎమ్‌డీఎఫ్‌తో తయారవుతుంది. ఫ్యాక్టర్ మేడ్ కిచెన్ ఇది. కార్‌కస్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్‌తో తయారుచేసింది కూడా లభిస్తోంది. దీన్ని కస్టమైజ్‌డ్ మాడ్యులర్ కిచెన్ అంటారు. ఇందులో షట్టర్స్ మెంబ్రేన్‌వి ఉంటాయి. 10్ఠ10 సైజు కిచెన్ ధర రూ. 1.5 లక్షల నుంచి మొదలవుతోంది. ఇందులో కూడా యాక్సెసరీస్‌ని బట్టి ధర మారుతుంది.
అవగాహన పెరిగింది
కొంత కాలం క్రితం వరకు మాడ్యులర్ కిచెన్‌ను సంపన్నులు మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు సైతం రెడీమేడ్ కిచెన్ కావాలని కోరుకుంటున్నారు. మాడ్యులర్ కిచెన్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. రాబోయే నాలుగైదేళ్లలో ఈ కిచెన్ ట్రెండ్ బాగా విస్తరిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి