శుక్రవారం, ఆగస్టు 26

కరుణామయి మదర్ థెరిస్సా


మహోన్నతమైన వ్యక్తులు ఐదడుగులు వేస్తే ఐదువేల అడుగులవరకు వారి దివ్యత్వం వ్యాపిస్తోంది. అమ్మ మదర్ థెరిస్సా కూడా ఈ కోవకు చెందిందే. ఎక్కడో లెబనాన్‌లో పుట్టిన ఆమె ఇండియాకు వచ్చి భారతీయులందరికే కాదు ఈ ప్రపంచానికే అమ్మ అయింది. దాదాపు 45 ఏళ్లపాటు అనాథలకు, ఆర్తులకు, దీనుల పాలిట దేవతైంది. భారతదేశంలోని కలకత్తాను కేంద్రంగా చేసుకొని ఆ మహనీయురాలు ఆరంభించిన సేవా సంస్థలు నేడు ప్రపంచ వ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి దీనులను ఆదుకుంటున్నాయి.


1   910 ఆగస్టు 26న మదర్ థెరీసా జన్మించి 1997 సెప్టెంబర్ 5న కన్నుమూశారు. ఆమె జన్మించి వందేళ్లు అయిన సందర్భంగా ఈ ఏడాది మొత్తం దేశ వ్యాప్తంగా ఈ సేవామూర్తి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఐదేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల వృద్ధులవరకు ఈ సేవామూర్తి సేవలను స్మరించుకునే రోజులివి. ఈ సందర్భంగా ఈ మహనీయురాలి జీవితంలోని కొన్ని విశేషాలు.
అమ్మ జీవితంలో ఐదు సత్యాలు
మదర్ థెరీసా తన 18వ ఏటే అంటే 1918 సెప్టెంబర్ 18న తల్లిదండ్రులను విడిచి మిషనరీని స్థాపించారు.
ఆ రోజుల్లో భారతదేశం బ్రిటీష్‌వారి పాలనలో ఉంది. కలకత్తాలోని విక్టోరియా ఆర్కిటెక్చర్ ప్రాంతం విలాసవంతమైన ధనవంతులు నివాసం ఉండే ఏరియా. దీనివెనుకే పేదలు నివసించే మురికివాడ ఉండేది. ఇక్కడనుంచే మదర్ తన సేవా కార్యక్రమాలను ఆరంభించారు.
కలకత్తా నడిబొడ్డులో మదర్ ఇల్లు ఉండేది. యువ నన్స్ ఇక్కడే సేవా కార్యక్రమాల్లో శిక్షణ తీసుకునేవారు. ఈ నన్స్‌కు రెండు చీరెలు, ఒక జత చెప్పులు, ప్రార్థనా పుస్తకాన్ని ఇచ్చేవారు.
ఆరవ పోప్ పాల్ ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో పోప్ పాల్‌ను మదర్ థెరీసా తన పనుల్లో బిజీగా ఉండి కలువలేకపోయారు. ఆమె సేవా కార్యక్రమాలను, పనులను గుర్తెరిగిన పోప్ పాల్ తన కారు స్వయంగా పంపి ఆమెను తన బస చేసిన నివాసానికి రప్పించుకుని ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చుకున్నారట.
చివరి క్షణాల్లో ఉన్న పేదలు ప్రశాంత జీవనం గడపటానికి ఓ భవనాన్ని నిర్మించాలనుకున్నారు. దీంతో ఆమె ప్రభుత్వానికి తన అభ్యర్థనను తెలియజేశారు. అధికారులు ఆమెను కాలిఘాట్ అనే ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న స్థలాన్ని చూపించారు. ఆ స్థలం హిందువుల దేవాలయానికి వెనుకే ఉంది. అక్కడే ఆ మాతృమూర్తి ‘నిర్మల్ హృదయ్’ అనే పేరుతో భవనాన్ని నిర్మించారు. ‘నిర్మల్ హృదయ్’ అంటే స్వచ్ఛమైన మనస్సు అని అర్ధం. ఈ పేరును మదర్ థెరీసానే పెట్టారు.


అమ్మ ఎపుడూ అద్భుతమే: జోషి
ప్రేమను, ప్రేమించటాన్ని మనమే సృష్టించుకోవాలని మదర్ ఎపుడూ చెబుతుండేవారని, ఆమె మా కళ్లకు ఎపుడూ అద్భుతంగానే కనిపించేదని కేరళకు చెందిన మేరీ జోషి అంటారు. అతి పిన్నవయసులో మదర్ శిష్యురాలిగా చేరిన మేరీ జోషి మదర్‌తో తనకున్న అనుబంధాన్ని ఇలా తెలియజేశారు. 1968 మే 14వతేదీన మొట్టమొదటిసారి మదర్‌ను కలిశాను. చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యాను. కేరళ నుంచి మేము రైలులో బయలుదేరి కలకత్తాకు 1968 మే 14న హౌరా స్టేషన్‌కు చేరుకొన్నాం. నాతో పాటు 20 మంది వచ్చారు. మదర్ నడిపే ఛారిటీ ట్రస్టుకు కొన్ని వస్తువులు ఇచ్చేందుకు వచ్చాం. ట్రైన్ దిగగానే ఎవరన్నా ట్రస్టు సభ్యులు వచ్చారా అని చుట్టూ చూశాం. తెల్లటి చీరలో నిర్మలమైన మోముతో మమ్మల్ని తీసుకువెళ్లటానికి మదర్ నిలబడి ఉన్నారు. ఆమెను చూడగానే ‘నమస్తే’ అని అన్నాం. కాని ఆమె మా అందరినీ ఆప్యాయంగా కౌగిలించుకుని స్వాగతం చెప్పారు. ఆ చేతుల్లో ఎంతో ప్రేమ దాగివుందని తెలిసింది.
ఆ క్షణంనుంచి సెయింట్ మేరీ జోషి మదర్ అనుచరురాలిగా మారిపోయారు. మదర్ ఛారిటీ ట్రస్టులో జాయిన్ అయిన అతి పిన్నవయస్కురాలు ఆమె కావటం గమనార్హం. ఆమె రిజిస్ట్రేషన్ నెంబర్ 373. జోషి కలకత్తా, ఢిల్లీ, ముంబాయిలలో పనిచేశారు. ప్రస్తుతం బెంగుళూరులో పనిచేస్తున్నారు. చాలా సంవత్సరాలపాటు మదర్‌తో కలిసి పనిచేశాను. సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటపుడు ఎలాంటి అలుపు సొలుపు లేకుండా రేయింబవళ్లు కష్టపడేవారు. ‘‘ఏ రోజు ఆమె విశ్రాంతి తీసుకున్నట్లుగా ఎరుగను. ఎంతో అంకితభావంతో సేవ చేసేవారు’’ అంటూ జోషి చిన్న కన్నీటి బొట్టును వదిలారు.
కుష్ఠురోగులను చూస్తే చాలు అసహ్యించుకుంటూ దూరంగా వెళ్లిపోతాం. కాని ఈ అమ్మ వారిని అక్కున చేర్చుకుని సేవ చేసేవారు. సేవా కార్యక్రమాల్లో ఉన్నపుడు అనారోగ్యానికి గురైతే వెంటనే మమ్మల్ని ఆమె మంచంపై పడుకోబెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పేవారు అని జోషి పేర్కొంది. మదర్‌కు 1979లో నోబుల్ బహుమతి లభించినపుడు భారత ప్రభుత్వం సన్మానించి, పెద్ద పార్టీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ హంగూ, ఆర్భాటాలను తిరస్కరించి దానికయ్యే వ్యయాన్ని చెక్కు రూపంలో తీసుకుని, ఆ డబ్బును చారిటీ ఫండ్‌లో కలిపారు. ఈ చిన్ని చిన్న జ్ఞాపకాలను మదిలో భద్రపరచుకుని వాటిని జ్ఞప్తికి తెచ్చుకుని ఇంకా మరింత సేవ చేయటానికి శక్తిగా భావిస్తున్నానని జోషి మదర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తెలిపారు. ఇలా ఎంతోమంది ఆమె సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగాపొంది ఆమె సేవా సైన్యంలో చేరినవారు ఎందరో..
ఈ విశ్వాసానికి అమ్మగా మారిన ఈ 87 ఏళ్ళ సేవామూర్తి తన జీవితకాలంలో ఎంతోమంది శిష్యురాళ్లను తయారుచేసి అన్నార్తులకు, అనాథలకు అండగా వారి చెంత చేర్చింది.

‘అమ్మ’ ల పొదిలో....

‘తనయుని వీరునిగా తీర్చే తల్లిగా పుట్టించెను ఆ దేవుడు తనకు మారుగా’ అన్నాడో కవి. కుమారుణ్ణి వీరునిగా తీర్చేందుకు తల్లికి అన్ని విద్యలూ రాకపోయినా వాటిని గురించిన పరిజ్ఞానం అంతో ఇంతో ఉండాలి. ఇప్పుడు మాడ్రన్ మామ్‌లు అందుకే అన్నింటిని గురించి తెలుసుకుంటున్నారు. కాలానుగుణంగా మారుతున్నారు. ఇది ఇంటర్నెట్ యుగం. ఇంటర్నెట్ తరం. అందుకే మాడ్రన్ మామ్‌లు డిజి మామ్‌లవుతున్నారు. రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ తరం తల్లుల జీవనం కూడా పరివర్తన చెందుతోంది. జీవన విధానం మారుతోంది. పిల్లల్ని పెంచే పద్ధతీ మారుతోంది.
దంపతుల మధ్య పిల్లల రాకడ తల్లులను బిజీ చేస్తోంది. అయితే ఆధునిక ఉపకరణాలను, సాధనాలను ఉపయోగించడం వల్ల జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. మనం అట్టలపై ఫోటోలు అతికించే రోజుల నుంచి డిజిటల్ ఫోటోల స్థాయికి ఎదిగాం. పిల్లల పెంపకమైనా, షాపింగ్ కోసమైనా, సోషల్ నెట్‌వర్కింగ్ కోసమైనా ఇప్పుడు భారతీయ మహిళలు ఎక్కువగా ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. భారత్‌లో చాలామంది ఆధునిక మహిళలను ప్రశ్నించగా ఇంటర్నెట్ ఇప్పుడు తమ జీవితంలో భాగమైందని చెప్పారు. దాదాపు సగం మంది గత నెలరోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ చేసినట్లు వెల్లడించారు. తమ తీరిక సమయంలో సగంకన్నా ఎక్కువ సమయాన్ని ఇంటర్నెట్ ద్వారా పనులు చేసుకోవడానికి గాని, చదవడానికి గాని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు బ్రౌజింగ్ తమ హాబీగా మారిందని చెప్పిన వారూ ఉన్నారు. సింగపూర్, హాంకాంగ్, చైనా, కొరియాలతో పోల్చినప్పుడు భారత్‌లో గృహిణులు ఇంటర్నెట్ వినియోగించడం తక్కువే. అయితే మంచి బ్రాండ్ల గురించి, కొత్త ఉత్పత్తుల గురించి తెలుసుకోవాలంటే బ్రౌజింగ్ తప్పనిసరి అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా డిజి మామ్‌లు చేస్తున్న పనే మీరూ చేయవచ్చు. ఇందుకు సరైన ఉపకరణాల వాడకం తప్పనిసరి. మంచి ఫోన్ వాడాలి. ఇప్పుడు సరికొత్త ఫోన్లతో సులభంగా, సత్వరంగా మెయిల్ చెక్ చేసుకోవచ్చు. మీరు కంప్యూటర్ వాడకమే కాక ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం నేర్చుకుంటే పిల్లలు అడిగే ప్రశ్నలకు సులభంగా సమాధానం ఇవ్వవచ్చు. ‘అమ్మా.. ఆక్టోపస్ అంటే ఏమిటి?’ ‘స్పేస్ షటిల్ ఎలా ఉంటుంది?’ ‘నువ్వు హిమాలయాలు చూశావా?’ వంటి ప్రశ్నలకు మీరు ఠకీమని బదులివ్వవచ్చు. మీరు ఏదో రైల్వేస్టేషన్‌లో ఉన్నారు. రైలు ఆలస్యమైంది. పిల్లలు సతాయిస్తున్నారు. అప్పుడు మీ ఫోన్‌లో వారికి ఇష్టమైన మంచి వీడియో క్లిప్పింగ్ ప్లే చేయండి. వెంటనే చిరునవ్వులు చిందిస్తారు. ఇప్పుడు డిజిటల్ కెమెరాలు, ఫ్లిప్ కెమెరాలు రావడంతోప్రతి నెలా వందల సంఖ్యలో ఫోటోలు తీస్తుంటాం. వాటిని ఓ క్రమపద్ధతిలో ఫోల్డర్లుగా అమర్చుకుంటే ఎవరికైనా చూపడానికి, బంధువులకు మెయిల్ చేయడానికి అనువుగా ఉంటాయి. ఫొటోషేరింగ్ సైట్లు ఫ్లిక్కర్, పికాసా, కోడక్ గ్యాలరీలో అప్‌లోడ్ చేయడం ద్వారా బంధువులకు సులభంగా పంపవచ్చు. ఫ్లయ్ లేడీ డాట్ నెట్‌లో ఇచ్చే సూచనలు ఇంట్లో వస్తువులను ఓ క్రమపద్ధతిలో ఉంచుకునేందుకు తోడ్పడుతాయి. ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్న డిజిటల్ వీడియో రికార్డర్‌తో పిల్లలు టీవీ చూసే సమయాన్ని తగ్గించవచ్చు. మంచి కార్యక్రమాలను, పిల్లలు ఇష్టపడే ప్రోగ్రామ్‌లను దానితో రికార్డు చేసి చూపవచ్చు. ఇక తల్లులు కాబోయే వారు గర్భవతులుగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పిల్లల పెంపకం గురించి తెలుసుకోవడానికి బోలెడు సైట్లు ఉన్నాయి.
కొనే్నళ్ళలో ఇంటర్నెట్ నిత్యావసర వస్తువుగా మారుతోందనే అభిప్రాయాన్ని ప్రపంచ టెలికమ్యూనికేషన్ల అభివృద్ధి సంస్థ నివేదికలో పేర్కొన్నారు. డిజి మామ్‌లు పెరగడం వల్ల వారికి, వారి కుటుంబానికే కాక వ్యాపారవర్గాలకు కూడా లాభమే. వారు ఆన్‌లైన్ షాపింగ్ చేయడమే కాక తమ ఉత్పత్తులకు ఆన్‌లైన్ బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా పని చేస్తారని ఓ వాణిజ్య ప్రముఖుడు తెలిపారు. సో త్రీ చీర్స్ టు డిజి మామ్స్.

మనం సైతం.. మెరుగైన సమాజం కోసం


ఇప్పటి జీవితాలు ఎంత యాంత్రికం వేగవంతం అయ్యాయంటే పక్క ఇంట్లో ఉంటున్న వాళ్లెవరో తెలియనంత. తమ కుటుంబం బావుంటే చాలు. తాము బాగా సంపాదించి కుటుంబ సభ్యుల్ని సంతోషపెడితే చాలు. పక్కనున్న సమాజం ఏమైపోతే మనకేం అనే ధోరణి ప్రబలిపోతోంది. వ్యక్తిగత స్వార్థం మంచిదే. కానీ, సమాజంలో మంచి పౌరులుగా మనవంతు బాధ్యతను నెరవేర్చవలసిన అవసరం లేదా? ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటే మెరుగైన సమాజం సాధ్యమవుతుందా? మా కష్టాలు మాకున్నాయి. మా జీవన పోరాటంతోనే మాకు సరిపోతుంది. సమాజాన్ని ఉద్ధరించటానికి మేమేం మహాత్మాగాంధీలం కాదు- అన్నీ వదిలేసుకున్న (సర్వసంగ) పరిత్యాగులం కాము అని వాదించే వాళ్లున్నారు. కుటుంబాన్ని వీధులపాలు చేసి సమాజం కోసం నడుం బిగించమని ఎవరూ చెప్పరు. ఒక మంచి తండ్రి/తల్లి ఒక మంచి భార్య/్భర్త, ఒక మంచి పొరుగువాడు, ఒక మంచి స్నేహితుడు... వీటి తర్వాత మంచి పౌరుడుగా గుర్తింపు పొందాలని చేసే ప్రయత్నం చేయమని చెప్పటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. ఇందుకు మీ ఆస్తిపాస్తులను అనాధ శరణాలయాలకో, గుడులు గోపురాలకో దానం చేయనవసరం లేదు. మీకున్న దానిలో కొంత -మీ మనసుకు నచ్చినంత సమాజ సేవకు వెచ్చించవచ్చు. ఉదాహరణకు మీ పట్టణంలో అనాధ శరణాలయాలు ఉండవచ్చు. నిరుపేదలు చదువుకునే సాంఘిక సంక్షేమ హాస్టళ్లుండవచ్చు. వీధి బాలలను, బాల నేరస్తులను చేరదీసే స్వచ్ఛంద సంస్థలుండవచ్చు. ఇందుకు వీటిలో ఒకదానికి కొంత మొత్తాన్ని నెలనెలా కేటాయించవచ్చు. మీ బిడ్డల పుట్టిన రోజునో- మీ పెళ్లిరోజునో విందులు వినోదాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోటాలకు తోడుగా ... ఇందులో ఏదోక చోటకు వెళ్లి కొద్దిసేపు వారితో గడపొచ్చు. పెన్నులు, పెన్సిళ్ల్లు, చాక్లెట్లు, నోట్ పుస్తకాలు వంటి బహుమతులు అందచేస్తే వారి కళ్లలో ఆనందాన్ని, తృప్తిని చూడొచ్చు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో వారిచ్చే బహుమతులకంటే ఇది ఎన్నో రెట్లు విలువైనది- మీ వ్యక్తిత్వాన్ని వనె్నలద్దేది అవుతుంది.
కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై ఎందరో వృద్ధులు ఓల్డేజి హోముల్లో మగ్గుతున్నారు. పండో ఫలమో, ఆధ్యాత్మిక పుస్తకమో అక్కడికి వారికి అందించి చూడండి. వాళ్ల జీవితంలో చేదును కొంతయినా తుడిచిన వారవుతారు. ఏడాదిలో ఒక్కసారయినా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం ఒక అలవాటుగా మార్చుకోవాలి. చలికి వణుకుతూ- వానకు తడుస్తూ ఎందరో నిరుపేదలు నడివీధిలో/ పార్కుల్లో ఆశ్రయం పొందుతున్నారు. కొంత ధనాన్ని వెచ్చించి ఇలాంటివారిలో కొందరికయినా దుప్పట్లో, రగ్గులో అందచేయవచ్చు.
వాడిపారేసిన ఆట వస్తువులు, పాఠ్యపుస్తకాలు, కామిక్ బుక్స్, ఇతర పుస్తకాలు పాత సామాన్లవారికి వేసే బదులు... వాటిని సొంతం చేసుకునే స్తోమత లేనివారికి అందచేయవచ్చు. రోజువారీ వృధాచేసే ఆహారాన్ని పేదలకు, బిచ్చగాళ్ల కడుపు నింపేందుకు ఉపయోగించవచ్చు. పట్టణాల్లో మురికివాడల్లోనూ, గ్రామాల్లో దూరంగా మసిలే పేదవారికి- వారానికి కొంత సమయం వెచ్చించి అక్షర జ్ఞానం కలిగించవచ్చు.
రెవెన్యూ, పోలీసు, కోర్టుల ప్రాంగణాల్లో తమ సమస్యలను అధికారులకు విన్నవించటానికి దరఖాస్తులు చేయడానికి చాలామంది ఇబ్బంది పడతారు. ఇలాంటివారికి సహకరించే రిటైర్డు ఉద్యోగులు కొందరు- పరిశీలిస్తే మీకు కనిపిస్తారు. ఇలాంటివారికి మీరు తోడుకావచ్చు. కాలనీ సమస్యలు- అపార్టుమెంటులో సాధక బాధకాల పరిష్కారంలో భాగస్వాములు కావచ్చు. పర్యావరణ పరిరక్షణ- ఓటు హక్కు వినియోగం- ఓటరు నమోదు వంటి సామాజిక అంశాల్లో స్పృహను పెంచేందుకు చొరవ చూపొచ్చు. మీరు సొంత ఇంటివారయితే కొంత సమయాన్ని సత్సంగాలకు కేటాయించవచ్చు. చుట్టుప్రక్కల స్నేహితుల్ని ఇంటికి పిలిచి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించవచ్చు.
దేవాలయాల్లో పండుగలు, పర్వదినాలప్పుడు నిర్వహించే కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వాములై సహాయ సహకారాలందించవచ్చు. వీధుల్లో చెత్తపోయటాన్ని నిరోధించటం, పార్కులు, పాదచారులు నడిచే రహదారులను శుభ్రంగా ఉంచటంలో చొరవ చూపవచ్చు.
మీరు విద్యా సంస్థల నిర్వాహకులయితే- ఆదివారాలు, ఇతర సెలవ దినాల్లో మీ ప్రాంగణాన్ని మంచి కార్యక్రమాల నిర్వహణకు వినియోగించవచ్చు. యోగా, ధ్యానం, పాఠ్యేతర అంశాల శిక్షణకు ఉచితంగా అందచేయటం ద్వారా ఔన్నత్యం పెంచవచ్చు. వ్యాపార సంస్థల్లో- పౌర స్పృహను పెంచే నినాదాలను ఉంచవచ్చు. విజయవంతమైన స్వచ్ఛంద సంస్థల సేవలను ప్రచారం చేయటం ద్వారా ఇతరులకు వాటిపైన ఆసక్తిని కలిగించవచ్చు.
‘నేను సైతం...’ అన్న తీరులో వ్యక్తిగతంగా మీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా, లాభాపేక్షకు దూరంగా ఏ కార్యక్రమమైనా చేపట్టవచ్చు. మెరుగైన సమాజం కోసం మీ వంతు బాధ్యతను నెరవేరవచ్చు. ఒక్కసారి ఆలోచించండి.

బుధవారం, ఆగస్టు 24

తల్లీ కూతుళ్ళ బంధం మధురమైన అనుబంధం


ఆడపిల్ల మీద అంత ప్రేమ మక్కువ ఉండటంతో తల్లి స్వార్థం కూడా ఉంది. ఆడపిల్ల ఎప్పటికైనా మరోఇంటికి వెళ్ళాల్సిందే. అంటే తన ఇంటినుంచి మంచిని తీసుకెళ్ళేదే అమ్మాయి. అత్తవారింట్లో ఆ అమ్మాయి ప్రవర్తనను బట్టి తల్లికి మంచి లేదా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తనకు మంచి పేరు తెచ్చేలా అమ్మాయిని పెంచాలనే ప్రయత్నంలో తల్లి కనిపిస్తుంది. పైగా ఆడపిల్లలకు తల్లిఅవసరం చాలా ఎక్కువ. జడ వేసుకోవడం, అలంకరించుకోవడం వంటి వాటికోసం ఆరంభంలో తల్లి మీద ఆధారపడతారు. ఆ తర్వాత తల్లి నుండి నేర్చుకుంటారు. వయస్సుతో శరీరంలో వచ్చే మార్పులు, వాటికి ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటివన్నీ తల్లి మాత్రమే చెప్పగలదు.అందుకే తల్లి ఆడపిల్లతో ఎక్కువ సమయం గడుపుతుంది. తల్లి, తన బిడ్డ ప్రతి కదలికను తెలుసుకుంటుంది.
టీనేజ్‌లోకి వచ్చేంతవరకు తల్లి చూపే ప్రేమ, ఆదరణ అందుకొనే అమ్మాయిలు ఆ తర్వాత తమకు తగినంత స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారని తల్లిమీద ఫిర్యాదు చేయడం మొదలుపెడతారు. అంతకుముందువరకు తల్లి చెప్పిన జాగ్రత్తలు టీనేజ్ అమ్మాయిలకు అర్ధంపర్ధంలేని అంశాలుగా కనిపిస్తాయి. తనను ఇంకా చిన్నపిల్లలా చూడటం చిరాకుకలిగిస్తుంది. అప్పటివరకూ అమ్మ మాట ప్రకారం చిన్నవాడైన తమ్ముడ్ని తోడు తీసుకొని బయటకెళ్ళని అమ్మాయిలు టీనేజ్‌లోకి ప్రవేశించగానే ఇంట్లోవాళ్ళ తోడుతో బయటకు వెళ్ళడం ఏదో చిన్నతనంగా భావిస్తారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని, సమయానికి ఇంటికి రావాలని, ఇంటి పనులు నేర్చుకోవాలని తల్లి చెప్పే ప్రతి మాట అర్ధంలేనిదిగా ఉండి చిరాకు తెప్పిస్తుంది. దీనితో అమ్మ చెప్పిన మాట వినకపోవడం, ఎదురు సమాధానం చెప్పడం ప్రారంభిస్తారు. అదుపు తప్పుతుందన్న భావం తల్లిలోనూ, తనమీద అనవసర అనుమానం పెంచుకుంటుందన్న ఆలోచన అమ్మాయిలోనూ కలుగుతుంది. ఇలాంటి పరిస్థితి కుటుంబ ప్రశాంత వాతావరణాన్ని పాడుచేస్తుంది. ఎంత త్వరగా ఇల్లు వదిలి వెళ్ళిపోదామా అన్న ఆలోచన అమ్మాయిలో కలుగుతుంది. ఇంటి దగ్గర అందని ప్రేమ, ఆదరణ మరోచోట పొందడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి సమయంలోనే గాడి తప్పుతారు. ఇలాంటప్పుడు తల్లే జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పిల్లలు చెడుమార్గంలో పయనిస్తున్నప్పుడు ప్రేమాభిమానంతో నచ్చచెబుతూ సక్రమ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిపైనే ఉంది. అమ్మాయిని ఎప్పుడూ చిన్నపిల్లలానే చూడకూడదు. వారి వయస్సుకు తగ్గట్టు, సమాజం, వాతావరణం అనుగుణంగా నడుచుకోవాలి.
ఆడపిల్లలకే కాదు మగ పిల్లలు కూడా ఇంటి పనులు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్న సమయం ఇది. మగవారికి అన్ని పనులు వచ్చినా నేటికీ ఇంటి బాధ్యత స్ర్తిలదే. వంట చేయడం, ఇంటిని చక్కదిద్దుకోవడం అనాదిగా వస్తున్నది. నిజానికి ఈ రెంటిమీది హక్కును వదులుకునేందుకు అమ్మాయిలు సిద్ధంకారు. కూతురుమీద తల్లిప్రేమ అవసరమే. అయితే గుడ్డి ప్రేమ కాకూడదు. తమ నిర్ణయమే నెత్తిన రుద్దే తల్లులకు ఆడపిల్లలు నెమ్మదిగా దూరం అవుతారని గ్రహించాలి. కూతురుకు నేర్పు, ఓర్పు నేర్పాల్సిన బాధ్యత తల్లిదే. వీటిల్లో కూతురు అండగా నిలవటం అవసరమే. అయితే ఆ అండ పరిధిని దాటి ఉండకూడదు.
ఒకసారి అమ్మాయి ప్రవర్తన గాడితప్పితే సరిదిద్దడం కష్టం. ఆడపిల్ల పెంపకంలోని లోపానికి తల్లినే తప్పుపడతారు. కాబట్టి తన బిడ్డ అని నలుగురిలో గర్వంగా చెప్పుకోవాలంటే అన్నింటిలో పరిమితి అవసరం. నిజానికి ఆడపిల్లకు తల్లికి మించిన స్నేహితురాలు ఉండదు. ప్రతి విషయం మనసు విప్పి తల్లికి చెప్పుకుంటుంది. ఆ మాటలను బట్టి తల్లి ఎదుగుతున్న పిల్లలకు మార్గదర్శకం కావాలే గాని చేయి పట్టుకు నడిపించకూడదు. తల్లీకూతుళ్ళ బంధం ఒక తరహాకి చెందిందని చెప్పలేం. ఎన్నో అంశాలలో ఇద్దరికీ అవసరాలు ఉంటాయి. తల్లి కూడా తన కష్టాలను కూతురితోనే పంచుకోగలుగుతుంది. తల్లిని కుమారులు ఎంత ఆదరిస్తున్నా, కూతురు చూపించే ప్రేమానురాగాలకు ముగ్ధురాలవుతుంది. అటువంటి అద్భుతమైన తల్లీ కూతుళ్ళ బంధం అందంగా వికసించాలి. ‘‘నన్ను పెంచిన తల్లి’’ అని కూతురు, ‘నాకన్న కూతురు’ అని తల్లి సగర్వంగా చెప్పుకునేలా వారి అనుబంధం పెరగాలి.

అమ్మ కు కడుపుకోత తప్పేదెలా..?

అమ్మ అనిపించుకున్నప్పుడే స్ర్తి జన్మకు సార్థకత. దానికోసం ప్రతి స్ర్తి తపిస్తుంది, తపస్సు చేస్తుంది. కాని అమ్మ పడే ప్రసవ వేదన ఆమెకు మరో జన్మతో సమానం. అమ్మతనం పొందిన దగ్గర్నుండి ప్రసవ సమయం వరకు బిడ్డ క్షేమం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. తాను నిర్ణయించుకున్న ముహూర్తానికే బిడ్డను కనాలని 3సిజేరియన్2కి సైతం సిద్ధపడుతుంది. మంచి ఘడియల్లో పుట్టే బిడ్డ మంచి పేరు తీసుకువస్తాడని ఆరాటపడుతుంది. ప్రస్తుతం 65 శాతం మంది సిజేరియన్‌ల గాటుకి గురికాబడే బిడ్డకు జన్మనిస్తున్నారు. దీనికి కారణం డాక్టర్లు అని కొందరంటే, గర్భం ధరించిన తరువాత జాగ్రత్తలు తీసుకోకపోవడమని మరికొందరంటారు. ఏదేమైనా సిజేరియన్ పడనిదే బిడ్డ బయట ప్రపంచాన్ని చూడడంలేదు. ఈ పరంపరలో తల్లీ బిడ్డలకు లేదా ఎవరికో ఒకరికి ప్రమాదం ఏర్పడే సందర్భాలు లేకపోలేదు. అలాంటప్పుడు హాస్పిటల్‌పై పేషెంట్ బాధితులు దాడి చేయడం కూడా జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అతిగా అభివృద్ధి చెందడంవలన మేలుకంటే కీడే ఎక్కువ చేస్తుందనడంలో సందేహమే లేదు. పిండదశలోనే ఆడపిల్లలు హత్యకు గురైపోతున్నారంటే (భ్రూణహత్యలు) దానికి కారణం స్కానింగ్ ప్రక్రియ. చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా అమలులో మాత్రం అంతంత మాత్రంగానే వున్నాయి. పుట్టే బిడ్డ సంగతి ముందే తెలిసిపోవడంతో అతి జాగ్రత్తలు తీసుకోవడం వలన సిజేరియన్‌ను ఖచ్చితంగా ఎదుర్కోవలసి వస్తుంది. స్ర్తి గర్భం ధరించిన నాటినుండి సరైన పోషకాహారంతోపాటు గైనకాలజిస్టు సలహాతో ఎక్సర్‌సైజులు చేస్తే సులభమైన ప్రసవాన్ని పొందవచ్చును. ఇంతకుముందు ప్రసవాలన్నీ మంత్రసాని సహాయంతోనే జరిగేవి. సిజేరియన్ అంటే 3హమ్మో!2 అనేవారు. దానికి కారణం ఆ రోజుల్లో ప్రసవానికి ముందు తరువాత తీసుకునే ఆహారంతోపాటు గర్భం దాల్చినప్పటికీ సాధారణ స్ర్తిలాగే పనిపాటలు చేసుకోవడం జరిగేది. వీటివలన గంపెడు పిల్లలనైనా కత్తిగాటు పడకుండా కనేసేవారు.
ఇప్పుడు ఆహారపు అలవాట్లు, వాడే మందుల ప్రభావం, అతి జాగ్రత్తవలన డాక్టర్ పెట్టిన ముహూర్తానికే ప్రసవం జరుగుతుంది. ప్రసవ తేదీని ముందుగానే నిర్ణయించిన డాక్టర్ ఆ సమయానికి సిజేరియన్ చేసేసి బిడ్డను బయటపడేస్తున్నాడు. స్ర్తిలు కూడా మంచి ఘడియలు, నక్షత్రం, రోజు చూసుకుని మరీ సిజేరియన్‌కి సిద్ధపడుతున్నారు. అంతేకాక సిజేరియన్ మార్క్స్ పడకుండా వుండడానికి స్టిక్కరింగ్‌టైపు సిజేరియన్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేటి స్ర్తిలు ప్రసవంవలన తన పొత్తికడుపు సౌందర్యం దెబ్బతినకూడదని భావిస్తున్నారు. ఆరోగ్య పరిశోధనల్లో సిజేరియన్ వలన అటు బిడ్డకు ఇటు తల్లికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుందని తెలిసినా నేటి తల్లికి ఈ గాటు తప్పడంలేదు. సిజేరియన్‌లు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పాలిట కల్పవృక్షమే.
మరి ఈ రోజుల్లో కూడా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయంటే దానికి కారణం గర్భిణీ స్ర్తిల ఆహారపు అలవాట్లు, దైనందిన కార్యకలాపాల పట్ల చురుకుగా పాల్గొనడమే. సంచార జీవులు, పేదవారిలో ఎక్కువగా సాధారణ ప్రసవాలు వస్తున్నాయంటే కారణం ఇదే. సుఖ ప్రసవానికి సౌకర్యాలకంటే సాధారణ ప్రవర్తనే ముఖ్యం.

ఆయువు పెంచే అమ్మ పాలు


ప్రతి స్ర్తి అమ్మగా తన జన్మ పండించుకోవాలని ఆరాటపడుతుంది. తాను అమ్మగా మారానన్న సమయంనుండి తన గర్భంలో పెరుగుతున్న పిండాన్ని అపురూపంగా కాపుకాసి పెంచుకుంటుంది. ప్రసవానంతరం బిడ్డకు పాలిచ్చి ఆయువును పెంచుతుంది. అమ్మ పాలను బిడ్డ త్రాగడంవలన దీర్ఘ సమయానికి అవసరమైన రోగ నిరోధక శక్తి లభిస్తుంది. అందుకే తల్లిపాలను ఎక్కువగా సేవించిన పిల్లలు ఆరోగ్యంగానూ, దీర్ఘాయువుగానూ ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి.
బిడ్డ తల్లిలో అంతర్భాగం. గర్భావధికాలంలో తల్లిద్వారానే ఆహారం, చిరాయువును పొందినప్పటికీ భూమిమీదపడిన తరువాత కూడా తల్లి ఆహారం ద్వారా లభించే పాలుయే బిడ్డ ఆయువును పెంచుతాయి. గర్భిణీగా వున్న సమయంలో తల్లి తీసుకున్న పోషక విలువలు గల ఆహారము ఎంతగా బిడ్డకు ఉపయోగపడిందో, బిడ్డ జన్మించిన తరువాత తల్లి తీసుకునే ఆహారం కూడా అంతగానే ఉపయోగపడుతుంది. అందుకే తల్లి ప్రసవానంతరం చాలాకాలం పత్యము పేరుతో ఆహారము తీసుకోవడం జరుగుతుంది. పొరపాటున రుచికోసం వేరే ఆహారం తీసుకుంటే అది బిడ్డ పాలు సేవించిన తరువాత బిడ్డపై ప్రభావం చూపుతుంది. అందుకే బిడ్డ తల్లిపాలు సేవించే కాలమంతా మంచి ఆహారం తీసుకోవడం తల్లీ బిడ్డలకు శ్రేయస్కరం.
బిడ్డకు జన్మనిచ్చిన తరువాత స్రావాలతో నిండిన ‘మురిపాలు’ బిడ్డ సేవించకుండా దూరమైనా, గర్భస్రావం జరిగిన సందర్భాలలో ఆమె నరకయాతన అనుభవిస్తుంది. కొంతమంది స్ర్తిలలో పాలిండ్లు నిండక పాలకొరత ఏర్పడుతుంది. అలాంటప్పుడు బిడ్డ ఆదిలోనే పోత పాలకు అలవాటుపడాల్సి వస్తుంది. అందుకే ముద్దు మరిపాలు అన్నారు.
బిడ్డకు సాధారణంగా 5-6 నెలల వరకు తల్లిపాలు సేవించే అలవాటు ఉంటుంది. ఆపై తల్లియొక్క అభిరుచిపై కొంతమంది పిల్లలు దాదాపు సంవత్సరం వరకు కూడా పాలను సేవిస్తారు. పరిశోధనలు, డాక్టర్ల అభిప్రాయంలో ‘బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ది బెస్ట్ మిల్క్ పర్ చైల్డ్’ అనేది తేలింది. కాని నేటి స్ర్తిలలో పిల్లలకు పాలిచ్చే అభిరుచి, తీరిక నానాటికీ తగ్గిపోతుంది. దానికి ప్రధానంగా స్ర్తిలకు అందంపై వుండే మక్కువ, వర్కింగ్ ఉమెన్స్‌గా వుండడం కనిపిస్తుంది. వర్కింగ్ ఉమెన్స్‌కి ‘మెటర్నటీ లీవ్’ ప్రభుత్వ కొలువులో దొరికినంతగా ప్రైవేట్ కొలువులో దొరకదు. దానితో పూర్తిగా బిడ్డను సాకకుండా డబ్బా పాలకు బిడ్డను బానిసను చేస్తుంది.
అందం విషయానికి వస్తే స్ర్తిలు వక్ష సౌందర్యానికి కూడా విలువనిస్తారు. బిడ్డకు అతిగా పాలివ్వడంవలన పాలిండ్లు జారిపోతాయని, మెత్తబడిపోతాయని భావిస్తారు. నిజానికి బిడ్డకు పాలివ్వడం ద్వారా చాలా ఆనందం పొందుతుంది. తద్వారా ఆమె ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం మెరుగుపడతాయి. సరైన లోదుస్తులు ధరించడం, సక్రమమైన వ్యాయామం చేయడం ద్వారా తిరిగి వక్ష సౌందర్యాన్ని పెంచుకోవచ్చునని తెలిసినా బిడ్డకు పాలివ్వడంలో అయిష్టత చూపుతారు. కేవలం 2-3 నెలల వరకు పాలిచ్చినా తదుపరి అనేక రకాల మార్కెట్ పాల ఉత్పత్తులకు బిడ్డను బానిసను చేస్తారు.
బిడ్డకు పాలివ్వడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మరచిపోకూడదు. ఆందోళనకరమైన విషయాలను వింటూ, చూస్తూ (టివీల్లో) పాలివ్వడం వలన ఆమె హృదయ స్పందనారీతులు బిడ్డపై ప్రభావం చూపుతాయి. వర్కింగ్ ఉమెన్స్ సమయం లేకపోవడంవలన ఒకవైపు బిడ్డకు పాలిస్తూనే మరోవైపు ఆఫీసు వర్కు చేస్తుంటారు. దీనివలన బిడ్డ తల్లి పొత్తిళ్ళలో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. బిడ్డకు పాలిచ్చే సమయంలో తగిన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిటారుగా కూర్చుని పాలిచ్చే ప్రక్రియ చేయడం తల్లీ బిడ్డలకు క్షేమదాయకం. బిడ్డను కని అమ్మ అనిపించుకోవడం కంటే ఆయువును పెంచే పాలను అందించడంలోనే అమ్మకు తృప్తి, అందం, ఆనందం ఉంటుందనేది స్ర్తిమూర్తికి తెలియనిదికాదు.

సంతానం స్ర్తికి వరమా? శాపమా

ఈనాటి నూతన దంపతులలో పెళ్లి అయి ఏడెనిమిది ఏళ్లు అయినా ఇంకా సంతానం కలగకుండా ఉన్న జంటలను మనం తరచుగానే, ముఖ్యంగా నగర ప్రాంతాలలోనే చూస్తూ వుంటాం. వారిలో ఎవ్వరైనా మనకు కొద్దిగా సన్నిహితులు అయితే వారేమైనా ‘్ఫమిలీ ప్లానింగ్’ పాటిస్తున్నారేమో. అందువల్లనే పిల్లలు కలగడం ఆలస్యం అయిందేమోనని భావిస్తూ- అయినా నిజమేమిటో వారి నోటినుండే తెలుసుకోవాలని ఉబలాటపడతాం. అయితే వారు చెప్పే సమాధానం మనకు కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘అబ్బే! ప్లానింగ్ ఏమీలేదండీ- ఎందుకనో ఇప్పటివరకూ పిల్లలు కలగలేదు, అంతే’ అన్నప్పుడు.
నిజానికి ఈ విస్తృత సమాజంలో వివాహం జరిగాక రెండు లేక మూడు సంవత్సరాలుగా తల్లి కాలేకపోతే అది ఆమెలోగానీ ఆమె భర్తలోగాని ఉన్న శారీరక లోపం ఏమోనని భావిస్తూ, నిర్థారిస్తూ నిరాశ, నిస్పృహలకు లోనై ఎంతగానో కృంగిపోతూ ఉండడం జరుగుతుంది. అట్టి దంపతులు పొందే ఆవేదన అంతా ఇంతా అని చెప్పడానికి అలవికాకుండా ఉంటుంది.
ఇలా నూతన వివాహితులు మిగతా అందరిలాగా రెండు మూడేళ్లలోగా గర్భం ధరిచలేకపోవడానికి కారణాలు చాలా ఉండవచ్చు. వీటిలో అతి ముఖ్యమైన కారణం- వీరి భర్తలు హెచ్చు జీతాలమీద పెద్ద ఉద్యోగాలమీద తీవ్రమైన ఆశతో విశ్రాంతిని కోల్పోతూ హెచ్చుగంటలు ఉద్యోగ బాధ్యతలూ అదనపు బాధ్యతలూ నిర్వరిస్తూ ఉండడం. ఇంటికి వచ్చేసరికి శారీరకంగానూ మానసికంగానూ అలసిపోతూ ఉండడం. కొన్ని సందర్భాలలో పని ఒత్తిడికి తట్టుకోవడానికై ధూమపానం చేస్తూ ఉండడం, మద్యం సేవిస్తూ ఉండడం. అలాగే ఉద్యోగ బాధ్యతలతో విశ్రాంతి కోల్పోటం, స్ర్తిలకు గర్భాశయంలో లోపాలు ఏర్పడుట ఉండడం కూడా ఇందుకు కారణం అవుతుంది. వైద్య పరీక్షలు చేయించుకుంటే లోపం ఎక్కడ ఉన్నదో, ఎవరిలో ఉన్నదో సరిగా తెలుసుకొనలేని పరిస్థితి ఏర్పడుతున్నది.
ఇలా గర్భధారణలో లోపానికీ, జాప్యానికీ గురి అవుతున్నవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8 కోట్ల మేరకు ఉండవచ్చునని ప్రముఖ వైద్య సంస్థలు నిర్వహించిన సర్వేద్వారా తెలియవస్తున్నది.
స్ర్తిలకు 30 ఏళ్ల వయస్సుదాటిన తర్వాత గర్భధారణ అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి ఆ వయసులోగానీ సంతానం పొందే ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం అని ప్రాచీన సంప్రదాయాలవల్ల, వైద్య నిపుణుల సలహాలవల్లా తెలియవస్తున్నది.
ఇలా సంతానాన్ని పొందలేకపోతే మాత్రం ఇకపై ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనేక సాంప్రదాయిక, మానసిక ఒత్తిడుల కారణంగా, క్షీణించక తప్పని పరిస్థితి ఏర్పడి, ఇందుకు కారణం ఎదుటివారిలోని శారీరక, మానసిక లోపాలను భార్యాభర్తలు పరస్పరం నిందించుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకొనడం జరుగుతూ ఉంటుంది.
ఈ పరిస్థితి రాకుండా నిరోధించేందుకు మార్గాలు మనకు చాలానే కావస్తాయి. మనం, అంటే భార్యాభర్తలు, ఈ గర్భధారణకు, సంతాన ప్రాప్తికి అవరోధం కలిగించే ఏయే పనులు చేస్తున్నారో, వాటిని స్వయంగా పరిశోధించి తెలుసుకుని ఆ లోపాలు సమూలంగా తొలగించివేయడానికి చిత్తశుద్ధితో కృషి చేయడం- మొట్టమొదటగా చేయవలసిన పని. ఇక తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో పరిశీలిద్దాం.
-స్ర్తి గర్భధారణ కార్యక్రమం అంతా పురుషుని వీర్యబలం మీదనే అతి హెచ్చుగా ఆధారపడి ఉంటుంది. మద్యపానం, ధూమపానం పురుష వీర్యాన్ని పలచబడేట్టు చేసి శక్తిలేకుండా చేస్తాయి కాబట్టి వాటిని ఎంత త్వరగా మానివేయగలిగితే అంత త్వరగా మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు.
-్భర్యాభర్తల మధ్య ప్రధానంగా పెరగవలసింది పరస్పర అనురాగం, సాంగత్యం. పిల్లలకోసమే దగ్గర కావడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. పరస్పరం శరీర సంపర్కాన్నిపొంది ఆనందించగల్గడం సహజమైన కార్యక్రమంగా మారాలి.
-్భర్యాభర్తలలో ఏ ఒక్కరూ విశ్రాంతి లేని రకరకాల పనులతో తలమునకలై ఉండిపోవడం ఏ మాత్రం మంచిది కాదు. ప్రతి రోజులోను ఒకటి రెండు గంటలసేపు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలసి సరదాగా కాలం గడిపి ఆనందించే ఏర్పాటు తప్పనిసరిగా చేసుకోవాలి.
-కొత్త దంపతులు మంచి సంతానం పొందడానికి ఉభయులూ మంచి ఆరోగ్యవంతులై ఉండడం తప్పనిసరి. వ్యాయామం, ఆసనాలు, యోగాలాంటి మంచి అలవాట్లు పాటించాలి.
-ఒక్కొక్కప్పుడు జన్యు సంబంధమైన అనే కారణాలవల్ల సంతానం కలగడం కొంత ఆలస్యం కావచ్చు. కాని అట్టి పరిస్థితులలో నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో తగు వైద్య చికిత్సలు పొందితే సత్ఫలితాలుంటాయి.
-్భర్యాభర్తలమధ్య పరస్పర శారీరక ఆకర్షణ, మానసిక అవగాహన లోపిస్తే ఇక వారి మధ్య పరస్పర అనురాగం, అనుబంధం, సుఖవంతమైన సహజీవనం సాధ్యం కావు. ఈ పరిస్థితులు ఎవరికివారు ఏవేవో అనవసర బాధ్యతలు నెత్తిన వేసుకోవడవంల్ల, ఏవేవో అర్థంలేని భయాలకు లోనవుతూ ఉండడంవల్ల ఎదురు అవుతుంటాయి. ఈ స్థితి నుండి బయటపడడానికి మార్గం- కాస్తంత నోటికీ, ముక్కుకూ చురుక్కుమనిపించే రెండు ఔషధ పదార్థాల వినియోగం. ఆ రెండు పదార్థాలూ ఏమిటంటే ఉల్లిపాయలు, అల్లం.
-్భర్యాభర్తలు తమ శరీరాలూ, ప్రవర్తన పరస్పర ఆకర్షణీయాలుగా ఉండేట్లు చేసుకొనడంలో తమ పడకగదిని అందంగా ఉండేట్లు అమర్చుకొనడం, మల్లెపూల సువాసన, గులాబీల ఆకర్షణ, అగరువత్తుల సుగంధం గుబాళింపు సెక్స్‌పట్ల ఆసక్తిని పెంచుతాయి. భార్యాభర్తలమధ్య పరస్పర స్నేహభావం, చనువు ఉండాలి. ఏవిషయంలోనైనా ఒకరికి కోపం వస్తే రెండవ వారు తగ్గిపోయి క్షమాపణ చెప్పుకోగలగాలి. భర్త పట్ల భార్యకు చనువు, సాన్నిహిత్యం ఏర్పడకపోతే సంతానం కలగడం కష్టం. కలిగినా ఆ సంతానం అదనపు బాధ్యతలకు, దుఃఖానికీ దారితీస్తుంది తప్ప సుఖాన్ని కలిగించదు. అందువల్ల పురుషుల అధికార దర్పాన్ని అదుపులో ఉంచుకొనడం అవసరం. అలాగే వీటికితోడు తగినంత విశ్రాంతి, నిద్రకూడా అవసరం.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నవారికి బలమైన, ఆనందకరమైన సంతానం కలుగుతుంది అని చెప్పడంలో సందేహం అక్కరలేదు.
అయితే సంతానం పొందడం, పిల్లల్ని పోషించి పెంచి పెద్ద చేయడం విషయంలో పురుషుని పాత్ర చాలా స్వల్పం. స్ర్తి పాత్ర చాలా అధికం కావడంవల్ల అసలు ఈ మాతృత్వం స్ర్తికి వరమా? శాపమా? అనే సందేహం చాలా మంది స్ర్తిలకే కాక పురుషులకు కూడా రావచ్చు.
నిజమే. గర్భధారణ జరిగిన నాటినుండి స్ర్తి తొమ్మిది నెలలపాటు పడే పాట్లు, ప్రసవకాలంలో పడే బాధ ఆ తర్వాత పిల్లలకు పాల్వివడం, వారి ఆలనా పాలనా- ఇదంతా ఒక మహాతపస్సు అని ఎవరైనా అంగీకరించవచ్చు.
అందువల్లనే ప్రతి వ్యక్తీ ‘అమ్మ’ ముందు తలవంచి ఆమె నుండి శుభాశీస్సులకై ఎదురుచూసే అసామాన్య పరిస్థితి, అనూహ్య గౌరవ స్థితి ఒక స్ర్తికి మాత్రమే లభిస్తున్నది. ‘తల్లి’కి మించిన దైవమే ఎక్కడా లేదని అందరూ విశ్వసించడం జరుగుతున్నది. ఈ అసామాన్య గౌరవ స్థితి వరమో, శాపమో స్ర్తిలే నిర్ణయించుకొనవలసి యున్నది.

గురువారం, ఆగస్టు 4

అమ్మ



అడ్డంకులు తొలగించే ‘అమ్మ’ కొడుకు


అగ్రపూజలందుకునే ఆదిదేవుడు వినాయకుడు. తొలి పూజలందుకునే గణేశుడిని గణానంత్వా గణపతిగ్‌ంహవామహే అని ఋగ్వేదం చెప్తోంది. ‘గ’ అనే అక్షరం జ్ఞానాన్ని తెలియచేస్తే ‘ణ’ నిర్వాణం చెప్తుంది. అందుకే గణ నాయకుడైన గణపతి జ్ఞాన నిర్వాణ శాసకుడయ్యాడు. వినాయకుడిని ఇంద్రుడు పూజించి గౌతమమహార్షిశాపాన్నుంచి విముక్తుడయ్యాడు. గణపతి అర్చన తర్వాత క్షీరసాగరమధనం నిర్వర్నిఘ్నంగా సాగిందంటారు. గాయత్రి మంత్రంలాగే ముప్పైరెండు అక్షరాలున్న శుక్లాంబరధరం మహామంత్రం. ‘గం’ ‘గ్లౌం’ అనే బీజాక్షరాలు విఘ్ననాయకునివి. విగతో నాయకః వినాయక సర్వస్వతంత్రుడైన వినాయకుడు ప్రధమ గణాలకే కాక మానవదేహంలోని మూలాధార స్థానానికి కూడా అధిపతే. గణపతిని పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయి. జీవితంలో వక్రాలను తొలగించేవాడుకనక వక్రతుండాయ అని, దీనపాలకుడు గనుక హేరంబాయా అని స్తుతిస్తారు.
పార్వతీదేవి ముద్దులు మూటలుగట్టే కుమారుణ్ణి చూసి మురిసిపోయింది. ఆ కుమారుణ్ణే ప్రధమగణాలకు అధిపతిచేయమని అంటే భూలోకప్రదక్షిణలు చేయాలని షరతు పెట్టాడు పరమశివుడు. కుమారస్వామి పుణ్యనదీస్థానానికి బయలుదేరితే లంబోదరుడు తల్లితండ్రుల చుట్టు ప్రదక్షణ చేసాడు. కుమారస్వామికి తనకన్నా ముందుగానే స్నానమాచరించే వక్రతుండుడు కనిపించేవాడు. ఆశ్చర్యానందాలకు లోనైన కుమారుడు విషయాన్ని తెలుసుకోవడానికి వస్తే తల్లి తండ్రుల ఎదుట తన కన్నా ముందే ఉన్న వెనకయ్య చిరునవ్వుతో స్వాగతం చెప్పాడు. సుబ్రమణ్యేశ్వరుడు శూర్పకర్ణుని సంగతిని తెలుసుకొని నమస్కరించాడు. ప్రథమగణాలకు అధిపతిని చేసి విశ్వనాయకుణ్ణి చేసారు. భక్తుల సకలకార్యసిద్ధిని చేసి వరసిద్ధివినాయకుడు అయ్యాడు. షోడశోపచారాలు చేస్తున్నవినాయకుడు భక్తుల కోరిక మేరకు ద్వాదశరూపాల్లో కనిపించి కరుణచూపిస్తాడు. అలాంటి వినాయకుణ్ణి భక్తులు దీక్షవహించి పూజించి తరిస్తారు.
కాజీపేటలో స్వయంభూగా అవతరించిన శే్వతార్కగణపతిని మండలదీక్షతో ఆరాధిస్తారు. సంవత్సరానికి రెండుసార్లు గణపతి దీక్షను తీసుకొని భక్తులు హైద్రాబాదుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉండే వరంగల్లు జిల్లాలోని విష్ణుపురిలో కొలువైన వినాయకుణ్ణి పూజిస్తారు.
భాద్రపద శుద్దచవితినాడు వినాయకునికి ఉండ్రాళ్లు, కుడుములను పెట్టి 21రకాల పత్ర పుష్పాలతో పూజిస్తారు. ఆరోజే శే్వతార్కగణపతి ముందు మండల దీక్ష తీసుకుని మాలధారణ చేస్తారు. ఇలా మాలధారణ చేసే స్వాములు గణపుతి ప్రతిరూపాలుగా సంభావిస్తారు. మాలధారణ చేసినవారు సంకల్పసిద్ధికోసం పదకొండుమార్లు ఓ గం గణపతయే నమః అంటూ జపిస్తారు. ఈ మాలధారణ చేసినవారు శే్వత వస్త్రాలను ధరిస్తారు. పూజామందిరంలో గణపతి విగ్రహాన్ని పెట్టుకుని అలంకరించి దానిముందు పసుపు గణపతిని చేసి విఘ్ననాశనాన్ని చేయుమని వేడుకొంటారు. త్రికాలాలలోనూ గణపతి ఆరాధిస్తూ ఎవరినీ నొప్పించకుండా వారు నొవ్వకుండా ఉంటారు. ఆ మృణ్మయ వినాయకుణ్ణినియమనిష్ఠలతో పూజిస్తూ మండలంరోజులు ఎదుటి వారిని విశ్వనాయకుడి నామాలతో పిలుస్తూ. దీక్షనుపూర్తిచేస్తారు. మండలం చివరిరోజు వినాయకుడి ఆలయానికి వెళ్లి దీక్షను విరమిస్తారు. మరికొందరు శ్రావణ శుద్ద చవితి నుంచి మండలదీక్షలు ప్రారంభించి భాద్రపద శుద్ధ చవితి నాడు దీక్షను విరమిస్తారు. విరమణానంతరం జపహోమాదులతో పాటుగా అన్నదానాన్ని కూడా చేసి వినాయకుడిని సంతృప్తి పరుస్తారు. దీక్షాకాలంలో సాయంసంధ్యలలో గణేశభజన చేస్తారు. ఇలా చేసిన వారిని అఖండ ఐశ్వర్యాదులతో అనుకొన్న పనులు విఘ్నాలు లేకుండా జరిగేలా వినాయకుడు అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం.
వినాయకుణ్ణి పూజించే పత్రిలో ఓషధీగుణాలున్నాయ. అవి ఈ మాసంలో ఉపయోగించడంతో మానవుల ఆరోగ్యానికి విశేష ఫలం దొరుకుతుంది. అందుకే ఈ ప్రతాలన్నింటిచేత పూజించిన వారిని పార్వతి పుత్రుడు పూర్ణాయువుకమ్మని దీవిస్తాడు. లంబోదరా లకుమికరా అని సంగీత ప్రియుడైన లకుమివీణాధారుడిని పూజిస్తారు.

జీవాత్మ విభువా? అణువా?


దేవ, మనుష్య, పశు, పక్ష్యాదుల రూపంలో జీవులు అనేకులై ఉన్నారు. జీవాత్మ విభువే అంటే అంతటా వ్యాపించి ఉండే వాడే అని కొందరంటారు. కాదు జీవాత్మ ఒక చోట ఉండే సూక్ష్మ వస్తువే అణువే అని కొందరంటారు. 'ఏ షోణురాత్మా చేత సావేదితవ్యః' ఈ అణువైన ఆత్మ మనస్సుచే తెలుసుకొనదగినవాడు అని ముండకోపనిషత్ వాక్యం. 'వాలాగ్రశతభాగస్య శతధా కల్పితస్యచ భాగో జీవ సవిజ్ఞేయః' తోకగల వరిగింజ తోకలోని కొనను నూరు భాగాలు చేసి, అందులో ఒక భాగాన్ని తిరిగి నూరు భాగాలు చేసిన వానిలో ఒక భాగమంటే జీవాత్మ స్వరూపం ఉంటుందని శ్వేతాశ్వ చర ఉపనిషత్తు(5-9-8)వివరిస్తున్నది. 'ఆరాగ్రమాత్రో' - ఒక సూది మొన పరిమాణంలో ఆత్మ ఉంటుందట. ఆ అణువంత ఆత్మ, దేహమంతా సుఖదుఃఖాదులనెలా అనుభవిస్తుంది? అంటే దీపం ఒక ఇంటిలో ఒక చోట ఉన్నా దాని కాంతి ఇల్లంతా వ్యాపించినట్లు ఆత్మ గుణమగు జ్ఞానం దేహమంతా వ్యాపించి, అనుభవాలను ఇస్తుందని బృహదారణ్య కోపనిషత్తు వాక్యం.

వర్జీనియా బాధిత విద్యార్థుల కోసం నేడే తానా ప్రత్యేక సమావేశం

వర్జీనియా విశ్వవిద్యాలయ విద్యార్థులకోసం శుక్రవారంనాడు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి విద్యార్థులు అందరూ హాజరు కావాలని తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో భారత రాయబారి పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు జరుగుతుంది. చిరునామా : 2107, Massachusetts Avenue, Nw, Washington, DC 20008. సమావేశం తర్వాత మూర్తి లా ఫర్మ్‌కు చెందిన న్యాయనిపుణులతో ఒక సమావేశం ఉంటుంది. బాధిత విద్యార్థి ఎవరైనా తమ సందేహాలను ఈ సమావేశంలో చర్చించి పరిష్కరించుకోవచ్చు. సదర్న్ మిసిసిపి విశ్వవిద్యాలయం, ముర్రే స్టేట్ విశ్వవిద్యాలయం, కాన్‌కార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతినిధులు కూడా ఈ సందర్భంగా అందుబాటులో ఉంటారని, విద్యార్థులు తమ బదలీలకు సంబంధించిన అన్ని సందేహాలను తీర్చుకోవచ్చునని ఆయన చెప్పారు.

పెక్కుమంది విద్యార్థులు బ్యాంకు రుణాలతో చదువుకుంటున్నారని, ప్రస్తుతం వర్జీనియా విశ్వివిద్యాలయ బాధిత విద్యార్థులు తమ భవితవ్యం గురించి ఆందోళన చెందుతున్నారని, ఈ డిసెంబర్‌లో చదువు పూర్తి చేసుకోవలసిన విద్యార్థులు మళ్లీ మొదటినుంచీ అడ్మిషన్లు పూర్తి చేసుకురావాలంటే చాలా కష్టమని, అందువల్ల విద్యార్థుల భవితవ్యానికి అధికారులు సానుకూల చర్యలు తీసుకోవాలని తానా కోశాధికారి సతీష్ వేమన పేర్కొన్నారు.

సెప్టెంబర్‌లో అంతర్జాతీయ తెలుగు అంతర్జాల తొలి సదస్సు

అంతర్జాతీయ తెలుగు అంతర్జాల తొలి సదస్సు సెప్టెంబర్‌లో కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో మూడు రోజుల పాటు జరగనున్నది. అంతర్జాల యుగంలో తెలుగు అనే మకుటంతో జరుగనున్న ఈ సదస్సులో ఈ రంగంలో ఇప్పటికే విశేష కృషి చేస్తున్న తెలుగు భాషా నిపుణులు, కంప్యూటర్ సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

అంతర్జాలంలో తెలుగును మరింత తేలికగా, మరింత ఉపయుక్తంగా ఉండేటట్టు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకునే దిశగా ఈ సదస్సు జరగనున్నది. సెప్టెంబర్ 28 వ తేదీన ప్రారంభమయ్యే ఈ మూడు రోజుల సదస్సులో తెలుగు భాషలో అంతర్జాల వినియోగాన్ని భవిష్యత్తులో మరింతగా పెంపొందించుకోవడానికి ఏమి చేయాలన్న అంశాన్ని లోతుగా చర్చిస్తారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు ఈ సదస్సులో పత్రాలు సమర్పిస్తారు.

రానున్న దశాబ్ద కాలంలో అంతర్జాలంలో తెలుగు భాషకు ప్రాధాన్యం పెరుగనున్న దృష్ట్యా అత్యాధునిక సాంకేతిక పరికరాలలో రేపటి తెలుగు భాష వినియోగానికి ఇప్పటినుంచే సోపానాలు వేయడం ఎలా, సాధనాలు రూపొందించడం ఎలా అన్న అంశాన్ని వివిధ కోణాలలో పరిశీలించి నిపుణులు ఈ సదస్సులో సూచనలు ఇస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ఐ.టి. మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ దిశగా సదస్సుకు అంకురార్పణ చేసినట్టు సదస్సు నిర్వాహకులు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్ల తెలియజేశారు. టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన విదే శీ భాషల విభాగంలో లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ పేరి భాస్కర రావు ఈ సదస్సు అధ్యక్షునిగా ఉంటారని ఆయన వె ల్లడించారు.

ప్రవాసాంద్రుల ధాతృత్వం మరువలేనిది : నందమూరి బాలకృష్ణ

  బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ న్యూయార్క్ విచ్చేసిన సందర్భంగా ఆయన అభిమానులు, ప్రవాసాంద్రులు బాలయ్యకు ఘనస్వాగతం పలికారు. న్యూయార్క్‌లోని ప్రవాసాంద్రులు డాక్టర్ పోలవరపు తులసీ, డాక్టర్ రాఘవరావులు ఈ నిధుల సేకరణకు ఓ వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రసంగిస్తూ ప్రవాసాంద్రుల ధాతృత్వం మరువలేనిదని, దేశానికి వారు చేస్తున్న సేవలను కొనియాడారు. అలాగే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేపట్టబోయే కార్యక్రమాలు, హస్పత్రిలో వసతుల గురించి వివరించారు. క్యాన్సర్ మహమ్మరిని తరిమికొట్టేందుకు ప్రవాసాంద్రులు ఇక ముందు ఇలానే చేయూతనివ్వాలని ఆయన కోరారు.

బాలయ్య చేపట్టిన నిధుల సేకరణ కార్యక్రమానికి న్యూయార్క్‌లో వేశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ప్రవాసాం«ద్రులు, అభిమానులు తమ పూర్తి మద్దతు తెలుపుతూ విరాళాల వర్షం కురిపించారు. బాలయ్య పర్యటించిన నగరాల్లో న్యూయార్క్‌లోనే ఎక్కువగా దాతలు ముందుకొచ్చారు. సుమారు కోటి రూపాయలకు పైగా విరాళాలు ఇచ్చారు.

అంతకు ముందు బాలకృష్ణ శాన్‌ హోషే, లాస్ ఏంజెలెస్, అట్లాంటా, చికాగో, డల్లాస్, సెయింట్ లూసీ, వాషింగ్టన్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరిగా న్యూయార్క్‌లో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమానికి న్యూయార్క్‌తో సహా న్యూజెర్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు, ప్రవాసాంద్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. బసవతారకం ఆస్పత్రి ట్రస్టీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హాస్పటల్ లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమం అనతరం బాలకృష్ణ అమెరికా పర్యటన ముగించుకుని ఇండియాకు బయలుదేరారు. అమెరికాలోని ఆత్మీయులు, అభిమానులు బాలయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు.

ప్రవాసులకు తానా టీమ్ స్క్వేర్ సేవలు


: అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల కోసం తానా సంస్థ అనేక సహాయ సహకారాలను అందజేస్తున్నది. అమెరికాలో ప్రమాదవశాత్తు మరణించిన వారి భౌతిక కాయాలను భారతదేశానికి తరలించడానికి తానా బృందం టీమ్ స్క్వేర్ ఎంతగానో కృషి చేస్తున్నదని తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర వెల్లడించారు.

ఇటీవల అయోవాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మద్ది సురేస్ బాబు (37) పరిమితికి మించి అధికంగా మందులు సేవించడం వల్ల జూలై 11న మృతి చెందారు. బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేట్ అయిన సురేష్ స్వస్థలం గుంటూరు జిల్లా లోని దూలిపల్లి గ్రామం. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ బాబు భౌతిక కాయాన్ని భారత దేశానికి తరలించడానికి సహాయాన్ని అందించవలింసిందిగా సురేష్ స్నేహితులు , కుటుంబసభ్యులు కలిసి తానాను కోరడంతో వెంటనే స్పందించిన టీమ్ స్క్వేర్ చైర్మన్ అంజయ్య చౌదరి లావు, తానా ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ నన్నపనేని సురేష్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు చేరుకునేలా అన్ని ఏర్పాట్లను చేశారని ఆయన వివరించారు.

జూలై 3 న శ్రీమతి డోకె అనే మహిళ మృతి చెందారు. ఆమె మృతదేమాన్ని జూలై 6 హైదరాబాద్‌కు తరలించారు. జూలై 4 న ఐ.టీ. కన్సల్టెంట్ అయిన జయరామ్ పంగిపల్లి ప్రమాదవ శాత్తు టెన్నీసీ నదిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని జూలై 6 న హైదరాబాద్‌కు తరలించారు. జూలై 7 న వీరభద్రం గుండె పోటుతో మరణించారు. ఆయన మృత దేహాన్ని జూలై 10న చెన్నైకి తరలించారు.

అమెరికాలో మరణించిన మద్ది, డోకె, పంగిపల్లి, వీరభద్రం కుటుంబాలకు తానా అధ్యక్షులు తోటకూర తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇంతటి సహాయ సహకారాలు అందించిన తానా బృందం స్క్వేర్ వాలంటీర్లు అయిన గోపాల్ వేదుల, నగేష్ నర్మత్, సురేష్ కాకర్ల, హనుమంత్ కంతి, వెంకట్ దుడ్డుకూరి, కవిత, పద్మ, జగన్మోహన్‌లకు అలాగే చనిపోయిన వారి మృతదేహాలను భారత దేశానికి తరలించడానికి సహాయ సహకారాలు అందించిన తానా నాయకులు అంజయ్య చౌదరి లావు, మోహన్ నన్నపనేనిలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఫ్లోరిడాలో అలరించిన సంగీత విభావరి



ఫ్లోరిడాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్‌విల్లే సంస్థ ఇటీవల 10 వ సాంస్కృతిక వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించింది. మొట్టమొదటి సారిగా తాజా (టీఏజేఏ) కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మేయర్ ఆల్విన్ బ్రౌన్ జ్యోతి ప్రజ్వలనతో సంగీత విభావరిని ప్రారంభించారు. అనంతరం ఆల్విన్ మాట్లాడుతూ ఇటీవల భారత్‌లో జరిగిన ముంబాయి పేలుళ్లలో మృతి చెందినవారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఈ సంవత్సరంలో తొలి వేడుకను నిర్వహించిన తాజా (టీఏజేఏ) సంస్థ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నహాలు చేస్తోంది. 800 మంది తెలుగు ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమం తాజా(టీఏజేఏ) అధ్యక్షులు కీర్తిధర్ గౌడ్, కోఆర్డినేట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ కుమార్ మార్గనిర్దశకంలో గాయకులు రేవంత్, గీతా మాధురి, శ్రీకాంత్, మాళవిక, సుమంగళి పాడిన మెలొడీ పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిన్నారులు ప్రఖ్యాత గాయికులు పాడే చక్కటి తెలుగు సంగీతాన్ని వినడానికి ఎంతగానో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అలాగే హాస్యనటులు ఢిల్లీ రాజేశ్వరి, గౌతమ్ రాజు, కోట శంకర్‌రావు, గీతా సింగ్, సౌమ్య రాయ్ చేసిన హాస్యం ప్రేక్షకులను అలరించింది.

తాజా కమిటీ ఉపాధ్యక్షులు వెంకన్న కరణం, కోశాధికారి సురేష్ పిట్టపల్లి, సెక్రెటరీ ఉపేంద్ర రెడ్డి, కమిటీ సభ్యులు సుధీర్ కొండపోలు, వెంకట్ పంపులపాటి, కార్యక్రమ కోఆర్డినేటర్ మాలిని రెడ్డి, శాంత రాయప్రోలు, రఘువీర్ రెడ్డి, శ్రీనివాస్ మిర్యాల, శరత్ రామిడి, వెంకట్ నందమూరి, మల్లేశ్వర్ రెడ్డి, మధు గబిట్ట, డాక్టర్ అశ్విన్ దావులూరి, డాక్టర్ రవి కంచె, శ్రీకాంత్ లాగిసెట్టి, బాలరాజ్‌గౌడ్, రావ్ గందమ్, రమన మూర్తి, జయప్రసాద్ తంబుగనిపల్లె, శ్రీకాంత్ బిక్కవల్లి, వాసు కాకవేటి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతగానో కృషి చేశారు.

శనివారం, జులై 9

మంచు స్వప్నం



 
ఐస్‌ క్రీం

అరెవా! భలే భలేగా ఉంది ఐస్‌క్రీమ్! రంగు, రుచి, వాసన గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని వాటిల్లో ఐస్‌క్రీమ్ ఒకటి. ఐస్‌క్రీమ్ ఒక దేశానికో, ఒక ప్రాంతానికో ఒక వయసు వారికో మాత్రమే సంబంధించింది కాదు.
ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారు అరుదుగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఐస్‌క్రీమ్ అంటే అదొక చల్లటి మంచు స్వప్నం. అందులోని రకాలు, రకరకాల ఫ్లేవర్స్, షేప్స్, సైజుల గురించి చెబుతూంటేనే నోరూరి పోతూంటుంది. ఐస్‌క్రీమ్ ఎంత రుచిగా ఉంటుందో దానికి అంత విలువైన పురాతన చరిత్ర కూడా ఉంది.


ఐస్‌క్రీమ్ చైనాలో పుట్టింది. మొదటగా గడ్డ కట్టిన మంచు, పాలతో రుచికరమైన వంటకాలు చేసినట్టు చెబుతారు. ‘మార్కోపోలో’ 700 ఏళ్ల క్రితం ఈ ఐస్‌క్రీమ్‌ను పరిచయం చేశారు. చైనా నుంచి దీని రుచి ఇటలీకి, ఫ్రాన్స్‌కి పాకింది. తర్వాత అమెరికన్లకు మహా మోజుగా మారింది. ప్రపంచమంతా విస్తరించింది.


మొదటిసారిగా 1904లో సెయింట్ లూయిస్‌లో ‘ప్రపంచ ప్రదర్శన’లో ఐస్‌క్రీంను ఉంచారు. 1921లో మొదటిగా ఐస్‌క్రీం బార్లు ప్రారంభమయ్యాయి. మొదట్లో ఐస్‌క్రీం అనేది రాజ ప్రాసాదాలకో, అధికార వర్గాలకో, ఏ కొద్ది సంపన్నులకో పరిమితంగా ఉండేది. అప్పట్లో నిల్వ ఉంచడానికి తగిన సౌకర్యాలు లేనందున ఇలా లగ్జరీగా మిగిలిపోయింది. కేవలం కొద్దిమందికే పరిమితమైన ఐస్‌క్రీమ్ రానురాను సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. వివిధ సమాజాలు, వారివారి ఆచార వ్యవహారాలను బట్టి రోజువారీ ఆహారపు టలవాట్లలో చోటు చేసుకుంది. నిజానికి రిఫ్రిజిరేటర్లు వచ్చిన తర్వాత దీనికి మరింత పాపులారిటీ పెరిగింది.


పాలు, వెన్న, చక్కెర లేదా తేనె, కోడిగుడ్లు, వివిధ రకాల పండ్లూ, విత్తనాలు, చాక్లెట్లు మొదలైనవి ఐస్‌క్రీమ్‌లో వాడటం ప్రారంభమైంది. కమర్షియల్‌గా ఐస్‌క్రీంని తయారుచేసే పద్ధతులూ కనిపెట్టారు.
మిల్క్ సాలిడ్, ఫ్యాట్స్, షుగర్, నీరు కలిపి మిక్స్ చేసి, ఐస్‌క్రీం ప్లాంట్‌లో వీటిని ‘పాశ్చరైజ్’ చేస్తారు. తర్వాత ‘హోమోజెనైజేషన్’ ప్రక్రియ ద్వారా అందులోని కొవ్వు పదార్థాలను కరిగిస్తారు. స్టోరేజ్ ట్యాంక్‌లో మూడు, నాలుగు గంటల పాటు ఉంచి తరువాత వివిధ రకాల ఫ్లేవర్లు, కలర్లు కలుపుతారు. ఫ్రీజర్లలో లిక్విడ్ అమ్మోనియా ద్వారా 30 డిగ్రీల టెంపరేచర్‌ని స్థిరంగా ఉంచుతారు. ఫ్రీజర్‌లో అత్యధిక వేగంతో తిరిగే ఫ్యాన్ వంటి బ్లేడ్ల వల్ల మిక్స్ ఫ్రీజర్ పక్కలకు చేరుకుంటుంది.


ఐస్‌క్రీంకు మంచి గాలి ఎంతో ప్రధానమైనది. ఈ గాలి చేరక పోయినట్లయితే కేవలం ఐస్ క్యూబ్‌లు తింటున్నట్టే ఉంటుంది. అలాగే గాలివల్ల మిక్స్ పరిమాణం కూడా పెరుగుతుంది. అన్ని ఐస్‌క్రీముల్లోనూ గాలి ఉంటుంది. గాలి పెరిగే కొద్దీ ఐస్‌క్రీమ్ తేలిక పడుతుంది. ఇలా గాలి ప్రవేశించడానికి ముందు వెనక ఐస్‌క్రీం పరిమాణంలో ఉండే తేడాని సాంకేతికంగా ‘ఓవర్ రన్’ అంటారు. ఇంటి అవసరాలకు ప్యాక్ చేసే ఐస్‌క్రీమ్‌లో 80 శాతం ‘ఓవర్ రన్’ ఉంటుంది. ప్యాకేజీ ముందు ఐస్‌క్రీమ్‌లో పండ్లూ, విత్తనాలు ఉంచుతారు. ప్యాకేజింగ్ అయిన తర్వాత ‘హార్డెనింగ్ రూం’లో పెడతారు.
-23 డిగ్రీల నుంచి -29 డిగ్రీల వరకూ టెంపరేచర్‌లో 12 గంటలసేపు ఈ హార్డెనింగ్ ప్రక్రియ సాగుతుంది. ఐస్‌క్రీంలో ఉండే అత్యధిక భాగం నీరు ఈ దశలోనే గడ్డ కడుతుంది.
తొలి నాళ్లలో ఐస్‌క్రీం తినాలంటే డైరీ పార్లర్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇవాళ ఐస్‌క్రీం పార్లర్లే వెలిశాయి. ఏవో కొన్ని చోట్ల మాత్రమే దొరికే ఐస్‌క్రీంలు ఇప్పుడు ప్రతి చోట్ల కనిపిస్తున్నాయి. అందుబాటులో అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఇలా బయట ఎన్ని లభిస్తున్నా చాలామంది మిహిళలకు ఇంట్లోనే ఐస్‌క్రీం తయారుచేసుకోవాలన్న సరదా ఉంటుంది. అంతేకాదు, స్వయంగా చేసిన ఈ ఐస్‌క్రీంని నలుగురికీ తినిపించి గొప్పగా ఎంజాయ్ చేయాలనుకుంటారు.
కమర్షియల్‌గా చేసిన ఐస్‌క్రీమ్‌కీ, ఇంట్లో చేసిన ఐస్‌క్రీమ్‌కీ చాలా తేడా ఉంటుంది. కానీ, ఇంట్లో చేసిన ఐస్‌క్రీమ్‌లో అదో ఆనందం.
ఐస్‌క్రీమ్ క్వాలిటీని దాని మెత్తదనాన్నిబట్టి, సులువుగా చెప్పవచ్చు. అందులో వాడే క్రీములను బట్టి అది ఉంటుంది.
వెనిల్లా, చాక్లెట్, పిస్తా, ఫ్రూట్.. ఇలా ఎన్ని వెరైటీలైనా మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. తాజా ఫలాలతో, కేకులతో, ఫుడ్డింగ్స్‌తో కలిపితే ఇక ఆ రుచి భలేగా ఉంటుంది.



చూడగానే నోరూరించడానికి ఐస్‌క్రీమ్‌లపైన చాక్లెట్ ముక్కలు, ఫ్రూట్స్, జెల్లీ, తేనె అద్దుతారు. ఇక అవి చూశాక తినేదాకా మనసు, నోరు ఊరుకోవు. ఇవాళ ఐస్‌క్రీమ్ చాలా రొటీన్ అయిపోయింది.
ప్రతి ఫంక్షన్‌లోనూ ఐస్‌క్రీమ్ ఉండాల్సిందే. పెళ్లిలో కానివ్వండి, పార్టీలో కానివ్వండి, పుట్టినరోజు వేడుకలో కానివ్వండి. ఏ కార్యక్రమంలోనైనా ఇప్పుడు ఐస్‌క్రీమ్ చివరి ఐటమ్‌గా ప్రత్యక్షమవుతుంది.

శనివారం, జులై 2

అమ్మ అమృతం అందిస్తోంది


అప్పుడే పుట్టిన పసికందులకు పుట్టిన రోజునుంచే మాతృక్షీర సేవనం అత్యుత్తమం. పెరిగిన ‘నవ నాగరికత’ వనె్న చినె్నలకు ప్రాధాన్యమిచ్చింది. తళుకు బెళుకులు తగ్గుతాయన్న బెడదలో శిశువుల జన్మహక్కులను హరిస్తున్నారు. మాతృక్షీర సేవనానికి దూరం చేస్తున్నారు. ఆ హక్కు సృష్టికర్తకు కూడా లేదు.
బిడ్డలు కన్న తల్లులందరూ తమ పాల శ్రేష్టతను గుర్తించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. కొంతమంది తల్లులు మాత్రం తమ సౌందర్యం తగ్గిపోతుందని బిడ్డలకి పాలివ్వడం లేదు. తల్లిపాలనేవి ప్రకృతి పసిబిడ్డలకు ఇచ్చిన అపూర్వ వరం. పిల్లల అభివృద్ధికి, పెరుగుదలకు ప్రాథమిక దశలో ప్రధానంగా దోహదపడేది తల్లిపాలే.
మాతృక్షీర సేవనంవల్ల బిడ్డకే కాకుండా తల్లి ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి యావత్ ప్రపంచానికే మంచిదన్నది నగ్నసత్యం. నిన్న, మొన్నటి వరకు బిడ్డపుట్టిన మూడు రోజుల వరకు ‘‘తల్లిదగ్గర పాలుండవు. ఉన్న పాలు మంచివి కావు. లేదా సరిపోవు’’ అనేటటువంటి మూఢనమ్మకాలు ఉండేవి. కానీ శాస్ర్తియ పరిశోధనల ద్వారా తెలిసిందేమిటంటే, ప్రసవానికి తరువాత మొదటి మూడు రోజులు తల్లిపాలు చాలా విశిష్ఠమైనవని, అందులో రోగనిరోధక శక్తి, విటమిన్లు అధిక మోతాదులో ఉంటాయని, ఆ కొద్దిపాలే బిడ్డకు ఆ సమయంలో సరిపోతాయని, అలాగే 4, 6 మాసాల వరకు బిడ్డకు సరిపోయే పాలు తల్లి దగ్గర ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఆర్నెల్ల తరవాత తల్లిపాలతో పాటు అనువైన అనుకూలమైన ఆహారాన్ని ఇస్తూ రెండు, మూడు సంవత్సరాల వరకు తల్లిపాలు తాగిస్తే మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మధ్యకాలంలో తల్లిపాల సంస్కృతికి అగాధం ఏర్పడుతోంది. వాణిజ్యపరంగా అమ్మబడే పాలడబ్బాలు తల్లిపాలకు సమానమని, తల్లిపాలకంటే శ్రేష్ఠమైనవని ప్రచారంలోకి వచ్చింది. ఇదే భావనతో చాలామంది తల్లులు ఆమోదిస్తూ వస్తున్నారు. రానురాను ఈ పాలపొడి వ్యాపారుల విపరీతమైన ఆకర్షణతో కూడిన ప్రకటనలతో అసలు తల్లిపాల సంస్కృతి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది.
‘‘తల్లిపాలు అమృతం’’.
తల్లిపాలకు సాటి మరొకటి లేదన్న విషయాన్ని కొన్ని దశాబ్దాలపాటు జరిపిన పరిశోధనల్లో తేల్చి చెప్పారు. ‘‘పోతపాలు ప్రమాదకరం’’ అని కూడా పరిశోధకులు చెపుతున్నారు. అయినా కొంతమంది తల్లులు ‘‘నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు’’ అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
తల్లిపాలల్లో బిడ్డకు కావలసిన అన్నిరకాల పోషక పదార్థాలతో పాటు అతిముఖ్యమైన వ్యాధి నిరోధక శక్తి ఉన్నదన్న విషయాన్ని తల్లులందరూ తప్పనిసరిగా గుర్తించాలి. పోతపాలలో ఈ వ్యాధి నిరోధకశక్తి, బిడ్డకు కావలసిన అనువైన పోషక విలువలు లేవని తెలుసుకోవాలి. పోతపాలు తాగే పసి పిల్లలు వివిధ రకాల వ్యాధులకు గురై రోజుకు నాలుగువేల మంది మృత్యువాత పడుతున్నారని అంచనా. ఈ అమాయక శిశు మరణాలకు కారణం ఆలోచిస్తే చాలామంది తల్లులకు తల్లిపాల ప్రాధాన్యత తెలియకపోవడమే. తెలిసినా తగిన ప్రోత్సాహం, సహకారం లభించకపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. వీటన్నిటికీ తోడు పాలపొడి పరిశ్రమ అసత్య ప్రకటనలు తల్లిపాల శ్రేష్ఠతను, సమర్థతను తక్కువగా అంచనా వేసేందుకు దోహదం చేస్తుంది.
చంటి బిడ్డలకు కనీసం నాలుగు నెలల నుండి ఆరునెలల వరకు ప్రతి తల్లి తల్లిపాలను మాత్రమే ఇచ్చేందుకు తగిన ప్రోత్సాహం, సహకారం కల్పించడానికి వైద్యులు సైతం నిర్దేశించాల్సిన అవసరం ఉంది. ఆర్నెల్ల తరువాత మన ఇంట్లో వండిన ఆహార పదార్థాలతో పాటు బిడ్డకు రెండు సంవత్సరాల వరకు పాలు ఇప్పించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ప్రసవించిన వెంటనే బిడ్డకు పాలివ్వడంవల్ల అధిక రక్తస్రావం అరికట్టబడుతుంది. రొమ్ము క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. అలాగే తల్లికి, బిడ్డకు మధ్య అనుబంధం పెనవేసుకునేలా... బలంగా ఉండాలంటే తప్పనిసరిగా బిడ్డకు పాలివ్వాల్సిందే. బిడ్డ భవిష్యత్తులో అలర్జీ, ఆస్మావంటి జబ్బులు, మధుమేహ వ్యాధివంటి జబ్బులు, జీర్ణాశయ వ్యాధులు, నరాల జబ్బులు రాకుండా రక్షణ కలుగుతుంది. తల్లిపాలవల్ల బిడ్డకు తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి.
కాగా, ప్రస్తుత సమాజంలో పాలిచ్చేతల్లి ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటుంది. బిడ్డకు పాలుపట్టే సమయం దొరకకపోవడం, కుటుంబ సభ్యులు సహకరించక పోవడం, కొన్నిచోట్ల వైద్యులు సరైన సహకారం అందించకపోవడం, పరిశ్రమలో అనేక అసత్య ప్రకటనలు, మూఢ నమ్మకాలు మొదలగునవి పాలిచ్చే తల్లి సహజ హక్కును కాలరాస్తున్నాయ.
తల్లిబిడ్డకు పాలివ్వడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి పొందే తృప్తి, అనుభూతి వర్ణనాతీతం. నిజంగా తల్లిపాలివ్వడం ఒక వరం. ఏవేవో కారణాలు చూపించి, బిడ్డకి పాలివ్వక పోవడం క్షమించరాని నేరం. పుట్టిన బిడ్డ క్షేమం కన్నా కన్నతల్లి కోరుకునేది ఏముంటుంది? తన బిడ్డ క్షేమం కోరే ప్రతి తల్లి బిడ్డకు పాలివ్వడం సంస్కారం, ఆచారం. అదే మన సంస్కృతి, పాలిచ్చిన తల్లికి అప్పుడే మనజాతి తలవంచి నమస్కారం చేస్తుంది.
ఈ మధ్యకాలంలో చాలామంది తల్లులు తమ సౌందర్యం తగ్గి పోతుందని బిడ్డలకు పాలివ్వడం లేదు. ఇది చాలా దారుణం. బిడ్డలకి పాలిస్తే సౌందర్యం తగ్గిపోతుందనుకోవడం వట్టి భ్రమే. ఇలాంటి అపోహలతో కొంతమంది తల్లులు బిడ్డలకి పాలివ్వడం మాన్పించేస్తున్నారు. ఇది స్ర్తి జాతికే కళంకం. బిడ్డకు పాలివ్వడం అనేది సృష్టి రహస్యాల్లో ఒక అంశం. దాన్ని అందరూ ఆమోదించాల్సిందే.
- కంచర్ల సుబ్బానాయుడు

టీనేజ్ అంటే ఒక తరంగం.



టీనేజ్ అంటే ఒక తరంగం... ఒక ఆవేశం... ఒక తొందర పాటు... ఒక ఆకర్షణ.
ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, ప్రేమలో పడిపోవడం, గాడి తప్పడం, అవసరమైతే తల్లిదండ్రులను కూడా కాదనడం ఈ రోజుల్లో సహజంగా మారింది.
దీనితో నేటి ఆధునిక యువతీ యువకుల్లో అనేక సమస్యలు వస్తున్నాయి. జీవితానికి సంబంధించి అవి చిన్నవైనా కావచ్చు. అయితే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉంది.
మనం రోజూ ఎందరినో చూస్తుంటాం. ఒక్కొక్కరిదీ ఒక్కో రకం వ్యక్తిత్వం. ఎదుటి వారి మనస్తత్వం బట్టి కొన్ని చోట్ల నడుచుకోవాలి. మనశక్తి సామర్థ్యాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వాతావరణం, అర్హతలనుబట్టి మనుగడ సాగించాలి. జీవనాధారం కోసం ఒక వృత్తిని ఎంచుకోవడం తప్పనిసరి. ఉద్యోగం అంటే నూటికి నూరుపాళ్ళు పక్కాగా వృత్తిపరమైనది. దాన్ని ఎంచుకునే ముందు కడు జాగ్రత్త వహించాలి. జీవితంలో తేడాలు లేకుండా ఒకేసారి నాలుగైదు చోట్ల ఆఫర్లు వస్తుంటాయి. దేన్ని ఎంచుకోవాలనే విషయంలో చాలా గందరగోళానికి గురి చేస్తుంది.
అలాంటప్పుడు జాబ్ గుణగణాలు, టైమింగ్స్, వాతావరణం, నివాసానికి, ఆఫీసుకి మధ్య దూరం, రాకపోకలకు అనుకూలత లాంటి అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి, మీ అభిమతానికి, అర్హతకి అనుగుణంగా ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. పొరపాటున మనకు అనుకూలం కాని జాబ్‌లో చేరిన వెంటనే రిజైన్ చేయకుండా మరో జాబ్‌లో చేరేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే చేస్తున్న మొదటి ఉద్యోగానికి ముగింపు పలకాలి.
యూత్‌లో చాలామంది ఎప్పుడో ఒకసారి ‘‘నేను ప్రేమిస్తున్నాను’’ అనుకుంటారు. నిజంగానే తమ వైపునుంచి ప్రేమలో పడిపోతారు. కానీ ఎదుటివారుకూడా మనల్ని ప్రేమిస్తున్నారా? లేదా అని ఆలోచించరు. మీరు ప్రేమిస్తున్న వారు ‘నో’’ అంటే మీరు తట్టుకోగలగాలి. ఆందోళన చెందకుండా ఉండాలి. ఆ వ్యక్తికి ఎలాంటి వ్యసనాలున్నా భరించగలగాలి. ఆ తర్వాత మార్పు చేసుకోవాలి. అలాంటి గుణం మీరు కలిగినట్టయితే నిజంగా ప్రేమిస్తున్నట్టు లెక్క. సినిమాలు, షికార్లలో మనం ఏం చూస్తే వాటిల్లో సగమైన మనకూ ఉండాలనిపిస్తుంది. కానీ అది అసంభవం కావచ్చు కదా. అప్పుడే మరో ఆలోచన కూడా వస్తుంది. ఒక్కసారిగా బ్రహ్మాండం జరగాలని, అదృష్టం వరించాలని ఇది ఏ నూటికో, కోటికో ఒక్కరికే జరగొచ్చు. అందరికీ కాదుకదా. అందుకే వారానికో ఎంతో కొంత పొదుపు చేసుకుంటూ వెళితే ఐదారు సంవత్సరాలకి పెద్ద మొత్తంగా ఉపయోగించుకోవచ్చు. మనకు ఏమేం కోరికలుంటాయో వాటిని తీర్చుకోవడానికి పొదుపు యంత్రం పాటించాలి.
ఆకలైనా, కాకపోయినా అప్పుడప్పుడు చిళ్ళు తినడం యూత్‌కు అలవాటే. ఐస్‌క్రీమ్‌లు, పానీపూరీలు ... గోబీ... లాంటివి తినడం అంటే సరదా. కానీ నిజంగా ఆకలేస్తుందా అన్నది ఆలోచించుకుంటే వాటి అవసరం ఎంతో తెలుస్తుంది. లేదనుకుంటే మీకు గిఫ్ట్ గ్యారంటీ... అదే ఊబకాయం. రెండు. మూడుసార్లు చిరుతిళ్ల విషయంలో నాలుకను నియంత్రించగలిగితే మరోసారి ఆలోచన రాదు. ఆదిలో ఆ అలవాటును అంతం చేసుకుంటే ఎప్పటికీ మీరు స్లిమ్‌గా యాక్టివ్‌గా ఉండొచ్చు. మీతో అందరూ క్లోజ్‌గా ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే వారిలో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయాలో గమనించాలి. మీకు దగ్గరగా ఉండే వారందరూ ఏ సందర్భంలో సన్నిహితులయ్యారో ఒకసారి మననం చేసుకుంటే తెలుస్తుంది.
మీరు చేసేపనికి తల్లిదండ్రులు లేదా బంధుమిత్రులు అడ్డు చెప్పవచ్చు. అలాంటప్పుడు మీరు చేపట్ట్టే పని గురించి క్షుణంగా చెప్పాలి. మీరు మంచి అవగాహనతోనే వారికి అర్థం అయ్యేలా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే మీకు లైన్ క్లియర్, ఇక మీరు ఏ పనైనా... ఛాలెంజ్‌గా ... అవలీలగా చేయొచ్చు. అప్పుడే మీకు మీ వారికి... అందరికీ హ్యాపీ... కష్టే ఫలే ..
- కంచర్ల 

శుక్రవారం, మే 27

కార్డే కదా అనుకుంటే .... కాటేస్తుండీ ! ..



యువతను ఆకట్టుకునే సర్పాలు చాలాచాలా ఉన్నాయి. ఫ్రెండ్స్‌తో సరదా చేయడం, క్లాసులు డుమ్మాకొట్టి పిక్చర్లకు వెళ్లడం, పిక్‌నిక్‌లకు చెక్కేయడం, పరీక్షల్లో తేలిగ్గా పాసవడానికి టెక్స్ట్ పేపర్లు అందుబాటులోకి రావడం.. వగైరాలన్నమాట. వీటికి మించిన సర్పం ఒకటి పడగవిప్పి బుస కొడుతోంది.
ఇది జేబులో నక్కి ఉన్నట్టే ఉండి ఒక్కసారిగా కోరలు తెంచుకుని భయపెడుతుంది. ఆ భయానికి యువత ఇంట్లోంచి పారిపోవడమో లేక ప్రాణాలను విడవటమో జరుగుతోంది. జేబులో దాగే ఆ కాలసర్పం ‘క్రెడిట్ కార్డ్’!
ఆ కార్డులను భారీగా మన దేశంలో కూడా విద్యార్థులకు అలవాటు చేస్తున్నారు. నేటి వాడకందారే రేపటి వినియోగదారుడన్న నిజాన్ని క్రెడిట్ కార్డు యాజమాన్యాలు బాగా గ్రహించి స్టూడెంట్ కార్డులను ప్రవేశపెట్టాయి. వీటితో విద్యార్థులు తమ తక్షణ అవసరాలను తీర్చుకోడానికి అంటే పుస్తకాలు వగైరాలను కొనుక్కోవడానికి, ఫీజులు, క్యాంటీన్ ఖర్చులకు, అదనపు అవసరాలు తీర్చుకోవడానికి దోహదపడుతుంది. అయితే, పనిలో పనిగా ఈ స్పెషల్ కార్డుపై ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి అనేక సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. యువత వక్రమార్గంలో పయనించడానికి కూడా ఇవి దోహదం చేస్తున్నాయి. పిజ్జా కార్నర్లు, బర్గర్ సెంటర్లు, డిస్కో థెక్‌లు, గార్మెంట్ షాపులు, షూ మార్టులు, పబ్‌లు కూడా స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.
‘మీ జేబులో ప్లాస్టిక్ మనీ అంటే.. క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. ఆనందం మీ చెంతే’ అని కూడా ప్రచారాలు బాగా ఊరిస్తుంటాయి. మన దేశంలో ఇంకా అలవాటు కాలేదు గానీ, విదేశాల్లో అయితే ప్రధానంగా అమెరికాలోనైతే ఏకంగా కాలేజీల్లోనే ఈ కార్డుల అమ్మకం కోసం , ఉద్యో గాల కోసం నిర్వహించే క్యాంపస్ సెలెక్షన్‌లా.. ‘క్యాంపస్ మార్కెటింగ్’ జరుగుతోంది. ‘ఇక్కడే అప్లికేషన్ నింపండి, తక్షణ బహుమతిగా.. ఇవి అందుకోండి’ అంటూ టీ షర్ట్‌లు, కోక్ టిన్నులు, రంగురంగుల ఆట వస్తువులు ఎర వేస్తున్నారు.
కార్డుపై ఇచ్చిన మొత్తాన్ని వాడుకుని నెలవారీగా కనీస మొత్తాన్ని చెల్లిస్తే చాలునని చెప్పడంతో లేబ్రాయపు యువత చిక్కుకుపోతోంది. పైగా ఒక కార్డుపైన వాడుకునే మొత్తాలనుబట్టి, క్రెడిట్ రిపోర్టును బట్టి ఇతర కార్డుల యాజమాన్యాలు కూడా యువతకు కార్డులను అంటగడుతున్నాయి.
ఈ కార్డులపై ఇచ్చే అరువు మొత్తంలో రెండు వంతులు వస్తురూపేణా కొనుగోళ్లకు, ఒక వంతును నేరుగా ధనరూపేణా వాడుకోవచ్చు. అంటే ఉదాహరణకు 15 వేల రూపాయలు క్రెడిట్ లభిస్తే, దానిలో పది వేల రూపాయల విలువైన వస్తువులను ఈ-కార్డును ఆమోదించే షాపులలో కొనవచ్చు. ఒక 5 వేల రూపాయల వరకు సొమ్మును నేరుగా ఎటిఎంలలో విత్‌డ్రా చేసుకుని వాడుకోవచ్చు. ఈ మొత్తానికి గాను వారు వేసే సాలుసరి వడ్డీ (ఎఆర్‌పి) 13 శాతం అనుకుందాం. దీనికి కొంత వ్యవధిని ఇస్తారు. ఈలోగా మీకు సదరు కార్డు వాళ్ల నుంచి వచ్చే నెలవారీ స్టేట్‌మెంట్‌లో ‘మీరు ఇంత మొత్తం బకాయి ఉన్నారు. అయినప్పటికీ మీరేమీ వర్రీ కావద్దు. కేవలం 2 లేదా 3 శాతం మాత్రమే చెల్లించండి చాలు. క్రెడిట్ పాలసీ కొనసాగుతుంది’ అని పేర్కొంటారు.
అక్కడే అసలు కిటుకంతా ఉంది. కార్డు హోల్డర్ ఆ మంత్రానికి లొంగిపోయి కనీస మొత్తాన్ని చెల్లించి ఊరుకుంటాడు. ఇలా నెలవారీగా కొంత కొంత చెల్లించడంవల్ల అసలు తీరదు సరికదా, తడిసి మోపెడై మూడేళ్లలో రెట్టింపై కూర్చుంటుంది. అంటే సుమారుగా 24 శాతం వడ్డీ పడుతుందన్నమాట.
కార్డు తీసుకోవడానికి ముందు..
* నిజంగా మనకు కార్డు అవసరమా?
* కార్డును సరిగ్గా వాడగలమా?
* కనీస మొత్తాన్ని చెల్లించడానికి తగినన్ని ఆదాయ వనరులు మనకు ఉన్నాయా?
* అన్నింటికీ మించి, ఏ నెలకానెల పూర్తి రుణాన్ని చెల్లించగల స్థోమత ఉందా?
ఇవన్నీ ఆలోచించుకునే క్రెడిట్ కార్డు తీసుకోవాలి.
కార్డు తీసుకున్నాక..
* కనిపించిన ప్రతి వస్తువునల్లా కొనవద్దు.
* ఇ-షాపింగ్‌ను చేయడం అసలుకే ముప్పు.
* వస్తువుల కొనుగోలులో బేరమాడానికి ఎలాంటి సందేహం, మొహమాటం వద్దు.
* కనీస మొత్తాలను మాత్రమే చెల్లిస్తే చాలు.. అని ఏ మాత్రం అనుకోవద్దు. తరువాత మోసాల బారిన పడవద్దు.
* సాధ్యమైనంత వరకూ ఎప్పటికప్పుడు పూర్తి బకాయిలను చెల్లించేయండి.
* క్రెడిట్ బ్యాలెన్స్‌ను అదుపులో ఉంచుకోండి. క్యాష్ విత్‌డ్రాలు వద్దు.

- కంచర్ల
 

మంగళవారం, మే 24

గతమంతా నిదురలోన...




నిద్ర - శారీరక, మానసిక ఆరోగ్యాలను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. రోజుకి ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోతే చాలా మంచిది.
చాలా తక్కువ మందికి పడక మీదికి చేరుకోగానే నిద్ర పడుతుంది. అది అదృష్టంగా భావించవచ్చు. అయితే మంచం ఎక్కినా కూడా ఎక్కువమంది టీవీ చూడటమో, మొబైల్‌లో ముచ్చట్లు చెప్పుకోవడమో చేస్తుంటారు. ఈ రెండు పనులు చాలు నిద్రకు మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడానికి.
ఇవేవీ చేయకపోయినా - నిద్ర పట్టని వాళ్లు కొందరుంటారు. వీళ్లకి బుర్రలో సుడిగాలిలా ఆలోచనలు రేగుతుంటాయి. దాంతో మనసు చెదిరిందంటారు. నిద్ర పట్టకపోవడానికి ఇలాంటి కారణాలెన్నో..
గాఢంగా, హాయిగా మంచి నిద్రకు దగ్గరవ్వాలంటే కొన్ని టిప్స్ తెలుసుకోవాల్సిందే. ఏళ్ల తరబడి చెబుతున్నదే అయినప్పటికీ ‘నిద్ర’ కుపక్రమించే ముందు ఆ ఆలోచనలేవీ మదిలో మెదలవన్నది ఆనాటి ప్రశే్న. కాబట్టి కొన్ని సూచనలూ సలహాలూ ‘బుర్ర’లోకి ఎక్కిస్తే నిద్ర దానంతట అదే వస్తుందన్నది తాజా ఉదాహరణ. ముందుగా నిద్రకు ఒక షెడ్యూల్ తయారుచేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే సమయం, మేలుకునే సమయం రెండూ కూడా క్రమం తప్పకుండా ఒకే సమయాల్లో ఉండేలా చూసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. అలా రోజూ కుదరని వాళ్లు కనీసం వారంలో మూడు రోజులపాటు రోజుకి అర్ధగంట తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. కాఫీ, చాక్లెట్లలో కెఫెన్ ఉంటుంది. కాబట్టి వాటికి దూరం. కెఫెన్ నిద్రపట్టకుండా చేయడమే కాకుండా నిద్ర పోయిన తర్వాత కూడా మాటిమాటికీ మెసిలేలా చేస్తుంది. అంటే గాఢనిద్రకు దూరం చేస్తుందన్నమాట.
బాగా మెత్తగా లేదా గట్టిగా ఉన్న పరుపు మీద నిద్రపోవద్దు. పరుపు కొని తొమ్మిదేళ్ల పైన అయితే లోపల స్ప్రింగ్ మాట్రెన్‌ను మార్చేయాలి. పొగ, మందు అలవాట్లకు దూరం కావాలి. ధూమపానం, మద్యం కూడా కెఫెన్ లాగానే నిద్రపై ప్రభావం చూపుతుంది. మనం చేసే వృత్తిలో పని వత్తిడి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నిద్రకు మూడు గంటల ముందు వత్తిడి ఉండకూడదు. మానసిక సమస్యలు, ఆందోళనకరమైన ఇతర అనారోగ్యాలుంటే వైద్యుల్ని సంప్రదించటం మంచిది. ఎలాంటి సమస్యలున్నా నిద్రపోయే ముందు వాటి గురించి ఆలోచించనే కూడదు.
కడుపు నిండుగా తినో లేదా ఆకలితోనో నిద్రకు ఉపక్రమించొద్దు. పొట్ట నిండుగా ఉంటే నిద్రపట్టక అటూ ఇటూ కదులుతూ ఉంటారు. ఖాళీ పొట్ట వల్ల అసౌకర్యంగా, గడబిడగా ఉంటుంది. నిద్రకు గంట ముందే భోజనం చేయాలి. సినిమాలు చూస్తూనో, పార్టీల వల్లనో, టీవీ ప్రోగ్రాంల వల్లనో రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం వంటివి చేయొద్దు. ముఖ్యమైన కార్యక్రమాలను రాత్రిళ్లు ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత మంచిది. నిద్రకు బాగా ప్రాధాన్యత నివ్వాలి. నైట్ డ్యూటీ చేసేవాళ్లు టీ తాగడం మంచిది కాదు. నిద్ర మేల్కొనేందుకు టీ తాగుతారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్రకు కేటాయించిన సమయంలో ఎలాంటి ఆలోచనలు రాకుండా, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ నిద్రపోతే చాలు. నైట్ డ్యూటీలోనయినా నిద్ర కళ్లకు దూరంగా ఉండొచ్చు.

- కంచర్ల

సోమవారం, ఏప్రిల్ 18

పలకరింపు... పులకరింపు..


  
పొగడ్త మంచిదే...! ..
. ప్రశంసల  వర్షం కురిపించండి..!
పలకరింపు... పులకరింపు...
ప్రశంస తిరుగులేని సాటిలేని హార్మోన్ వంటిది. దానివల్ల మనస్సు, శరీరం రెండూ ఉత్తేజితమవుతాయి. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. అందుకే ఎటువంటి వారికైనా ప్రశంస ప్రధానం.
విమర్శనాత్మకమైన విశే్లషణలతో మనస్సు పాడుచేసుకోవద్దు. చాలామంది ఎదుటివారిలోని మంచిని గుర్తించినప్పటికీ ఆ ముక్కను వారితో చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. చెబితే తామెక్కడ తక్కువయి పోతావేమోనన్నది వారి ఆలోచన. అయితే ఇంకొందరికి అహం అడ్డు వస్తుంటుంది. ఎదుటివారిని ప్రశంసించవలసి వచ్చిన సందర్భాల్లో నోరుకట్టేసుకుంటారు. అప్పుడు ఇలాంటి వారిని ఎవరు మాత్రం ప్రశంసిస్తారు. ప్రశంసలు కావాలని కోరుకోని వారుండరు. కాబట్టి మనమూ ప్రశంసించడం నేర్చుకోవాలి. ప్రశంసలు మన మనస్సును ఉల్లాసపరుస్తుంది. అభివృద్ధికీ దోహద పడుతుంది.

 
ఏ వయసులో ఉన్నా, ఏ దశలో ఎంత ఉన్నతిలో ఉన్నా చిన్నపాటి ప్రశంసను కోరుకోని వారు బహుశః ఎవరూ ఉండరు. ఎదుటి వ్యక్తిలోని మంచిని గుర్తించి, ప్రశంసించే గుణం అందరికీ ఉండదు. ఎవరయినా ప్రశంసిస్తే, మొహమాటానికి పొగడ్తలు వద్దులే అని ఓ మాట అనేస్తాం. కాని ఆ ప్రశంసతో మనసు ఎంత చిందులు వేస్తుందో, ఉత్సాహం ఎంతగా పరవళ్ళు తొక్కుతుందో అనుభవించిన వారికి కాని తెలియదు.

 
నవ్వినప్పుడు మోములో ఒంపు వస్తుంది. కాని ఎన్నో విషయాల్ని సరిచేసే లక్షణం ఆ నవ్వుకు ఉంది. ఎదుటివారి అందాన్నో, పర్సనాలిటీనో, నచ్చిన గుణాన్నో, వారి వృత్తి, ఉద్యోగ మెళకువల్నో, తెలివితేటల్నో అభినందిస్తే ఆ ఆనందం నవ్వులో పరిమళిస్తుంది. ఎదుటివారిలోని గుణగుణాల్ని ప్రశంసించగల వ్యక్తులు నిజంగా గొప్పవారే. చాలామందికి తోటి వారిలోని మంచిని ప్రశంసించడానికి అహం అడ్డు వస్తుంటుంది.


 
ముఖస్తుతి, పొగడ్తల్ని మర్చిపోదాం. మనస్ఫూర్తిగా చేసే చిన్నపాటి వాఖ్యానం చాలు ఎదుటివారిని కదిలించడానికి. మనస్ఫూర్తిగా విష్ చేస్తే చాలు. పొగడ్త మిళితమయిన పలకరింపు వారి కన్నులను తడిపేస్తుంది. ఇది ఎమోషనల్ ఆహారం. చాక్లెట్ల కంటే తీయనైనది. కిచిడి కంటే పోషకాహారం. మరెన్నో వాటికంటే శక్తి నిచ్చేది. అంటే రోజుకొక్కసారైనా అందే ప్రశంస రోజంతా ఎదుర్కొనే ఒత్తిళ్ళను దూరం చేయగల శక్తివంతం అయినదన్నమాట. సంతోషపూరితమయిన బాంధవ్యంలో ఉండాల్సిన లక్షణాల జాబితాలో ప్రేమ తర్వాతి స్థానం పరస్పర ప్రశంసలదే.

 
మన ప్రశంసలకు పాత్రులయ్యే వారు వారిని వర్ణించే మన మాటలోని గొప్పతనం గ్రహిస్తారు. అంటే వారి జీవితాలు విజయ పథంలో సాగడానికి మద్దతును, స్ఫూర్తిని, ప్రశంసల ద్వారా అందిస్తున్నట్లేనని నిపుణులు సైతం చెబుతున్నారు. ప్రశంస అనేది తిరుగులేని, సాటిలేని హార్మోన్ వంటిది. మనస్సు, శరీరం రెండూ సంతోషంతో నాట్యం చేయాలని వాంఛిస్తాయి.
 
శివుడు సమాధిలో కూర్చున్నప్పుడు విశ్వమంతా అతనిలో ఒదిగిపోయి వుండి, అతను ఆనందంలో నర్తిస్తున్నప్పుడు ఆ విశ్వం బద్దలయిన మాదిరి, మనలోని శివశక్తి ప్రశంసలతో తడిచి ముద్దవుతుంది. ఆ స్ఫూర్తితో మన జీవితాలను పునర్నిర్మించుకోగలం. మన ధోరణిని పునః సృష్టించుకుంటాం. విభిన్న భావోద్రేకాలకు, విభిన్న నరాలు అనుసంధానం అయి వుంటాయి కాబట్టి నరాలు, అనుభూతులకు ప్రశంసలకు వేర్వేరుగా నరాలన్నీ మన మెదడులో గూడు కట్టుకుని ఉంటాయి. భావోద్రేకాల న్యూరాన్ల నెట్‌వర్క్ రోగనిరోధక వ్యవస్థను, నాడీ వ్యవస్థను, జీర్ణవ్యవస్థను, హృదయ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

 
మనుగడకు ప్రశంసల అవసరం ఎంతయితే ఉందో ఎదుటివారికీ అంతే ఉంటుందని మనం గుర్తించాలి. ఇది విశ్వజనీన సూత్రం. ఎదుటివారికి ఏదైతే ఇస్తామో మనకూ అదే దక్కుతుంది. ‘‘మీకు కనుక ఎదుటివారి అటెన్షన్, ప్రశంస కావాలనుకుంటే ఆ రెంటినీ మీరూ ఇవ్వాల్సిందే. అందుకే ఎదుటివ్యక్తుల గొప్పతనాన్ని గుర్తించండి. గుర్తించిన దానిని ఎంచక్కా వారికి చెప్పేయండి. ప్రశంసలవల్ల ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఆలోచనలకు, శక్తికి రీచార్జి అవుతుంది. పరిధిని విస్తరించుకోవాలని, దయా గుణాలతో, ప్రతిదానినీ మరింతగా ప్రేమించాలని వాంఛిస్తారు. అందుకు ఎటువంటి వారికైనా ప్రశంస ప్రధానం. కాబట్టి కురిపించండి ప్రశంసల జల్లు. దాంతో మీకు దక్కుతుంది మంచి ప్రశంసల పులకరింత.
 - సుబ్బానాయుడు


బుధవారం, ఏప్రిల్ 13

హ్యాపీ లైఫ్ కు ఆనంద సుత్రాలివిగో...

 

హ్యాపీ లైఫ్ కు ఆనంద సుత్రాలివిగో...

టీనేజ్ అంటే ఒక తరంగం... ఒక ఆవేశం... ఒక తొందర పాటు... ఒక ఆకర్షణ.
ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, ప్రేమలో పడిపోవడం, గాడి తప్పడం, అవసరమైతే తల్లిదండ్రులను కూడా కాదనడం ఈ రోజుల్లో సహజంగా మారింది.

దీనితో నేటి ఆధునిక యువతీ యువకుల్లో అనేక సమస్యలు వస్తున్నాయి. జీవితానికి సంబంధించి అవి చిన్నవైనా కావచ్చు. అయితే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉంది.
మనం రోజూ ఎందరినో చూస్తుంటాం. ఒక్కొక్కరిదీ ఒక్కో రకం వ్యక్తిత్వం. ఎదుటి వారి మనస్తత్వం బట్టి కొన్ని చోట్ల నడుచుకోవాలి. మనశక్తి సామర్థ్యాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వాతావరణం, అర్హతలనుబట్టి మనుగడ సాగించాలి. జీవనాధారం కోసం ఒక వృత్తిని ఎంచుకోవడం తప్పనిసరి. ఉద్యోగం అంటే నూటికి నూరుపాళ్ళు పక్కాగా వృత్తిపరమైనది. దాన్ని ఎంచుకునే ముందు కడు జాగ్రత్త వహించాలి. జీవితంలో తేడాలు లేకుండా ఒకేసారి నాలుగైదు చోట్ల ఆఫర్లు వస్తుంటాయి. దేన్ని ఎంచుకోవాలనే విషయంలో చాలా గందరగోళానికి గురి చేస్తుంది.
అలాంటప్పుడు జాబ్ గుణగణాలు, టైమింగ్స్, వాతావరణం, నివాసానికి, ఆఫీసుకి మధ్య దూరం, రాకపోకలకు అనుకూలత లాంటి అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి, మీ అభిమతానికి, అర్హతకి అనుగుణంగా ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. పొరపాటున మనకు అనుకూలం కాని జాబ్‌లో చేరిన వెంటనే రిజైన్ చేయకుండా మరో జాబ్‌లో చేరేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే చేస్తున్న మొదటి ఉద్యోగానికి ముగింపు పలకాలి.
యూత్‌లో చాలామంది ఎప్పుడో ఒకసారి ‘‘నేను ప్రేమిస్తున్నాను’’ అనుకుంటారు. నిజంగానే తమ వైపునుంచి ప్రేమలో పడిపోతారు. కానీ ఎదుటివారుకూడా మనల్ని ప్రేమిస్తున్నారా? లేదా అని ఆలోచించరు. మీరు ప్రేమిస్తున్న వారు ‘నో’’ అంటే మీరు తట్టుకోగలగాలి. ఆందోళన చెందకుండా ఉండాలి. ఆ వ్యక్తికి ఎలాంటి వ్యసనాలున్నా భరించగలగాలి. ఆ తర్వాత మార్పు చేసుకోవాలి. అలాంటి గుణం మీరు కలిగినట్టయితే నిజంగా ప్రేమిస్తున్నట్టు లెక్క. సినిమాలు, షికార్లలో మనం ఏం చూస్తే వాటిల్లో సగమైన మనకూ ఉండాలనిపిస్తుంది. కానీ అది అసంభవం కావచ్చు కదా. అప్పుడే మరో ఆలోచన కూడా వస్తుంది. ఒక్కసారిగా బ్రహ్మాండం జరగాలని, అదృష్టం వరించాలని ఇది ఏ నూటికో, కోటికో ఒక్కరికే జరగొచ్చు. అందరికీ కాదుకదా. అందుకే వారానికో ఎంతో కొంత పొదుపు చేసుకుంటూ వెళితే ఐదారు సంవత్సరాలకి పెద్ద మొత్తంగా ఉపయోగించుకోవచ్చు. మనకు ఏమేం కోరికలుంటాయో వాటిని తీర్చుకోవడానికి పొదుపు యంత్రం పాటించాలి.
ఆకలైనా, కాకపోయినా అప్పుడప్పుడు చిళ్ళు తినడం యూత్‌కు అలవాటే. ఐస్‌క్రీమ్‌లు, పానీపూరీలు ... గోబీ... లాంటివి తినడం అంటే సరదా. కానీ నిజంగా ఆకలేస్తుందా అన్నది ఆలోచించుకుంటే వాటి అవసరం ఎంతో తెలుస్తుంది. లేదనుకుంటే మీకు గిఫ్ట్ గ్యారంటీ... అదే ఊబకాయం. రెండు. మూడుసార్లు చిరుతిళ్ల విషయంలో నాలుకను నియంత్రించగలిగితే మరోసారి ఆలోచన రాదు. ఆదిలో ఆ అలవాటును అంతం చేసుకుంటే ఎప్పటికీ మీరు స్లిమ్‌గా యాక్టివ్‌గా ఉండొచ్చు. మీతో అందరూ క్లోజ్‌గా ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే వారిలో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయాలో గమనించాలి. మీకు దగ్గరగా ఉండే వారందరూ ఏ సందర్భంలో సన్నిహితులయ్యారో ఒకసారి మననం చేసుకుంటే తెలుస్తుంది.
మీరు చేసేపనికి తల్లిదండ్రులు లేదా బంధుమిత్రులు అడ్డు చెప్పవచ్చు. అలాంటప్పుడు మీరు చేపట్ట్టే పని గురించి క్షుణంగా చెప్పాలి. మీరు మంచి అవగాహనతోనే వారికి అర్థం అయ్యేలా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే మీకు లైన్ క్లియర్, ఇక మీరు ఏ పనైనా... ఛాలెంజ్‌గా ... అవలీలగా చేయొచ్చు. అప్పుడే మీకు మీ వారికి... అందరికీ హ్యాపీ... కష్టే ఫలీ...
-  సుబ్బానాయుడు.
 

మంగళవారం, ఏప్రిల్ 12

నేటి ఫ్యాషన్ ట్రెండ్ ..జీన్స్


ఫ్యాషన్  ట్రెండ్  ..జీన్స్


 


ఒకప్పుడు జీన్స్ వన్ ఆఫ్ ది డ్రెసెస్... కానీ ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ స్టైల్... అదే నేటి యువత ప్యాషన్ స్టేట్‌మెంట్. కొన్ని కాలేజీల్లో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. స్టూడెంట్స్‌కు కొత్తగా డ్రెస్ కోడ్ ఏమైనా విధించారా అని అనుమానం వేస్తుంది.
ఎందుకో తెలుసా...?

ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ జీన్స్ ప్యాంట్స్. అబ్బాయిలే కాదు.. అమ్మాయిల సంగతీ అంతే.. ఇంకో మాటలో చెప్పాలంటే జీన్స్ ధరించే వారిలో అమ్మాయిలే ఎక్కువే. అబ్బాయిలకు ప్యాంట్స్ విషయంలో ప్రత్యామ్నాయాలున్నా, అమ్మాయిలు మాత్రం జీన్స్, కాటన్స్ మాత్రమే ధరిస్తున్నారు. జీన్స్ స్టైలే వేరని అంటున్నారు.

జీన్స్‌లో ఫ్యాషన్, స్టైల్స్‌తోపాటు కంఫర్ట్ కూడా ఉండడంతో వాళ్ళంతా దానికే ఓటేస్తున్నారు. వీళ్ళందరినీ చూశాక మేమెందుకు వేయకూడదంటూ చిన్నపిల్లలు మొదలుకొని అరవై ఏళ్ళ వయసు వాళ్ళ వరకు అందరూ ఇష్టపడి ఇదే కొత్త ఫ్యాషన్‌గా మార్చుకుంటున్నారు.


జీన్స్ రెగ్యులర్ వేర్‌లో ఒక భాగంగా మారిపోయింది. ఒకే రకంగా మూసపోసినట్టు బ్లూ రంగులో మాత్రమే ఉండే జీన్స్‌లో కూడా ఫ్యాషన్ ట్రెండ్స్ నేడు ఎన్నో మార్పులు తెచ్చాయి.
రకరకాల స్టయిల్స్‌లో, మోడల్స్‌లో యువతను ఆకట్టుకునేలా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్‌కి ప్రత్యేక స్థానం ఉందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.


ఫ్యాషన్‌కు తగ్గట్టు ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా తగిన ఫిట్స్ లభించడమే జీన్స్ ప్రత్యేకత. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, వేస్ట్, హిప్స్, ఎట్లా ఉన్నా అందరికీ తగిన ఫిట్స్ లభిస్తున్నాయి. ఈ ఫిట్స్ వారివారి శరీరాకృతికి నప్పేలా కూడా ఉంటున్నాయి. స్టయిల్‌గా ఉండడం ఈ ఫిట్స్‌కు అదనపు ఆకర్షణ. అందుకే జీన్స్ అంటే చిన్న, పెద్ద అందరూ ఇష్టపడతారు. బటన్‌పై, స్ట్రెయిట్ లెగ్, స్లిమ్ ఫిట్, బూట్ కట్, లోబూట్ కట్, రిలాక్స్‌డ్ బూట్ కట్, కంఫర్ట్ ఫిట్, రెగ్యులర్ ఫిట్, రిలాక్స్‌డ్ ఫిట్, అంటూ రకరకాల ఆకృతులలో వస్తున్నాయి.

స్టోన్ వాష్, ఆసిడ్ వాష్, ఐడల్ వాష్, రాబిన్‌సన్ వాష్ పేరిట జీన్స్‌లో వివిధ రకాల వాష్‌లు అందుబాటులో ఉంటున్నాయి. అక్కడక్కడా రంగు వెలసిపోయి రఫ్‌గా కనిపించే ఈ జీన్స్‌లో అదనపు ఆకర్షణగా ఉంటుంది. ఇక ప్యాంటు అక్కడక్కడా దారాలు వేలాడుతూ ఉండడం కూడా ఓ ఫ్యాషన్‌గా మారింది. వీటిని ఛోపర్, డిస్ట్రక్షన్, వర్క్ జీన్స్‌గా పిలుస్తారు.
అమ్మాయిల ఒంటి విరుపులకు అనుగుణంగా లోఫ్లేర్, సూపర్ లోఫ్లేర్, స్ట్రెచ్‌లలో జీన్స్, సూపర్ లోబూట్‌కట్ అంటూ అందమైన డిజైన్లలో అనేక రకాల జీన్స్ అందుబాటులో వచ్చాయి.
జీన్స్ సక్సెస్‌కి అంతాదాని అందుబాటు గుణంలోనే ఉంది. మధ్యతరగతి నుంచి ధనికుల వరకు అందరి స్థోమతకు తగిన ధరల్లో ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. వంద రూపాయలు మొదలుకొని ఐదారువేలకు పైగా జీన్స్ ధర పలుకుతున్నాయి. సాధారణ కంపెనీ జీన్స్, మూడు వందలకే లభ్యమవుతున్నాయి. లీ, రాంగ్లర్, లెవీస్, పెపె, డాకర్స్, డిక్కీస్, ఆక్సంబర్గ్, బఫెల్లో, పాయిజన్, కిల్లర్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ జీన్స్ కూడా ఏడొందల నుండి ప్రారంభమై రెండువేలకు పైబడిన రేంజ్‌లో లభిస్తున్నాయి.

జీన్స్ స్టయిల్‌గా ఉండడంతోపాటు వెచ్చగా అనిపిస్తాయి. మందంగా ఉండే జీన్స్ ప్యాంట్లను ఏ కాలంలో ధరించినా ఇబ్బంది లేదు. వేసవిలో వీటికి చెమటను పీల్చే గుణం ఉంటుంది. చలికాలం జీన్స్‌లో ఉన్నంత సుఖం ఎందులోనూ లేదు.
అందుకే చాలామంది ముఖ్యంగా కుర్రకారు స్వెటర్లు, జర్కిన్‌ల కన్నా జీన్స్ జాకెట్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. వీటితోపాటు జీన్స్ షర్ట్‌లుకూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. డెనిమ్ షర్ట్స్‌గా పిలవబడే జీన్స్ కూడా చలిని దూరంగా ఉంచుతాయి. అందులో ఇవి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

కొన్ని కంపెనీల వాళ్ళు పదహారేళ్ళ వయసు వారి నుంచి 25 ఏళ్ళ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా జీన్స్ ప్యాంట్లు, టాప్‌లు తయారు చేస్తున్నారు. ఎంబ్రాయిడరీ, స్టడెడ్, రిబ్బన్ జీన్స్, ఇలా రకరకాలుగా మంచి అల్లికతో తయారయ్యే జీన్స్ అమ్మాయిలను బాగా ఆకట్టుకుంటున్నాయి. టీనేజ్‌లో ఉన్న అమ్మాయి, అబ్బాయిల కోసం కొన్ని కంపెనీలు అనేక షేడ్స్‌లో బోలెడు మోడల్స్‌లో రూపొందిస్తున్నారు. మరి కొన్ని కంపెనీలు ఏ టు జెడ్ అంటూ రకరకాల డిజైన్లు, పువ్వుల ఎంబ్రాయిడరీలతో, అబ్‌స్ట్రాక్ట్ ప్రింటులతో, శాటిన్ ట్రిమ్మింగ్స్‌తో, బ్లూ, చార్‌కోల్, నలుపు, తెలుపు రంగురంగుల జీన్స్ నేడు మార్కెట్‌లో అన్ని వయసుల వారికి లభిస్తున్నాయి. చిన్నపిల్లల మొదలుకొని అరవై ఏళ్ళ వయసువారి వరకు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందుకే జీన్స్ అంటే నేడు అందరికీ క్రేజ్...
మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్ వేషధారణలో కూడా మార్పులు తెస్తున్నాయి. అందులో భాగమే అమ్మాయిల డ్రస్సింగ్ స్టయిల్లో మార్పులు చోటు చేసుకోవడం.
పంజాబీ సూట్స్ వచ్చి లంగా వోణీల ట్రెండ్‌కు స్వస్తి పలికితే... జీన్స్ ప్యాంట్లు వచ్చి పంజాబీ సూట్స్‌ను పక్కకు నెట్టేసాయి.. నేటి తరం అమ్మాయిల ఫ్యాషన్ స్టేట్‌మెంట్ జీన్స్.


‘‘్ఫర్మల్ ప్యాంట్స్ అరుదుగా ధరిస్తాం. జీన్స్ స్టయిల్‌గా కనిపిస్తాయి. రఫ్ అండ్ టఫ్‌గా ఉంటాయి. ఎట్లా మెయింటెయిన్ చేసినా ఫ్యాషన్‌బుల్‌గానే ఉంటాయి’’ అని ఆనంద్ ఇన్‌స్టిట్యూట్‌లో సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ సునీల్ అంటున్నాడు. ఈ కుర్రాడికి అనేక రంగుల్లో అనేక మోడల్స్ జీన్స్ ఉన్నాయిట. ఎప్పుడూ జీన్స్ వాడుతాడుట. అవే కంఫర్టని చెబుతాడు. ‘‘జీన్స్ స్టయిల్‌గా ఉండటమే కాదు. రేటు అందుబాటులో ఉంటున్నాయి. ఫ్యాషన్‌తో పాటు ఎక్కువ కాలం డ్రెస్ వేసుకోవచ్చు.
ప్యాంటు చిరిగినా, దారాలు వేలాడినా ఫ్యాషనే. ఫ్రెండ్స్‌తో పాటు అమ్మాయిలూ జీన్స్ ధరించిన అబ్బాయిల్ని లైక్ చేస్తార’’ని ఇంజనీరింగ్ చదివి, జావా చేస్తున్న శ్రీకాంత్ అన్నాడు. ‘జీన్స్’ ధరించ డం ఇప్పుడు యువతకు కల్చర్‌గా మారిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పెద్దపెద్ద నగరాల్లోనే కాదు, పట్టణాల్లోనూ చివరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ యువతీ యువకులతో పాటు వయసుపైబడిన వారు కూడా జీన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టు అన్ని ప్రాంతాల్లోనూ, అన్నిరకాల జీన్స్ అందుబాటులోకి వచ్చాయి. కొత్తకొత్త సొబగులు అద్దుకొని మార్కెట్లోకి వస్తున్న లేటెస్ట్ జీన్స్‌ని ఫాస్ట్‌గా ఫాలో అయిపోండి ఇక...
- కంచర్ల