బుధవారం, ఆగస్టు 24

ఆయువు పెంచే అమ్మ పాలు


ప్రతి స్ర్తి అమ్మగా తన జన్మ పండించుకోవాలని ఆరాటపడుతుంది. తాను అమ్మగా మారానన్న సమయంనుండి తన గర్భంలో పెరుగుతున్న పిండాన్ని అపురూపంగా కాపుకాసి పెంచుకుంటుంది. ప్రసవానంతరం బిడ్డకు పాలిచ్చి ఆయువును పెంచుతుంది. అమ్మ పాలను బిడ్డ త్రాగడంవలన దీర్ఘ సమయానికి అవసరమైన రోగ నిరోధక శక్తి లభిస్తుంది. అందుకే తల్లిపాలను ఎక్కువగా సేవించిన పిల్లలు ఆరోగ్యంగానూ, దీర్ఘాయువుగానూ ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి.
బిడ్డ తల్లిలో అంతర్భాగం. గర్భావధికాలంలో తల్లిద్వారానే ఆహారం, చిరాయువును పొందినప్పటికీ భూమిమీదపడిన తరువాత కూడా తల్లి ఆహారం ద్వారా లభించే పాలుయే బిడ్డ ఆయువును పెంచుతాయి. గర్భిణీగా వున్న సమయంలో తల్లి తీసుకున్న పోషక విలువలు గల ఆహారము ఎంతగా బిడ్డకు ఉపయోగపడిందో, బిడ్డ జన్మించిన తరువాత తల్లి తీసుకునే ఆహారం కూడా అంతగానే ఉపయోగపడుతుంది. అందుకే తల్లి ప్రసవానంతరం చాలాకాలం పత్యము పేరుతో ఆహారము తీసుకోవడం జరుగుతుంది. పొరపాటున రుచికోసం వేరే ఆహారం తీసుకుంటే అది బిడ్డ పాలు సేవించిన తరువాత బిడ్డపై ప్రభావం చూపుతుంది. అందుకే బిడ్డ తల్లిపాలు సేవించే కాలమంతా మంచి ఆహారం తీసుకోవడం తల్లీ బిడ్డలకు శ్రేయస్కరం.
బిడ్డకు జన్మనిచ్చిన తరువాత స్రావాలతో నిండిన ‘మురిపాలు’ బిడ్డ సేవించకుండా దూరమైనా, గర్భస్రావం జరిగిన సందర్భాలలో ఆమె నరకయాతన అనుభవిస్తుంది. కొంతమంది స్ర్తిలలో పాలిండ్లు నిండక పాలకొరత ఏర్పడుతుంది. అలాంటప్పుడు బిడ్డ ఆదిలోనే పోత పాలకు అలవాటుపడాల్సి వస్తుంది. అందుకే ముద్దు మరిపాలు అన్నారు.
బిడ్డకు సాధారణంగా 5-6 నెలల వరకు తల్లిపాలు సేవించే అలవాటు ఉంటుంది. ఆపై తల్లియొక్క అభిరుచిపై కొంతమంది పిల్లలు దాదాపు సంవత్సరం వరకు కూడా పాలను సేవిస్తారు. పరిశోధనలు, డాక్టర్ల అభిప్రాయంలో ‘బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ది బెస్ట్ మిల్క్ పర్ చైల్డ్’ అనేది తేలింది. కాని నేటి స్ర్తిలలో పిల్లలకు పాలిచ్చే అభిరుచి, తీరిక నానాటికీ తగ్గిపోతుంది. దానికి ప్రధానంగా స్ర్తిలకు అందంపై వుండే మక్కువ, వర్కింగ్ ఉమెన్స్‌గా వుండడం కనిపిస్తుంది. వర్కింగ్ ఉమెన్స్‌కి ‘మెటర్నటీ లీవ్’ ప్రభుత్వ కొలువులో దొరికినంతగా ప్రైవేట్ కొలువులో దొరకదు. దానితో పూర్తిగా బిడ్డను సాకకుండా డబ్బా పాలకు బిడ్డను బానిసను చేస్తుంది.
అందం విషయానికి వస్తే స్ర్తిలు వక్ష సౌందర్యానికి కూడా విలువనిస్తారు. బిడ్డకు అతిగా పాలివ్వడంవలన పాలిండ్లు జారిపోతాయని, మెత్తబడిపోతాయని భావిస్తారు. నిజానికి బిడ్డకు పాలివ్వడం ద్వారా చాలా ఆనందం పొందుతుంది. తద్వారా ఆమె ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం మెరుగుపడతాయి. సరైన లోదుస్తులు ధరించడం, సక్రమమైన వ్యాయామం చేయడం ద్వారా తిరిగి వక్ష సౌందర్యాన్ని పెంచుకోవచ్చునని తెలిసినా బిడ్డకు పాలివ్వడంలో అయిష్టత చూపుతారు. కేవలం 2-3 నెలల వరకు పాలిచ్చినా తదుపరి అనేక రకాల మార్కెట్ పాల ఉత్పత్తులకు బిడ్డను బానిసను చేస్తారు.
బిడ్డకు పాలివ్వడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మరచిపోకూడదు. ఆందోళనకరమైన విషయాలను వింటూ, చూస్తూ (టివీల్లో) పాలివ్వడం వలన ఆమె హృదయ స్పందనారీతులు బిడ్డపై ప్రభావం చూపుతాయి. వర్కింగ్ ఉమెన్స్ సమయం లేకపోవడంవలన ఒకవైపు బిడ్డకు పాలిస్తూనే మరోవైపు ఆఫీసు వర్కు చేస్తుంటారు. దీనివలన బిడ్డ తల్లి పొత్తిళ్ళలో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. బిడ్డకు పాలిచ్చే సమయంలో తగిన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిటారుగా కూర్చుని పాలిచ్చే ప్రక్రియ చేయడం తల్లీ బిడ్డలకు క్షేమదాయకం. బిడ్డను కని అమ్మ అనిపించుకోవడం కంటే ఆయువును పెంచే పాలను అందించడంలోనే అమ్మకు తృప్తి, అందం, ఆనందం ఉంటుందనేది స్ర్తిమూర్తికి తెలియనిదికాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి