శనివారం, జులై 2

అమ్మ అమృతం అందిస్తోంది


అప్పుడే పుట్టిన పసికందులకు పుట్టిన రోజునుంచే మాతృక్షీర సేవనం అత్యుత్తమం. పెరిగిన ‘నవ నాగరికత’ వనె్న చినె్నలకు ప్రాధాన్యమిచ్చింది. తళుకు బెళుకులు తగ్గుతాయన్న బెడదలో శిశువుల జన్మహక్కులను హరిస్తున్నారు. మాతృక్షీర సేవనానికి దూరం చేస్తున్నారు. ఆ హక్కు సృష్టికర్తకు కూడా లేదు.
బిడ్డలు కన్న తల్లులందరూ తమ పాల శ్రేష్టతను గుర్తించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. కొంతమంది తల్లులు మాత్రం తమ సౌందర్యం తగ్గిపోతుందని బిడ్డలకి పాలివ్వడం లేదు. తల్లిపాలనేవి ప్రకృతి పసిబిడ్డలకు ఇచ్చిన అపూర్వ వరం. పిల్లల అభివృద్ధికి, పెరుగుదలకు ప్రాథమిక దశలో ప్రధానంగా దోహదపడేది తల్లిపాలే.
మాతృక్షీర సేవనంవల్ల బిడ్డకే కాకుండా తల్లి ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి యావత్ ప్రపంచానికే మంచిదన్నది నగ్నసత్యం. నిన్న, మొన్నటి వరకు బిడ్డపుట్టిన మూడు రోజుల వరకు ‘‘తల్లిదగ్గర పాలుండవు. ఉన్న పాలు మంచివి కావు. లేదా సరిపోవు’’ అనేటటువంటి మూఢనమ్మకాలు ఉండేవి. కానీ శాస్ర్తియ పరిశోధనల ద్వారా తెలిసిందేమిటంటే, ప్రసవానికి తరువాత మొదటి మూడు రోజులు తల్లిపాలు చాలా విశిష్ఠమైనవని, అందులో రోగనిరోధక శక్తి, విటమిన్లు అధిక మోతాదులో ఉంటాయని, ఆ కొద్దిపాలే బిడ్డకు ఆ సమయంలో సరిపోతాయని, అలాగే 4, 6 మాసాల వరకు బిడ్డకు సరిపోయే పాలు తల్లి దగ్గర ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఆర్నెల్ల తరవాత తల్లిపాలతో పాటు అనువైన అనుకూలమైన ఆహారాన్ని ఇస్తూ రెండు, మూడు సంవత్సరాల వరకు తల్లిపాలు తాగిస్తే మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మధ్యకాలంలో తల్లిపాల సంస్కృతికి అగాధం ఏర్పడుతోంది. వాణిజ్యపరంగా అమ్మబడే పాలడబ్బాలు తల్లిపాలకు సమానమని, తల్లిపాలకంటే శ్రేష్ఠమైనవని ప్రచారంలోకి వచ్చింది. ఇదే భావనతో చాలామంది తల్లులు ఆమోదిస్తూ వస్తున్నారు. రానురాను ఈ పాలపొడి వ్యాపారుల విపరీతమైన ఆకర్షణతో కూడిన ప్రకటనలతో అసలు తల్లిపాల సంస్కృతి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది.
‘‘తల్లిపాలు అమృతం’’.
తల్లిపాలకు సాటి మరొకటి లేదన్న విషయాన్ని కొన్ని దశాబ్దాలపాటు జరిపిన పరిశోధనల్లో తేల్చి చెప్పారు. ‘‘పోతపాలు ప్రమాదకరం’’ అని కూడా పరిశోధకులు చెపుతున్నారు. అయినా కొంతమంది తల్లులు ‘‘నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు’’ అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
తల్లిపాలల్లో బిడ్డకు కావలసిన అన్నిరకాల పోషక పదార్థాలతో పాటు అతిముఖ్యమైన వ్యాధి నిరోధక శక్తి ఉన్నదన్న విషయాన్ని తల్లులందరూ తప్పనిసరిగా గుర్తించాలి. పోతపాలలో ఈ వ్యాధి నిరోధకశక్తి, బిడ్డకు కావలసిన అనువైన పోషక విలువలు లేవని తెలుసుకోవాలి. పోతపాలు తాగే పసి పిల్లలు వివిధ రకాల వ్యాధులకు గురై రోజుకు నాలుగువేల మంది మృత్యువాత పడుతున్నారని అంచనా. ఈ అమాయక శిశు మరణాలకు కారణం ఆలోచిస్తే చాలామంది తల్లులకు తల్లిపాల ప్రాధాన్యత తెలియకపోవడమే. తెలిసినా తగిన ప్రోత్సాహం, సహకారం లభించకపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. వీటన్నిటికీ తోడు పాలపొడి పరిశ్రమ అసత్య ప్రకటనలు తల్లిపాల శ్రేష్ఠతను, సమర్థతను తక్కువగా అంచనా వేసేందుకు దోహదం చేస్తుంది.
చంటి బిడ్డలకు కనీసం నాలుగు నెలల నుండి ఆరునెలల వరకు ప్రతి తల్లి తల్లిపాలను మాత్రమే ఇచ్చేందుకు తగిన ప్రోత్సాహం, సహకారం కల్పించడానికి వైద్యులు సైతం నిర్దేశించాల్సిన అవసరం ఉంది. ఆర్నెల్ల తరువాత మన ఇంట్లో వండిన ఆహార పదార్థాలతో పాటు బిడ్డకు రెండు సంవత్సరాల వరకు పాలు ఇప్పించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ప్రసవించిన వెంటనే బిడ్డకు పాలివ్వడంవల్ల అధిక రక్తస్రావం అరికట్టబడుతుంది. రొమ్ము క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. అలాగే తల్లికి, బిడ్డకు మధ్య అనుబంధం పెనవేసుకునేలా... బలంగా ఉండాలంటే తప్పనిసరిగా బిడ్డకు పాలివ్వాల్సిందే. బిడ్డ భవిష్యత్తులో అలర్జీ, ఆస్మావంటి జబ్బులు, మధుమేహ వ్యాధివంటి జబ్బులు, జీర్ణాశయ వ్యాధులు, నరాల జబ్బులు రాకుండా రక్షణ కలుగుతుంది. తల్లిపాలవల్ల బిడ్డకు తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి.
కాగా, ప్రస్తుత సమాజంలో పాలిచ్చేతల్లి ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటుంది. బిడ్డకు పాలుపట్టే సమయం దొరకకపోవడం, కుటుంబ సభ్యులు సహకరించక పోవడం, కొన్నిచోట్ల వైద్యులు సరైన సహకారం అందించకపోవడం, పరిశ్రమలో అనేక అసత్య ప్రకటనలు, మూఢ నమ్మకాలు మొదలగునవి పాలిచ్చే తల్లి సహజ హక్కును కాలరాస్తున్నాయ.
తల్లిబిడ్డకు పాలివ్వడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి పొందే తృప్తి, అనుభూతి వర్ణనాతీతం. నిజంగా తల్లిపాలివ్వడం ఒక వరం. ఏవేవో కారణాలు చూపించి, బిడ్డకి పాలివ్వక పోవడం క్షమించరాని నేరం. పుట్టిన బిడ్డ క్షేమం కన్నా కన్నతల్లి కోరుకునేది ఏముంటుంది? తన బిడ్డ క్షేమం కోరే ప్రతి తల్లి బిడ్డకు పాలివ్వడం సంస్కారం, ఆచారం. అదే మన సంస్కృతి, పాలిచ్చిన తల్లికి అప్పుడే మనజాతి తలవంచి నమస్కారం చేస్తుంది.
ఈ మధ్యకాలంలో చాలామంది తల్లులు తమ సౌందర్యం తగ్గి పోతుందని బిడ్డలకు పాలివ్వడం లేదు. ఇది చాలా దారుణం. బిడ్డలకి పాలిస్తే సౌందర్యం తగ్గిపోతుందనుకోవడం వట్టి భ్రమే. ఇలాంటి అపోహలతో కొంతమంది తల్లులు బిడ్డలకి పాలివ్వడం మాన్పించేస్తున్నారు. ఇది స్ర్తి జాతికే కళంకం. బిడ్డకు పాలివ్వడం అనేది సృష్టి రహస్యాల్లో ఒక అంశం. దాన్ని అందరూ ఆమోదించాల్సిందే.
- కంచర్ల సుబ్బానాయుడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి