ఆదివారం, మార్చి 27

ఆధునిక పోకడ


అంతా జీరో!

జీరో... జీరో... ఓన్లీ జీరో...
జీరో క్యాలరీలు... జీరో కొలెస్ట్రాల్.. జీరో షుగర్.. జీరో సైజ్.. అంతా శూన్యమే!
అవును మరి... ఓవరాల్ జీరో...!!
              అసలు...

             ‘ ఏమీ లేకపోవడమే’   
                                           నేటి ట్రెండ్!!!

***
అంతా శూన్యం!

ఎవరు చెప్పారోగాని, ఎంత గొప్పతత్వం. పెద్దల మాట చద్దన్నం మూట కదూ!
అలాగని చద్దన్నం గబగబా లాగించేయకూడదు. అందులో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో తెలుసుకోవాలి. అది షుగర్‌ను పెంచుతుందో లేదో తెలుసుకోవాలి. ‘సైజ్ జీరో’ ఫిగర్‌ను ప్రభావితం చేస్తుందో లేదో కనుక్కోవాలి. మారిన పరిస్థితుల దృష్ట్యా ఇంత తతంగముంది మరి.
కాస్త ఫన్నీగా ఉన్నా... మన దేశంలో ‘జీరో సైజ్’కు కరీనా కపూర్‌నే ఆద్యురాలు. ఆమె అలా అయ్యాకే అమ్మాయిల్లో ఆ స్పృహ వచ్చింది.
సైజ్ జీరో.. ఇది స్ర్తిల దుస్తుల సైజుల్లో భాగంగా వచ్చింది. సైజ్ జీరో అంటే 31-23-32 అన్నమాట. నిజానికి అమ్మాయిల్లో బాడీ మాస్ ఇండెక్స్ ఉండాల్సిన దానికంటే బాగా తగ్గిపోయింది.
కారణం ఏదేమైనా- ఈ ‘సైజ్ జీరో’ మన భారతీయ మహిళలకు ఏ మాత్రం నప్పదు. దీన్ని ఫ్యాషన్ రంగ నిపుణులు, వైద్యులూ ధృవీకరిస్తున్నారు. అయినా వినిపించుకునే వాళ్ళేరీ?
మన మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న మూడు ప్రధాన అనారోగ్య సమస్యలు- స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం. అన్ని వయస్సులవారినీ, స్ర్తి పురుషులిద్దరినీ కూడా ఈ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. చిన్న వయసులోనే కోట్లమంది చిన్నారుల్ని ఇవి పట్టి పీడిస్తున్నాయని పరిశీలకులంటున్నారు.
మన దేశంలో స్థూలకాయుల సంఖ్య పది కోట్లు! మధుమేహంతో బాధపడేవారు 15 కోట్లు. 2025 నాటికి వీరి సంఖ్య దేశజనాభాలో 30 శాతానికి చేరుతుందట. దేశంలో 6 నుంచి 15 ఏళ్ళలోపు చిన్నారుల్లో 25 శాతం స్థూలకాయులేనట! ఇవన్నీ తెలుసుకున్న కొన్ని కంపెనీలు ఇలాంటి వాళ్ళకోసం జీరో క్యాలరీ టీ, డ్రింకులు, బబుల్‌గమ్, జీరో ఫ్యాట్, చాక్లెట్లు, బిస్కెట్లు... ఇలా ఎన్నో ఉత్పత్తి చేస్తున్నాయి.
నిజానికి ఇవి ఆరోగ్యానికి మంచివేనా?... వీటిలో క్యాలరీలు ఏమీ ఉండవా?... అంటే నూటికి తొంభై తొమ్మిది సందర్భాల్లో ‘కాదు’ అనే చెప్పాలి.
అదీ సంగతి! ఆహార పదార్థాల్లో ఎంత కొవ్వు ఉండాలనే దానిపై కొన్ని షరతులున్నాయి. వంద గ్రాముల పదార్థంలో 5 గ్రాముల సంతృప్త కొవ్వు తప్పనిసరిగా ఉండాలి. జీరో క్యాలరీవిగా చెప్పే చూయింగ్ గమ్‌లు రెండు ఒకేసారి నమిలితే 5 క్యాలరీల శక్తి వస్తుందట. 300 మిల్లీలీటర్ల గ్రీన్ టీని తాగితే రెండు క్యాలరీలు అందుతాయి.
ఇక షుగర్ ఫ్రీ జెల్లీలు... ఇందులో కూడా పళ్ళ రసాలు, ఫ్రక్టోజ్ లాంటి స్వీటెనర్లు ఉంటాయి. అంటే అందులో కొంత చక్కెర ఉంటుందన్నమాటే!
మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం అనేక ప్రత్యామ్నాయ తీపి పదార్థాలు వస్తున్నాయి. అయితే వీటిల్లోనూ ఎంతో కొంత గ్లూకోజ్ ఉండకపోదు. పైగా వీటిల్లోని ఆస్పర్టేమ్ వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
ఇవన్ని తెలుసుకుంటుంటే... ‘‘నేతి బీర కాయ’’ సామెత గుర్తుకు రావట్లేదూ!
ఇక కొలెస్ట్రాల్... శరీరంలోని కణాలు సక్రమంగా పనిచేయడంలో ఉపకరించే పదార్థం. అంతాకాదు ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల తయారీలోనూ కీలకపాత్ర వహిస్తుంది. అయితే ‘‘అతి సర్వత్ర వర్జయేత్’’ అన్నట్లు ఎక్కువయితే కొలెస్ట్రాల్ కూడా మంచిది కాదు. మనం కొలెస్ట్రాల్ ఉన్న ఆహార పదార్థాలు తినకపోవయినప్పటికీ మన శరీరం నిత్యం కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. అందువల్ల కొలెస్ట్రాల్‌ను పెంచే పదార్థాలు తగ్గిస్తే చాలు.
ఇంతేనా... జీరో ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, జీరో కార్బన్ హౌసెస్, జీరో బ్యాలెన్స్ అకౌంట్లు, జీరో పర్సంట్ వడ్డీలు... ఇవన్నీ మన నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో వింటున్నవే. సున్నాకి విలువలేదని ఎవరనగలరు.. ఇవన్నీ తెలిశాక.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి