సోమవారం, మార్చి 28

తల్లి బిడ్డల బంధం

  



 ఇరువురికి మధురిమే


అమ్మ తన బిడ్డకు ఏం చేస్తుంది. ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు
సమాధానం ఎక్కడనుంచి మొదలుపెట్టి ఎక్కడ అంతం చేయాలో తెలియని స్థితి ఏర్పడుతుంది. 
ఒక వ్యక్తి పుట్టి, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా పెరగటంలో ‘అమ్మ’ పాత్ర ఎంతో ఉంటుంది. 
దీనిని ఎవరూ విడమరిచి మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు. 
వైద్య పరిశోధనా నిపుణులూ అదేమాట అంటున్నారు.

అలాగే తల్లి కావటంవల్ల స్ర్తిలు పొందే ఆరోగ్య ప్రయోజనాలూ చాలా ఉన్నాయి. 
దీనిని బట్టి ‘‘మాతృత్వం’’ అనేది తల్లీ బిడ్డలు ఇరువురికీ మధురిమే అని చెప్పాలి.

పిల్లల మనస్తత్వం వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలమీద, 
పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది.
అయితే ఇక్కడ పెరిగిన వాతావరణం అనే అంశంలో ఒక ముఖ్యమైన విషయాన్ని 
జతచేయాలంటున్నది ‘సైన్స్’.
‘పెరిగిన వాతావరణం’ అనే మాటను తల్లి సృష్టించిన వాతావరణంగా 
మార్చాలని శాస్తజ్ఞ్రులు అంటున్నారు. మొదటి మూడు సంవత్సరాలు పిల్లల పెరుగుదలలో
చాలా ముఖ్యమైన దశ అని, ఆ సమయంలో వారిపై తల్లి ప్రభావం మరింతగా ఉంటుందని పరిశోధకుల అభిప్రాయం. పిల్లల్లో స్పర్శ, చూడటం, వినటం మొదలైన కార్యకలాపాల ద్వారా తెలివితేటలు పెరుగుతాయి.
వారు తల్లిదండ్రులను అనుసరిస్తూ మాట్లాడటం నేర్చుకుంటారు. వారు చేయాలనుకుంటున్నవి ఎదురుగా కనిపిస్తుంటే మరింత త్వరగా నేర్చుకుంటారు.
చిన్నపిల్లలు... వారికేం తెలుసు... అనుకుంటాం కానీ,
వారి మెదడు ఎప్పుడూ తమకు తెలిసిన వారితో అనుసంధానం అయివుంటుందని, 
గమనింపు ఎక్కువ ఉంటుందని మరీ ముఖ్యంగా తల్లిమీద పూర్తి ధ్యాసని పెట్టి ఉంటారని అందుకే
తల్లి ప్రభావం పిల్లలకు సంక్రమిస్తుందని పరిశోధకులు తేల్చి చెప్పారు.
పిల్లలు తల్లి నుంచి పొందే ప్రయోజనలను పక్కనుంచితే మాతృత్వం కారణంగా
తల్లి పొందే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. తల్లి అయిన మహిళ 
తన వృద్ధాప్యంలో మతిమరుపుకి సంబంధించిన అల్జీమర్స్, డిమోన్షియా 
వ్యాధులకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే తల్లికావటంవల్ల ఉత్పత్తి అయ్యే
కొన్ని హార్మోన్లు ఆమెను ఆ వ్యాధులకు గురికాకుండా రక్షణ ఇస్తాయి.


చిన్న వయసులో తల్లి అయిన స్ర్తిలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.
మొదటిసారి తల్లి అయ్యే వయసుకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలకు సంబంధం ఉంది.
గర్భిణీ సమయంలో విడుదల అయ్యే హార్మోన్లు ట్యూమర్‌ని అణచివేసే ప్రొటీన్ల మీద ప్రభావం చూపుతుంది

.
చిన్నవయసులో అంటే శారీరక పెరుగుదల, మార్పులు ఇంకా పూర్తికాని తరుణంలో
తల్లికావటంవల్ల ఈ ప్రభావం జీవితాంతం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. 
తమ ఇరవై ఏళ్ళ వయసులో తల్లి అయిన మహిళలకు ఇది ఎక్కువగా వర్తిస్తుంది. ఏదిఏమైనా...
తల్లి కావటం ఆమెకే కాదు... పిల్లలకూ.. ఇంటిల్లిపాదికీ మధురిమే.

-కంచర్ల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి