మంగళవారం, ఏప్రిల్ 12

నేటి ఫ్యాషన్ ట్రెండ్ ..జీన్స్


ఫ్యాషన్  ట్రెండ్  ..జీన్స్


 


ఒకప్పుడు జీన్స్ వన్ ఆఫ్ ది డ్రెసెస్... కానీ ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ స్టైల్... అదే నేటి యువత ప్యాషన్ స్టేట్‌మెంట్. కొన్ని కాలేజీల్లో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. స్టూడెంట్స్‌కు కొత్తగా డ్రెస్ కోడ్ ఏమైనా విధించారా అని అనుమానం వేస్తుంది.
ఎందుకో తెలుసా...?

ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ జీన్స్ ప్యాంట్స్. అబ్బాయిలే కాదు.. అమ్మాయిల సంగతీ అంతే.. ఇంకో మాటలో చెప్పాలంటే జీన్స్ ధరించే వారిలో అమ్మాయిలే ఎక్కువే. అబ్బాయిలకు ప్యాంట్స్ విషయంలో ప్రత్యామ్నాయాలున్నా, అమ్మాయిలు మాత్రం జీన్స్, కాటన్స్ మాత్రమే ధరిస్తున్నారు. జీన్స్ స్టైలే వేరని అంటున్నారు.

జీన్స్‌లో ఫ్యాషన్, స్టైల్స్‌తోపాటు కంఫర్ట్ కూడా ఉండడంతో వాళ్ళంతా దానికే ఓటేస్తున్నారు. వీళ్ళందరినీ చూశాక మేమెందుకు వేయకూడదంటూ చిన్నపిల్లలు మొదలుకొని అరవై ఏళ్ళ వయసు వాళ్ళ వరకు అందరూ ఇష్టపడి ఇదే కొత్త ఫ్యాషన్‌గా మార్చుకుంటున్నారు.


జీన్స్ రెగ్యులర్ వేర్‌లో ఒక భాగంగా మారిపోయింది. ఒకే రకంగా మూసపోసినట్టు బ్లూ రంగులో మాత్రమే ఉండే జీన్స్‌లో కూడా ఫ్యాషన్ ట్రెండ్స్ నేడు ఎన్నో మార్పులు తెచ్చాయి.
రకరకాల స్టయిల్స్‌లో, మోడల్స్‌లో యువతను ఆకట్టుకునేలా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్‌కి ప్రత్యేక స్థానం ఉందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.


ఫ్యాషన్‌కు తగ్గట్టు ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా తగిన ఫిట్స్ లభించడమే జీన్స్ ప్రత్యేకత. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, వేస్ట్, హిప్స్, ఎట్లా ఉన్నా అందరికీ తగిన ఫిట్స్ లభిస్తున్నాయి. ఈ ఫిట్స్ వారివారి శరీరాకృతికి నప్పేలా కూడా ఉంటున్నాయి. స్టయిల్‌గా ఉండడం ఈ ఫిట్స్‌కు అదనపు ఆకర్షణ. అందుకే జీన్స్ అంటే చిన్న, పెద్ద అందరూ ఇష్టపడతారు. బటన్‌పై, స్ట్రెయిట్ లెగ్, స్లిమ్ ఫిట్, బూట్ కట్, లోబూట్ కట్, రిలాక్స్‌డ్ బూట్ కట్, కంఫర్ట్ ఫిట్, రెగ్యులర్ ఫిట్, రిలాక్స్‌డ్ ఫిట్, అంటూ రకరకాల ఆకృతులలో వస్తున్నాయి.

స్టోన్ వాష్, ఆసిడ్ వాష్, ఐడల్ వాష్, రాబిన్‌సన్ వాష్ పేరిట జీన్స్‌లో వివిధ రకాల వాష్‌లు అందుబాటులో ఉంటున్నాయి. అక్కడక్కడా రంగు వెలసిపోయి రఫ్‌గా కనిపించే ఈ జీన్స్‌లో అదనపు ఆకర్షణగా ఉంటుంది. ఇక ప్యాంటు అక్కడక్కడా దారాలు వేలాడుతూ ఉండడం కూడా ఓ ఫ్యాషన్‌గా మారింది. వీటిని ఛోపర్, డిస్ట్రక్షన్, వర్క్ జీన్స్‌గా పిలుస్తారు.
అమ్మాయిల ఒంటి విరుపులకు అనుగుణంగా లోఫ్లేర్, సూపర్ లోఫ్లేర్, స్ట్రెచ్‌లలో జీన్స్, సూపర్ లోబూట్‌కట్ అంటూ అందమైన డిజైన్లలో అనేక రకాల జీన్స్ అందుబాటులో వచ్చాయి.
జీన్స్ సక్సెస్‌కి అంతాదాని అందుబాటు గుణంలోనే ఉంది. మధ్యతరగతి నుంచి ధనికుల వరకు అందరి స్థోమతకు తగిన ధరల్లో ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. వంద రూపాయలు మొదలుకొని ఐదారువేలకు పైగా జీన్స్ ధర పలుకుతున్నాయి. సాధారణ కంపెనీ జీన్స్, మూడు వందలకే లభ్యమవుతున్నాయి. లీ, రాంగ్లర్, లెవీస్, పెపె, డాకర్స్, డిక్కీస్, ఆక్సంబర్గ్, బఫెల్లో, పాయిజన్, కిల్లర్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ జీన్స్ కూడా ఏడొందల నుండి ప్రారంభమై రెండువేలకు పైబడిన రేంజ్‌లో లభిస్తున్నాయి.

జీన్స్ స్టయిల్‌గా ఉండడంతోపాటు వెచ్చగా అనిపిస్తాయి. మందంగా ఉండే జీన్స్ ప్యాంట్లను ఏ కాలంలో ధరించినా ఇబ్బంది లేదు. వేసవిలో వీటికి చెమటను పీల్చే గుణం ఉంటుంది. చలికాలం జీన్స్‌లో ఉన్నంత సుఖం ఎందులోనూ లేదు.
అందుకే చాలామంది ముఖ్యంగా కుర్రకారు స్వెటర్లు, జర్కిన్‌ల కన్నా జీన్స్ జాకెట్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. వీటితోపాటు జీన్స్ షర్ట్‌లుకూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. డెనిమ్ షర్ట్స్‌గా పిలవబడే జీన్స్ కూడా చలిని దూరంగా ఉంచుతాయి. అందులో ఇవి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

కొన్ని కంపెనీల వాళ్ళు పదహారేళ్ళ వయసు వారి నుంచి 25 ఏళ్ళ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా జీన్స్ ప్యాంట్లు, టాప్‌లు తయారు చేస్తున్నారు. ఎంబ్రాయిడరీ, స్టడెడ్, రిబ్బన్ జీన్స్, ఇలా రకరకాలుగా మంచి అల్లికతో తయారయ్యే జీన్స్ అమ్మాయిలను బాగా ఆకట్టుకుంటున్నాయి. టీనేజ్‌లో ఉన్న అమ్మాయి, అబ్బాయిల కోసం కొన్ని కంపెనీలు అనేక షేడ్స్‌లో బోలెడు మోడల్స్‌లో రూపొందిస్తున్నారు. మరి కొన్ని కంపెనీలు ఏ టు జెడ్ అంటూ రకరకాల డిజైన్లు, పువ్వుల ఎంబ్రాయిడరీలతో, అబ్‌స్ట్రాక్ట్ ప్రింటులతో, శాటిన్ ట్రిమ్మింగ్స్‌తో, బ్లూ, చార్‌కోల్, నలుపు, తెలుపు రంగురంగుల జీన్స్ నేడు మార్కెట్‌లో అన్ని వయసుల వారికి లభిస్తున్నాయి. చిన్నపిల్లల మొదలుకొని అరవై ఏళ్ళ వయసువారి వరకు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందుకే జీన్స్ అంటే నేడు అందరికీ క్రేజ్...
మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్ వేషధారణలో కూడా మార్పులు తెస్తున్నాయి. అందులో భాగమే అమ్మాయిల డ్రస్సింగ్ స్టయిల్లో మార్పులు చోటు చేసుకోవడం.
పంజాబీ సూట్స్ వచ్చి లంగా వోణీల ట్రెండ్‌కు స్వస్తి పలికితే... జీన్స్ ప్యాంట్లు వచ్చి పంజాబీ సూట్స్‌ను పక్కకు నెట్టేసాయి.. నేటి తరం అమ్మాయిల ఫ్యాషన్ స్టేట్‌మెంట్ జీన్స్.


‘‘్ఫర్మల్ ప్యాంట్స్ అరుదుగా ధరిస్తాం. జీన్స్ స్టయిల్‌గా కనిపిస్తాయి. రఫ్ అండ్ టఫ్‌గా ఉంటాయి. ఎట్లా మెయింటెయిన్ చేసినా ఫ్యాషన్‌బుల్‌గానే ఉంటాయి’’ అని ఆనంద్ ఇన్‌స్టిట్యూట్‌లో సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ సునీల్ అంటున్నాడు. ఈ కుర్రాడికి అనేక రంగుల్లో అనేక మోడల్స్ జీన్స్ ఉన్నాయిట. ఎప్పుడూ జీన్స్ వాడుతాడుట. అవే కంఫర్టని చెబుతాడు. ‘‘జీన్స్ స్టయిల్‌గా ఉండటమే కాదు. రేటు అందుబాటులో ఉంటున్నాయి. ఫ్యాషన్‌తో పాటు ఎక్కువ కాలం డ్రెస్ వేసుకోవచ్చు.
ప్యాంటు చిరిగినా, దారాలు వేలాడినా ఫ్యాషనే. ఫ్రెండ్స్‌తో పాటు అమ్మాయిలూ జీన్స్ ధరించిన అబ్బాయిల్ని లైక్ చేస్తార’’ని ఇంజనీరింగ్ చదివి, జావా చేస్తున్న శ్రీకాంత్ అన్నాడు. ‘జీన్స్’ ధరించ డం ఇప్పుడు యువతకు కల్చర్‌గా మారిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పెద్దపెద్ద నగరాల్లోనే కాదు, పట్టణాల్లోనూ చివరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ యువతీ యువకులతో పాటు వయసుపైబడిన వారు కూడా జీన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టు అన్ని ప్రాంతాల్లోనూ, అన్నిరకాల జీన్స్ అందుబాటులోకి వచ్చాయి. కొత్తకొత్త సొబగులు అద్దుకొని మార్కెట్లోకి వస్తున్న లేటెస్ట్ జీన్స్‌ని ఫాస్ట్‌గా ఫాలో అయిపోండి ఇక...
- కంచర్ల
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి