బుధవారం, ఏప్రిల్ 6

పెళ్లి కళ వచ్చిందే బాలా!

 
 
 
 పెళ్లికి ... అతివల  ఇలా ! 
పెళ్ళి... ఎవరి జీవితంలోనైనా మరపురాని మధురమైన ఘట్టం.
అలాంటి అపురూప క్షణాల్లో పెళ్ళికి వచ్చిన బంధు మిత్రుల సపరివారానికి నవ వధూవరులు అందంగా, ఆనందంగా కన్పించడం చాలా అవసరం.
ఆధునిక పోకడలను సంతరించుకున్న ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా కనిపించడం సర్వసాధారణం. పైగా పెళ్లి దృశ్యాలను కెమెరాలో బంధించి పదికాలాలపాటు పదిలంగా దాచుకుంటాం.. చూసుకుంటాం కూడా. అందుకే... మళ్ళీ మళ్ళీ రాని పెళ్ళిరోజున అతివలు అందంగా, సౌందర్యరాశిగా మిలమిలా మెరిసిపోవాలంటే.. ఎవరికివారుగా కొద్దిపాటి శ్రద్ధ వహిస్తే చాలు. అందం మీ స్వంతం.
అందానికి మెరుగులు దిద్దే ప్రక్రియలో బ్యూటీ పార్లర్లు వెలసాయి. పల్లెల్లో కూడా కొందరు మహిళలు హౌస్ బ్యూటీషియన్లుగా తయారయ్యారు. అయితే.. ఎవరి సహాయం లేకపోయినా మీరు బ్యూటీగా తయారుకావచ్చు. బ్యూటీషియన్స్ అందుబాటులో లేరని ఏ మాత్రం చింతించవద్దు. కొద్దిపాటి ప్రణాళికతో సొంతంగా ఎవరిని వారే అందంగా తీర్చిదిద్దుకోవచ్చు సుమా! కావాలంటే చూడండి!
పెళ్ళి ఆలోచన మొదలైనప్పట్నుంచే అతివలు తమ జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారం, వ్యాయామం మీ ప్రాధాన్యతాంశాలు కావాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ప్రొద్దున ఆలస్యంగా లేవడం మానుకోవాలి. తగినంత నిద్ర ఎంత అవసరమో... సరైన వేళ పాటించడమూ అంతే అవసరం.
జరగబోయే విషయాల గురించి అనవసరంగా ఆందోళన చెందే మనస్తత్వం మీదైతే రోజూ కాసేపు ధ్యానం చేసి దాన్ని అధిగమించండి. మానసిక ప్రశాంతత చర్మాన్ని సైతం మెరిపిస్తుంది.
తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకోండి. దోస, క్యారెట్లు, బీట్‌రూట్ లాంటివి శక్తినివ్వడమే కాదు మేనిఛాయను మెరిపిస్తాయి.
నీరు పుష్కలంగా తాగండి. ఏర్పాట్ల హడావుడిలో అదేపనిగా తిరుగుతారు కాబట్టి మీ వెంట మంచినీటి సీసా ఉండి తీరాల్సిందే. ఎక్కడపడితే అక్కడి నీరు తాగనే కూడదు. మినరల్ వాటరయితే
ఫర్వాలేదు. దాహం అధికమనిపిస్తే కొబ్బరి బోండాం తాగాలి కానీ కూల్‌డ్రింకుల జోలికి పోకుండా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. వీలైతే పండ్ల రసాలను సేవించండి. కళ్ళ చుట్టూ నల్లని వలయాలకు క్యారెట్ రసం విరుగుడు.
మీ పెళ్ళి వేసవి కాలంలో జరుగుతున్నా, శీతా కాలంలో జరుగుతున్నా ఇతరత్రా పనులకు బయటకు వెళ్ళేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వెంట గొడుగు తప్పనిసరి. కళ్ళజోడు వాడటం అలవరచుకుంటే కళ్ళకు మంచిది. కాలానికి తగినట్టుగా మీరు బయట తిరిగేదానికి సౌకర్యమైన దుస్తులు ధరించాలి. పనులు ముగించుకుని ఇంటికి రాగానే మంచినీటితో ముఖం కడుక్కుని సేదదీరితే మీ శరీరానికి, మనసుకు హాయనిపిస్తుంది. మెదడుకు బాగా పని కలిగి అలసిపోయినవారు కళ్ళమీద చక్రాల్లా తరిగిన బంగాళాదుంప ముక్కలు కానీ, దోస ముక్కలు కాని పెట్టుకుంటే కళ్ళ అలసట తగ్గుతుంది.
పెళ్ళికి నాలుగైదు వారాలముందే శిరోజాల విషయంలో కాస్త శ్రద్ధ వహించడం మొదలెట్టాలి. కేశాలంకరణ ఎలా చేసుకుంటారో దానికి తగినట్టుగా మీ వెంట్రుకలను తీర్చిదిద్దుకోవాలి. హెయిర్ డ్రయ్యర్ వాడనే కూడదు. వారంలో ఒకటి రెండుసార్లు కండిషనర్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
శుభఘడియలు దగ్గరపడినకొద్దీ.. మీ తయారీ వేగమంతమవ్వాలి. వారం, పదిరోజులముందు వ్యాక్సింగ్ చేయించుకుని ఆ తర్వాత మళ్ళీ పెళ్లి ముందు రోజు చేయించుకోవడం అవసరం. పార్లర్లో బ్రైడల్ మేకప్ చేయించుకుంటున్నట్లైతే మీ పెళ్లి తేది, సమయం చెప్పి ముందుగానే కచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇంటి దగ్గర బంధువులో, స్నేహితులో పరిచయస్తులో చేస్తున్నట్లయితే రెండు మూడు రోజుల ముందే ఒకసారి మీకు ఎలాంటి మేకప్ నప్పుతుందో తెలుసుకోవాలి. రెండు రోజుల ముందు ఫేషియల్ చేసుకుంటే చాలా మంచిది. ఈ సందర్భం కోసం కుట్టించుకున్న దుస్తులన్నీ ముందుగానే ఒకసారి వేసి చూసుకుంటే.. ఏమన్నా తేడాలుంటే.. సరిచేసుకోవడానికి వీలవుతుంది. అంటే.. రిహార్సల్ అన్నమాట.
పెళ్ళికి ఒకరోజు ముందు మ్యానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకోవాలి. పెళ్ళి దగ్గర్లోకి వచ్చాక కొత్తగా మేకప్ వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ వాడకండి. తేడా వస్తే కష్టం. ఇక, వీటన్నిటికీ ఫినిషింగ్ టచ్... మనసారా నచ్చి చేసుకుంటూ.. కళ్ళనిండా కమ్మని కలలతో ఆనందకరమైన భవిష్యత్తుకు స్వాగతగీతం పలికే పెళ్ళికళ!
-కంచర్ల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి