కని ‘కుట్టు’ అందాలు - ఎంబ్రాయడరీ
ఏమీలేని విషయాన్నిగురించి ఎవర్నయనా అడిగితే...
ఏముందీ! ‘సూదిలో దారం’ అంటుంటారు చాలామంది.
కానీ మేలురకం పట్టువస్తమ్రయినా సూదీ దారానికి లోకువే. దాని కుట్టుబడికి కట్టుబడి ఉండాల్సిందే.
ఆ సూదీదారాలే ఫ్యాషన్ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయ్.
అదెలా అంటారా?
చకీల చమక్కులు. అద్దాల వెలుగులు. రాళ్ళ మెరుపులు.
దారాల అందాలు. పూసల రంగులు. వెరసి సూదీ దారంతో కుట్టే
సృజనాత్మక భారతీయ ఎంబ్రాయిడరీ -ఖండ ఖండాంతర ఖ్యాతినార్జిస్తోంది.
అంతర్జాతీయంగా ఆకట్టుకుంటోంది.
పెళ్లి, పండుగ, వేడుక ఏదైనా కానివ్వండి. వర్క్ శారీ లేదా సల్వార్‌లతో కళకళలాడాల్సిందే.
అలాగని -ఎంబ్రాయిడరీ కేవలం మహిళలకే కాదు.
షేర్వాణీ, కుర్తా, లాల్జీ పైజమా -మగవారి డ్రెస్సులయినా కుట్టు అందాలుండాల్సిందే.
పిల్లలకయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
అపుడే పుట్టిన పాపాయిని ఉయ్యాల్లో వేయాలన్నా ఎంబ్రాయిడరీ చేసిన పట్టులంగా కావాలి.
అరవయ్యేళ్ళ బామ్మ ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా పుల్కారీ లేదా
కాశ్మీరీ వర్క్ చేసిన పట్టు లేదా
ఫ్యాన్సీ చీర కట్టాల్సిందే.

పెళ్ళికి వచ్చేవాళ్లను వదిలేస్తే,
పీటల మీద కూర్చునే పెళ్లికూతురుకయినా,
పెళ్ళి కుమారుడికయినా ఎంబ్రాయిడరీ వర్కు వస్త్రాలు ధరించాల్సిందే.
రిసెప్షన్‌కయితే ఈ ఫ్యాషన్ తప్పనిసరైంది. తరమేదయినా అందరికీ ఒకే తరహా ఫ్యాషన్.
అదే -ఎంబ్రాయిడరీ.
కుట్టు అందాలు దక్షిణాదిలో సైతం
వర్క్ వస్త్రాలు తళతళలాడటం విశేషం. అసలెందుకీ క్రేజ్...
అంతగా ఆకట్టుకునేదేముంది ఇందులో? అని ప్రశ్నిస్తే
ఒక్కటే సమాధానం - అందం.

అవును. అందమే ఉంది. మనిషిలోని సృజనాత్మకతనీ
అందంగా కనిపించాలనే కోరికలనీ ప్రతిబింబించేదే ఎంబ్రాయిడరీ.
బట్ట కట్టడం నేర్చిననాడే మనిషిలోని కళా హృదయమూ ఉప్పొంగింది.
కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలో, ఆటవిక తెగల వస్తధ్రారణగానీ వాళ్ళు వేసుకునే
ఆభరణాలనిగానీ పరిశీలిస్తే అన్నీ అల్లికలే.
నారలు, పూసలు, గవ్వలు. ప్రకృతిలో దొరికిన వాటినన్నింటినీ
అందంగా కనిపించేలా అల్లుకుని ధరించేవాళ్ళు.

ఆ అల్లికల్లోంచి పుట్టుకొచ్చిందే ఎంబ్రాయిడరీ.
ఆదినుంచీ మనిషి కళాపోషకుడేనన్నది తెలిసిందే.
చారిత్రక ఆధారాల ప్రకారం క్రీ.పూ.3 వేల సంవత్సరాల నుంచీ
ఎంబ్రాయిడరీ వాడుకలో ఉంది.
అచ్చం పెయింట్ చేసినట్లుగా కుట్టే ఓ ప్రత్యేక పద్ధతిలో కుట్టుపనిలో
ప్రయోగాలు చేసి ప్రపంచ దేశాల్లో భారత్ సైతం ఫ్యాషన్‌కు వేదికగా మారింది.
అందులో సహజ రంగుల అద్దకం మాత్రం ప్రత్యేకంగా మనకే సొంతమైంది.
ప్రపంచ ఎంబ్రాయిడరీలో మన దేశానికీ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
పైగా భిన్న ప్రాంతాల్ని ఆయా ప్రాంతాల సంస్కృతుల్నీ మన ఎంబ్రాయిడరీ చక్కగా ప్రతిబింబిస్తోంది.
ఏ ప్రాంతానికి చెందిన ఎంబ్రాయిడరీ అయినా అన్నింటిలోనూ ఉండేది
ఆయా ప్రాంతాల్లో తిరుగాడే జంతువులు, పక్షులు, అక్కడ విరిసే కుసుమాలు.
ఆయా ప్రాంతాల సంప్రదాయ నిత్య జీవన రీతులు.
రంగులూ, దారాలు, డిజైన్లూ అన్నీ అక్కడికక్కడే ప్రత్యేకం.
కాలక్రమంలో మెషీన్లు రావడంతో ఎంబ్రాయిడరీ వేగం పెరిగింది.
మధ్యలో కొంతకాలం హ్యాండ్ ఎంబ్రాయిడరీ నుంచి అంతా మెషీన్ వైపు మళ్లినా దేని క్రేజ్ దానిదే.
రెడీమేడ్స్‌కి మెషీన్ ఎంబ్రాయిడరీ చక్కగా ఫిక్సయిపోయింది.
తక్కువ సమయంలో ఎక్కువ డిజైన్లనీ, దుస్తుల్నీ రూపొందించగలిగే సౌలభ్యం ఇందులోనే ఉంది.
ఫ్యాబ్రిక్‌నుబట్టి ఎంబ్రాయిడరీ డిజైన్ ఏదైనా రంగు దారాల్ని కలబోసి కుడితే అది అందంగానే ఉంటుంది.
అయితే కొన్ని కుట్లు కొన్ని రకాల వస్త్రాలమీదే మరింత మెరుస్తూ పనితనంలోనే గొప్పతనాన్ని చాటుతాయి.
ఈ ఎంబ్రాయిడరీ నాటినుంచి నేటివరకు ఎవర్‌గ్రీన్ ఫ్యాషన్.
నిజానికి ఈ ఫ్యాషన్ స్వాతంత్య్రం రాకమునుపే నారీమణుల ఒంటిమీద తళుక్కుమన్నదే.
నాటి ఫ్యాషన్ నేటి సెలబ్రిటీలతో పాటు
సామాన్యుల్ని సైతం సందడి చేస్తోంది.
ఎంబ్రాయిడరీ కేవలం దుస్తులకే పరిమితమా?...
కానే కాదు. బెడ్‌షీట్లు, కర్టెన్లు, నాప్‌కిన్లు, టేబుల్ క్లాత్, కుర్చీలు,
సోఫా సెట్లు, ఫ్రిజ్, టీవీ క్లాత్‌వంటి ఫర్నీచర్ ఫ్యాబ్రిక్‌తోపాటు
సంచులు, బ్యాగులు, ఆభరణాలు ఇలా రకరకాల యాక్సెసరీలు కూడా
ఎంబ్రాయిడరీ సొగసుల్ని అద్దుకుంటున్నాయి.
దినదిన ప్రవర్థమానమయ్యే ఈ పరిశ్రమలోని నిపుణులు కొందరు
ఎంబ్రాయిడరీకి కొత్తదనం ఆపాదించే ప్రయత్నంలో వున్నారు. త్రీడీ ఎఫెక్ట్సు, అక్షరాలు రాయడం, బొమ్మలు గీయడం వంటి వాటిలో సాప్ట్‌వేర్ టెక్నిక్స్‌ను జోడించేందుకు కృషి చేస్తున్నారు.
సో... మున్ముందు
సూదీ దారం ఇంకెన్ని అందాల్ని సృష్టించనుందో!?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి