శనివారం, జులై 9

మంచు స్వప్నం



 
ఐస్‌ క్రీం

అరెవా! భలే భలేగా ఉంది ఐస్‌క్రీమ్! రంగు, రుచి, వాసన గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని వాటిల్లో ఐస్‌క్రీమ్ ఒకటి. ఐస్‌క్రీమ్ ఒక దేశానికో, ఒక ప్రాంతానికో ఒక వయసు వారికో మాత్రమే సంబంధించింది కాదు.
ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారు అరుదుగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఐస్‌క్రీమ్ అంటే అదొక చల్లటి మంచు స్వప్నం. అందులోని రకాలు, రకరకాల ఫ్లేవర్స్, షేప్స్, సైజుల గురించి చెబుతూంటేనే నోరూరి పోతూంటుంది. ఐస్‌క్రీమ్ ఎంత రుచిగా ఉంటుందో దానికి అంత విలువైన పురాతన చరిత్ర కూడా ఉంది.


ఐస్‌క్రీమ్ చైనాలో పుట్టింది. మొదటగా గడ్డ కట్టిన మంచు, పాలతో రుచికరమైన వంటకాలు చేసినట్టు చెబుతారు. ‘మార్కోపోలో’ 700 ఏళ్ల క్రితం ఈ ఐస్‌క్రీమ్‌ను పరిచయం చేశారు. చైనా నుంచి దీని రుచి ఇటలీకి, ఫ్రాన్స్‌కి పాకింది. తర్వాత అమెరికన్లకు మహా మోజుగా మారింది. ప్రపంచమంతా విస్తరించింది.


మొదటిసారిగా 1904లో సెయింట్ లూయిస్‌లో ‘ప్రపంచ ప్రదర్శన’లో ఐస్‌క్రీంను ఉంచారు. 1921లో మొదటిగా ఐస్‌క్రీం బార్లు ప్రారంభమయ్యాయి. మొదట్లో ఐస్‌క్రీం అనేది రాజ ప్రాసాదాలకో, అధికార వర్గాలకో, ఏ కొద్ది సంపన్నులకో పరిమితంగా ఉండేది. అప్పట్లో నిల్వ ఉంచడానికి తగిన సౌకర్యాలు లేనందున ఇలా లగ్జరీగా మిగిలిపోయింది. కేవలం కొద్దిమందికే పరిమితమైన ఐస్‌క్రీమ్ రానురాను సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. వివిధ సమాజాలు, వారివారి ఆచార వ్యవహారాలను బట్టి రోజువారీ ఆహారపు టలవాట్లలో చోటు చేసుకుంది. నిజానికి రిఫ్రిజిరేటర్లు వచ్చిన తర్వాత దీనికి మరింత పాపులారిటీ పెరిగింది.


పాలు, వెన్న, చక్కెర లేదా తేనె, కోడిగుడ్లు, వివిధ రకాల పండ్లూ, విత్తనాలు, చాక్లెట్లు మొదలైనవి ఐస్‌క్రీమ్‌లో వాడటం ప్రారంభమైంది. కమర్షియల్‌గా ఐస్‌క్రీంని తయారుచేసే పద్ధతులూ కనిపెట్టారు.
మిల్క్ సాలిడ్, ఫ్యాట్స్, షుగర్, నీరు కలిపి మిక్స్ చేసి, ఐస్‌క్రీం ప్లాంట్‌లో వీటిని ‘పాశ్చరైజ్’ చేస్తారు. తర్వాత ‘హోమోజెనైజేషన్’ ప్రక్రియ ద్వారా అందులోని కొవ్వు పదార్థాలను కరిగిస్తారు. స్టోరేజ్ ట్యాంక్‌లో మూడు, నాలుగు గంటల పాటు ఉంచి తరువాత వివిధ రకాల ఫ్లేవర్లు, కలర్లు కలుపుతారు. ఫ్రీజర్లలో లిక్విడ్ అమ్మోనియా ద్వారా 30 డిగ్రీల టెంపరేచర్‌ని స్థిరంగా ఉంచుతారు. ఫ్రీజర్‌లో అత్యధిక వేగంతో తిరిగే ఫ్యాన్ వంటి బ్లేడ్ల వల్ల మిక్స్ ఫ్రీజర్ పక్కలకు చేరుకుంటుంది.


ఐస్‌క్రీంకు మంచి గాలి ఎంతో ప్రధానమైనది. ఈ గాలి చేరక పోయినట్లయితే కేవలం ఐస్ క్యూబ్‌లు తింటున్నట్టే ఉంటుంది. అలాగే గాలివల్ల మిక్స్ పరిమాణం కూడా పెరుగుతుంది. అన్ని ఐస్‌క్రీముల్లోనూ గాలి ఉంటుంది. గాలి పెరిగే కొద్దీ ఐస్‌క్రీమ్ తేలిక పడుతుంది. ఇలా గాలి ప్రవేశించడానికి ముందు వెనక ఐస్‌క్రీం పరిమాణంలో ఉండే తేడాని సాంకేతికంగా ‘ఓవర్ రన్’ అంటారు. ఇంటి అవసరాలకు ప్యాక్ చేసే ఐస్‌క్రీమ్‌లో 80 శాతం ‘ఓవర్ రన్’ ఉంటుంది. ప్యాకేజీ ముందు ఐస్‌క్రీమ్‌లో పండ్లూ, విత్తనాలు ఉంచుతారు. ప్యాకేజింగ్ అయిన తర్వాత ‘హార్డెనింగ్ రూం’లో పెడతారు.
-23 డిగ్రీల నుంచి -29 డిగ్రీల వరకూ టెంపరేచర్‌లో 12 గంటలసేపు ఈ హార్డెనింగ్ ప్రక్రియ సాగుతుంది. ఐస్‌క్రీంలో ఉండే అత్యధిక భాగం నీరు ఈ దశలోనే గడ్డ కడుతుంది.
తొలి నాళ్లలో ఐస్‌క్రీం తినాలంటే డైరీ పార్లర్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇవాళ ఐస్‌క్రీం పార్లర్లే వెలిశాయి. ఏవో కొన్ని చోట్ల మాత్రమే దొరికే ఐస్‌క్రీంలు ఇప్పుడు ప్రతి చోట్ల కనిపిస్తున్నాయి. అందుబాటులో అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఇలా బయట ఎన్ని లభిస్తున్నా చాలామంది మిహిళలకు ఇంట్లోనే ఐస్‌క్రీం తయారుచేసుకోవాలన్న సరదా ఉంటుంది. అంతేకాదు, స్వయంగా చేసిన ఈ ఐస్‌క్రీంని నలుగురికీ తినిపించి గొప్పగా ఎంజాయ్ చేయాలనుకుంటారు.
కమర్షియల్‌గా చేసిన ఐస్‌క్రీమ్‌కీ, ఇంట్లో చేసిన ఐస్‌క్రీమ్‌కీ చాలా తేడా ఉంటుంది. కానీ, ఇంట్లో చేసిన ఐస్‌క్రీమ్‌లో అదో ఆనందం.
ఐస్‌క్రీమ్ క్వాలిటీని దాని మెత్తదనాన్నిబట్టి, సులువుగా చెప్పవచ్చు. అందులో వాడే క్రీములను బట్టి అది ఉంటుంది.
వెనిల్లా, చాక్లెట్, పిస్తా, ఫ్రూట్.. ఇలా ఎన్ని వెరైటీలైనా మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. తాజా ఫలాలతో, కేకులతో, ఫుడ్డింగ్స్‌తో కలిపితే ఇక ఆ రుచి భలేగా ఉంటుంది.



చూడగానే నోరూరించడానికి ఐస్‌క్రీమ్‌లపైన చాక్లెట్ ముక్కలు, ఫ్రూట్స్, జెల్లీ, తేనె అద్దుతారు. ఇక అవి చూశాక తినేదాకా మనసు, నోరు ఊరుకోవు. ఇవాళ ఐస్‌క్రీమ్ చాలా రొటీన్ అయిపోయింది.
ప్రతి ఫంక్షన్‌లోనూ ఐస్‌క్రీమ్ ఉండాల్సిందే. పెళ్లిలో కానివ్వండి, పార్టీలో కానివ్వండి, పుట్టినరోజు వేడుకలో కానివ్వండి. ఏ కార్యక్రమంలోనైనా ఇప్పుడు ఐస్‌క్రీమ్ చివరి ఐటమ్‌గా ప్రత్యక్షమవుతుంది.

శనివారం, జులై 2

అమ్మ అమృతం అందిస్తోంది


అప్పుడే పుట్టిన పసికందులకు పుట్టిన రోజునుంచే మాతృక్షీర సేవనం అత్యుత్తమం. పెరిగిన ‘నవ నాగరికత’ వనె్న చినె్నలకు ప్రాధాన్యమిచ్చింది. తళుకు బెళుకులు తగ్గుతాయన్న బెడదలో శిశువుల జన్మహక్కులను హరిస్తున్నారు. మాతృక్షీర సేవనానికి దూరం చేస్తున్నారు. ఆ హక్కు సృష్టికర్తకు కూడా లేదు.
బిడ్డలు కన్న తల్లులందరూ తమ పాల శ్రేష్టతను గుర్తించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. కొంతమంది తల్లులు మాత్రం తమ సౌందర్యం తగ్గిపోతుందని బిడ్డలకి పాలివ్వడం లేదు. తల్లిపాలనేవి ప్రకృతి పసిబిడ్డలకు ఇచ్చిన అపూర్వ వరం. పిల్లల అభివృద్ధికి, పెరుగుదలకు ప్రాథమిక దశలో ప్రధానంగా దోహదపడేది తల్లిపాలే.
మాతృక్షీర సేవనంవల్ల బిడ్డకే కాకుండా తల్లి ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి యావత్ ప్రపంచానికే మంచిదన్నది నగ్నసత్యం. నిన్న, మొన్నటి వరకు బిడ్డపుట్టిన మూడు రోజుల వరకు ‘‘తల్లిదగ్గర పాలుండవు. ఉన్న పాలు మంచివి కావు. లేదా సరిపోవు’’ అనేటటువంటి మూఢనమ్మకాలు ఉండేవి. కానీ శాస్ర్తియ పరిశోధనల ద్వారా తెలిసిందేమిటంటే, ప్రసవానికి తరువాత మొదటి మూడు రోజులు తల్లిపాలు చాలా విశిష్ఠమైనవని, అందులో రోగనిరోధక శక్తి, విటమిన్లు అధిక మోతాదులో ఉంటాయని, ఆ కొద్దిపాలే బిడ్డకు ఆ సమయంలో సరిపోతాయని, అలాగే 4, 6 మాసాల వరకు బిడ్డకు సరిపోయే పాలు తల్లి దగ్గర ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఆర్నెల్ల తరవాత తల్లిపాలతో పాటు అనువైన అనుకూలమైన ఆహారాన్ని ఇస్తూ రెండు, మూడు సంవత్సరాల వరకు తల్లిపాలు తాగిస్తే మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మధ్యకాలంలో తల్లిపాల సంస్కృతికి అగాధం ఏర్పడుతోంది. వాణిజ్యపరంగా అమ్మబడే పాలడబ్బాలు తల్లిపాలకు సమానమని, తల్లిపాలకంటే శ్రేష్ఠమైనవని ప్రచారంలోకి వచ్చింది. ఇదే భావనతో చాలామంది తల్లులు ఆమోదిస్తూ వస్తున్నారు. రానురాను ఈ పాలపొడి వ్యాపారుల విపరీతమైన ఆకర్షణతో కూడిన ప్రకటనలతో అసలు తల్లిపాల సంస్కృతి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది.
‘‘తల్లిపాలు అమృతం’’.
తల్లిపాలకు సాటి మరొకటి లేదన్న విషయాన్ని కొన్ని దశాబ్దాలపాటు జరిపిన పరిశోధనల్లో తేల్చి చెప్పారు. ‘‘పోతపాలు ప్రమాదకరం’’ అని కూడా పరిశోధకులు చెపుతున్నారు. అయినా కొంతమంది తల్లులు ‘‘నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు’’ అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
తల్లిపాలల్లో బిడ్డకు కావలసిన అన్నిరకాల పోషక పదార్థాలతో పాటు అతిముఖ్యమైన వ్యాధి నిరోధక శక్తి ఉన్నదన్న విషయాన్ని తల్లులందరూ తప్పనిసరిగా గుర్తించాలి. పోతపాలలో ఈ వ్యాధి నిరోధకశక్తి, బిడ్డకు కావలసిన అనువైన పోషక విలువలు లేవని తెలుసుకోవాలి. పోతపాలు తాగే పసి పిల్లలు వివిధ రకాల వ్యాధులకు గురై రోజుకు నాలుగువేల మంది మృత్యువాత పడుతున్నారని అంచనా. ఈ అమాయక శిశు మరణాలకు కారణం ఆలోచిస్తే చాలామంది తల్లులకు తల్లిపాల ప్రాధాన్యత తెలియకపోవడమే. తెలిసినా తగిన ప్రోత్సాహం, సహకారం లభించకపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. వీటన్నిటికీ తోడు పాలపొడి పరిశ్రమ అసత్య ప్రకటనలు తల్లిపాల శ్రేష్ఠతను, సమర్థతను తక్కువగా అంచనా వేసేందుకు దోహదం చేస్తుంది.
చంటి బిడ్డలకు కనీసం నాలుగు నెలల నుండి ఆరునెలల వరకు ప్రతి తల్లి తల్లిపాలను మాత్రమే ఇచ్చేందుకు తగిన ప్రోత్సాహం, సహకారం కల్పించడానికి వైద్యులు సైతం నిర్దేశించాల్సిన అవసరం ఉంది. ఆర్నెల్ల తరువాత మన ఇంట్లో వండిన ఆహార పదార్థాలతో పాటు బిడ్డకు రెండు సంవత్సరాల వరకు పాలు ఇప్పించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ప్రసవించిన వెంటనే బిడ్డకు పాలివ్వడంవల్ల అధిక రక్తస్రావం అరికట్టబడుతుంది. రొమ్ము క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. అలాగే తల్లికి, బిడ్డకు మధ్య అనుబంధం పెనవేసుకునేలా... బలంగా ఉండాలంటే తప్పనిసరిగా బిడ్డకు పాలివ్వాల్సిందే. బిడ్డ భవిష్యత్తులో అలర్జీ, ఆస్మావంటి జబ్బులు, మధుమేహ వ్యాధివంటి జబ్బులు, జీర్ణాశయ వ్యాధులు, నరాల జబ్బులు రాకుండా రక్షణ కలుగుతుంది. తల్లిపాలవల్ల బిడ్డకు తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి.
కాగా, ప్రస్తుత సమాజంలో పాలిచ్చేతల్లి ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటుంది. బిడ్డకు పాలుపట్టే సమయం దొరకకపోవడం, కుటుంబ సభ్యులు సహకరించక పోవడం, కొన్నిచోట్ల వైద్యులు సరైన సహకారం అందించకపోవడం, పరిశ్రమలో అనేక అసత్య ప్రకటనలు, మూఢ నమ్మకాలు మొదలగునవి పాలిచ్చే తల్లి సహజ హక్కును కాలరాస్తున్నాయ.
తల్లిబిడ్డకు పాలివ్వడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి పొందే తృప్తి, అనుభూతి వర్ణనాతీతం. నిజంగా తల్లిపాలివ్వడం ఒక వరం. ఏవేవో కారణాలు చూపించి, బిడ్డకి పాలివ్వక పోవడం క్షమించరాని నేరం. పుట్టిన బిడ్డ క్షేమం కన్నా కన్నతల్లి కోరుకునేది ఏముంటుంది? తన బిడ్డ క్షేమం కోరే ప్రతి తల్లి బిడ్డకు పాలివ్వడం సంస్కారం, ఆచారం. అదే మన సంస్కృతి, పాలిచ్చిన తల్లికి అప్పుడే మనజాతి తలవంచి నమస్కారం చేస్తుంది.
ఈ మధ్యకాలంలో చాలామంది తల్లులు తమ సౌందర్యం తగ్గి పోతుందని బిడ్డలకు పాలివ్వడం లేదు. ఇది చాలా దారుణం. బిడ్డలకి పాలిస్తే సౌందర్యం తగ్గిపోతుందనుకోవడం వట్టి భ్రమే. ఇలాంటి అపోహలతో కొంతమంది తల్లులు బిడ్డలకి పాలివ్వడం మాన్పించేస్తున్నారు. ఇది స్ర్తి జాతికే కళంకం. బిడ్డకు పాలివ్వడం అనేది సృష్టి రహస్యాల్లో ఒక అంశం. దాన్ని అందరూ ఆమోదించాల్సిందే.
- కంచర్ల సుబ్బానాయుడు

టీనేజ్ అంటే ఒక తరంగం.



టీనేజ్ అంటే ఒక తరంగం... ఒక ఆవేశం... ఒక తొందర పాటు... ఒక ఆకర్షణ.
ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, ప్రేమలో పడిపోవడం, గాడి తప్పడం, అవసరమైతే తల్లిదండ్రులను కూడా కాదనడం ఈ రోజుల్లో సహజంగా మారింది.
దీనితో నేటి ఆధునిక యువతీ యువకుల్లో అనేక సమస్యలు వస్తున్నాయి. జీవితానికి సంబంధించి అవి చిన్నవైనా కావచ్చు. అయితే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉంది.
మనం రోజూ ఎందరినో చూస్తుంటాం. ఒక్కొక్కరిదీ ఒక్కో రకం వ్యక్తిత్వం. ఎదుటి వారి మనస్తత్వం బట్టి కొన్ని చోట్ల నడుచుకోవాలి. మనశక్తి సామర్థ్యాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వాతావరణం, అర్హతలనుబట్టి మనుగడ సాగించాలి. జీవనాధారం కోసం ఒక వృత్తిని ఎంచుకోవడం తప్పనిసరి. ఉద్యోగం అంటే నూటికి నూరుపాళ్ళు పక్కాగా వృత్తిపరమైనది. దాన్ని ఎంచుకునే ముందు కడు జాగ్రత్త వహించాలి. జీవితంలో తేడాలు లేకుండా ఒకేసారి నాలుగైదు చోట్ల ఆఫర్లు వస్తుంటాయి. దేన్ని ఎంచుకోవాలనే విషయంలో చాలా గందరగోళానికి గురి చేస్తుంది.
అలాంటప్పుడు జాబ్ గుణగణాలు, టైమింగ్స్, వాతావరణం, నివాసానికి, ఆఫీసుకి మధ్య దూరం, రాకపోకలకు అనుకూలత లాంటి అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి, మీ అభిమతానికి, అర్హతకి అనుగుణంగా ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. పొరపాటున మనకు అనుకూలం కాని జాబ్‌లో చేరిన వెంటనే రిజైన్ చేయకుండా మరో జాబ్‌లో చేరేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే చేస్తున్న మొదటి ఉద్యోగానికి ముగింపు పలకాలి.
యూత్‌లో చాలామంది ఎప్పుడో ఒకసారి ‘‘నేను ప్రేమిస్తున్నాను’’ అనుకుంటారు. నిజంగానే తమ వైపునుంచి ప్రేమలో పడిపోతారు. కానీ ఎదుటివారుకూడా మనల్ని ప్రేమిస్తున్నారా? లేదా అని ఆలోచించరు. మీరు ప్రేమిస్తున్న వారు ‘నో’’ అంటే మీరు తట్టుకోగలగాలి. ఆందోళన చెందకుండా ఉండాలి. ఆ వ్యక్తికి ఎలాంటి వ్యసనాలున్నా భరించగలగాలి. ఆ తర్వాత మార్పు చేసుకోవాలి. అలాంటి గుణం మీరు కలిగినట్టయితే నిజంగా ప్రేమిస్తున్నట్టు లెక్క. సినిమాలు, షికార్లలో మనం ఏం చూస్తే వాటిల్లో సగమైన మనకూ ఉండాలనిపిస్తుంది. కానీ అది అసంభవం కావచ్చు కదా. అప్పుడే మరో ఆలోచన కూడా వస్తుంది. ఒక్కసారిగా బ్రహ్మాండం జరగాలని, అదృష్టం వరించాలని ఇది ఏ నూటికో, కోటికో ఒక్కరికే జరగొచ్చు. అందరికీ కాదుకదా. అందుకే వారానికో ఎంతో కొంత పొదుపు చేసుకుంటూ వెళితే ఐదారు సంవత్సరాలకి పెద్ద మొత్తంగా ఉపయోగించుకోవచ్చు. మనకు ఏమేం కోరికలుంటాయో వాటిని తీర్చుకోవడానికి పొదుపు యంత్రం పాటించాలి.
ఆకలైనా, కాకపోయినా అప్పుడప్పుడు చిళ్ళు తినడం యూత్‌కు అలవాటే. ఐస్‌క్రీమ్‌లు, పానీపూరీలు ... గోబీ... లాంటివి తినడం అంటే సరదా. కానీ నిజంగా ఆకలేస్తుందా అన్నది ఆలోచించుకుంటే వాటి అవసరం ఎంతో తెలుస్తుంది. లేదనుకుంటే మీకు గిఫ్ట్ గ్యారంటీ... అదే ఊబకాయం. రెండు. మూడుసార్లు చిరుతిళ్ల విషయంలో నాలుకను నియంత్రించగలిగితే మరోసారి ఆలోచన రాదు. ఆదిలో ఆ అలవాటును అంతం చేసుకుంటే ఎప్పటికీ మీరు స్లిమ్‌గా యాక్టివ్‌గా ఉండొచ్చు. మీతో అందరూ క్లోజ్‌గా ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే వారిలో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయాలో గమనించాలి. మీకు దగ్గరగా ఉండే వారందరూ ఏ సందర్భంలో సన్నిహితులయ్యారో ఒకసారి మననం చేసుకుంటే తెలుస్తుంది.
మీరు చేసేపనికి తల్లిదండ్రులు లేదా బంధుమిత్రులు అడ్డు చెప్పవచ్చు. అలాంటప్పుడు మీరు చేపట్ట్టే పని గురించి క్షుణంగా చెప్పాలి. మీరు మంచి అవగాహనతోనే వారికి అర్థం అయ్యేలా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే మీకు లైన్ క్లియర్, ఇక మీరు ఏ పనైనా... ఛాలెంజ్‌గా ... అవలీలగా చేయొచ్చు. అప్పుడే మీకు మీ వారికి... అందరికీ హ్యాపీ... కష్టే ఫలే ..
- కంచర్ల