శుక్రవారం, ఆగస్టు 26

మనం సైతం.. మెరుగైన సమాజం కోసం


ఇప్పటి జీవితాలు ఎంత యాంత్రికం వేగవంతం అయ్యాయంటే పక్క ఇంట్లో ఉంటున్న వాళ్లెవరో తెలియనంత. తమ కుటుంబం బావుంటే చాలు. తాము బాగా సంపాదించి కుటుంబ సభ్యుల్ని సంతోషపెడితే చాలు. పక్కనున్న సమాజం ఏమైపోతే మనకేం అనే ధోరణి ప్రబలిపోతోంది. వ్యక్తిగత స్వార్థం మంచిదే. కానీ, సమాజంలో మంచి పౌరులుగా మనవంతు బాధ్యతను నెరవేర్చవలసిన అవసరం లేదా? ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటే మెరుగైన సమాజం సాధ్యమవుతుందా? మా కష్టాలు మాకున్నాయి. మా జీవన పోరాటంతోనే మాకు సరిపోతుంది. సమాజాన్ని ఉద్ధరించటానికి మేమేం మహాత్మాగాంధీలం కాదు- అన్నీ వదిలేసుకున్న (సర్వసంగ) పరిత్యాగులం కాము అని వాదించే వాళ్లున్నారు. కుటుంబాన్ని వీధులపాలు చేసి సమాజం కోసం నడుం బిగించమని ఎవరూ చెప్పరు. ఒక మంచి తండ్రి/తల్లి ఒక మంచి భార్య/్భర్త, ఒక మంచి పొరుగువాడు, ఒక మంచి స్నేహితుడు... వీటి తర్వాత మంచి పౌరుడుగా గుర్తింపు పొందాలని చేసే ప్రయత్నం చేయమని చెప్పటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. ఇందుకు మీ ఆస్తిపాస్తులను అనాధ శరణాలయాలకో, గుడులు గోపురాలకో దానం చేయనవసరం లేదు. మీకున్న దానిలో కొంత -మీ మనసుకు నచ్చినంత సమాజ సేవకు వెచ్చించవచ్చు. ఉదాహరణకు మీ పట్టణంలో అనాధ శరణాలయాలు ఉండవచ్చు. నిరుపేదలు చదువుకునే సాంఘిక సంక్షేమ హాస్టళ్లుండవచ్చు. వీధి బాలలను, బాల నేరస్తులను చేరదీసే స్వచ్ఛంద సంస్థలుండవచ్చు. ఇందుకు వీటిలో ఒకదానికి కొంత మొత్తాన్ని నెలనెలా కేటాయించవచ్చు. మీ బిడ్డల పుట్టిన రోజునో- మీ పెళ్లిరోజునో విందులు వినోదాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోటాలకు తోడుగా ... ఇందులో ఏదోక చోటకు వెళ్లి కొద్దిసేపు వారితో గడపొచ్చు. పెన్నులు, పెన్సిళ్ల్లు, చాక్లెట్లు, నోట్ పుస్తకాలు వంటి బహుమతులు అందచేస్తే వారి కళ్లలో ఆనందాన్ని, తృప్తిని చూడొచ్చు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో వారిచ్చే బహుమతులకంటే ఇది ఎన్నో రెట్లు విలువైనది- మీ వ్యక్తిత్వాన్ని వనె్నలద్దేది అవుతుంది.
కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై ఎందరో వృద్ధులు ఓల్డేజి హోముల్లో మగ్గుతున్నారు. పండో ఫలమో, ఆధ్యాత్మిక పుస్తకమో అక్కడికి వారికి అందించి చూడండి. వాళ్ల జీవితంలో చేదును కొంతయినా తుడిచిన వారవుతారు. ఏడాదిలో ఒక్కసారయినా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం ఒక అలవాటుగా మార్చుకోవాలి. చలికి వణుకుతూ- వానకు తడుస్తూ ఎందరో నిరుపేదలు నడివీధిలో/ పార్కుల్లో ఆశ్రయం పొందుతున్నారు. కొంత ధనాన్ని వెచ్చించి ఇలాంటివారిలో కొందరికయినా దుప్పట్లో, రగ్గులో అందచేయవచ్చు.
వాడిపారేసిన ఆట వస్తువులు, పాఠ్యపుస్తకాలు, కామిక్ బుక్స్, ఇతర పుస్తకాలు పాత సామాన్లవారికి వేసే బదులు... వాటిని సొంతం చేసుకునే స్తోమత లేనివారికి అందచేయవచ్చు. రోజువారీ వృధాచేసే ఆహారాన్ని పేదలకు, బిచ్చగాళ్ల కడుపు నింపేందుకు ఉపయోగించవచ్చు. పట్టణాల్లో మురికివాడల్లోనూ, గ్రామాల్లో దూరంగా మసిలే పేదవారికి- వారానికి కొంత సమయం వెచ్చించి అక్షర జ్ఞానం కలిగించవచ్చు.
రెవెన్యూ, పోలీసు, కోర్టుల ప్రాంగణాల్లో తమ సమస్యలను అధికారులకు విన్నవించటానికి దరఖాస్తులు చేయడానికి చాలామంది ఇబ్బంది పడతారు. ఇలాంటివారికి సహకరించే రిటైర్డు ఉద్యోగులు కొందరు- పరిశీలిస్తే మీకు కనిపిస్తారు. ఇలాంటివారికి మీరు తోడుకావచ్చు. కాలనీ సమస్యలు- అపార్టుమెంటులో సాధక బాధకాల పరిష్కారంలో భాగస్వాములు కావచ్చు. పర్యావరణ పరిరక్షణ- ఓటు హక్కు వినియోగం- ఓటరు నమోదు వంటి సామాజిక అంశాల్లో స్పృహను పెంచేందుకు చొరవ చూపొచ్చు. మీరు సొంత ఇంటివారయితే కొంత సమయాన్ని సత్సంగాలకు కేటాయించవచ్చు. చుట్టుప్రక్కల స్నేహితుల్ని ఇంటికి పిలిచి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించవచ్చు.
దేవాలయాల్లో పండుగలు, పర్వదినాలప్పుడు నిర్వహించే కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వాములై సహాయ సహకారాలందించవచ్చు. వీధుల్లో చెత్తపోయటాన్ని నిరోధించటం, పార్కులు, పాదచారులు నడిచే రహదారులను శుభ్రంగా ఉంచటంలో చొరవ చూపవచ్చు.
మీరు విద్యా సంస్థల నిర్వాహకులయితే- ఆదివారాలు, ఇతర సెలవ దినాల్లో మీ ప్రాంగణాన్ని మంచి కార్యక్రమాల నిర్వహణకు వినియోగించవచ్చు. యోగా, ధ్యానం, పాఠ్యేతర అంశాల శిక్షణకు ఉచితంగా అందచేయటం ద్వారా ఔన్నత్యం పెంచవచ్చు. వ్యాపార సంస్థల్లో- పౌర స్పృహను పెంచే నినాదాలను ఉంచవచ్చు. విజయవంతమైన స్వచ్ఛంద సంస్థల సేవలను ప్రచారం చేయటం ద్వారా ఇతరులకు వాటిపైన ఆసక్తిని కలిగించవచ్చు.
‘నేను సైతం...’ అన్న తీరులో వ్యక్తిగతంగా మీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా, లాభాపేక్షకు దూరంగా ఏ కార్యక్రమమైనా చేపట్టవచ్చు. మెరుగైన సమాజం కోసం మీ వంతు బాధ్యతను నెరవేరవచ్చు. ఒక్కసారి ఆలోచించండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి