గురువారం, ఆగస్టు 4

ప్రవాసులకు తానా టీమ్ స్క్వేర్ సేవలు


: అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల కోసం తానా సంస్థ అనేక సహాయ సహకారాలను అందజేస్తున్నది. అమెరికాలో ప్రమాదవశాత్తు మరణించిన వారి భౌతిక కాయాలను భారతదేశానికి తరలించడానికి తానా బృందం టీమ్ స్క్వేర్ ఎంతగానో కృషి చేస్తున్నదని తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర వెల్లడించారు.

ఇటీవల అయోవాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మద్ది సురేస్ బాబు (37) పరిమితికి మించి అధికంగా మందులు సేవించడం వల్ల జూలై 11న మృతి చెందారు. బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేట్ అయిన సురేష్ స్వస్థలం గుంటూరు జిల్లా లోని దూలిపల్లి గ్రామం. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ బాబు భౌతిక కాయాన్ని భారత దేశానికి తరలించడానికి సహాయాన్ని అందించవలింసిందిగా సురేష్ స్నేహితులు , కుటుంబసభ్యులు కలిసి తానాను కోరడంతో వెంటనే స్పందించిన టీమ్ స్క్వేర్ చైర్మన్ అంజయ్య చౌదరి లావు, తానా ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ నన్నపనేని సురేష్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు చేరుకునేలా అన్ని ఏర్పాట్లను చేశారని ఆయన వివరించారు.

జూలై 3 న శ్రీమతి డోకె అనే మహిళ మృతి చెందారు. ఆమె మృతదేమాన్ని జూలై 6 హైదరాబాద్‌కు తరలించారు. జూలై 4 న ఐ.టీ. కన్సల్టెంట్ అయిన జయరామ్ పంగిపల్లి ప్రమాదవ శాత్తు టెన్నీసీ నదిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని జూలై 6 న హైదరాబాద్‌కు తరలించారు. జూలై 7 న వీరభద్రం గుండె పోటుతో మరణించారు. ఆయన మృత దేహాన్ని జూలై 10న చెన్నైకి తరలించారు.

అమెరికాలో మరణించిన మద్ది, డోకె, పంగిపల్లి, వీరభద్రం కుటుంబాలకు తానా అధ్యక్షులు తోటకూర తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇంతటి సహాయ సహకారాలు అందించిన తానా బృందం స్క్వేర్ వాలంటీర్లు అయిన గోపాల్ వేదుల, నగేష్ నర్మత్, సురేష్ కాకర్ల, హనుమంత్ కంతి, వెంకట్ దుడ్డుకూరి, కవిత, పద్మ, జగన్మోహన్‌లకు అలాగే చనిపోయిన వారి మృతదేహాలను భారత దేశానికి తరలించడానికి సహాయ సహకారాలు అందించిన తానా నాయకులు అంజయ్య చౌదరి లావు, మోహన్ నన్నపనేనిలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి