గురువారం, మార్చి 31

‘అబ్సెషన్’

అనావసరపు ఆలోచనలు వద్దు.




మనిషికి ఎప్పుడూ ఏవో ఆలోచనలు వస్తూనే వుంటాయి. 
ఏదో ఒక అంశం గురించి మనం ఆలోచిస్తూనే వుంటాము. అయితే ఎప్పుడూ ఒకే అంశంపై దృష్టిని కేంద్రీకరించి ఆ ఆలోచనలతోనే, ఆ కోరికలతోనో కాలం గడపటం అంత మంచి పద్ధతి కాదు. అటువంటి లక్షణాలు కలిగినవారు చాలామంది ఉంటారు. నిత్యం ఆలోచనలతోనే పొద్దుపుచ్చడం లాంటి లక్షణాన్ని ఆంగ్లంలో ‘అబ్సెషన్’ అంటారు. అబ్సెషన్లలో కూడా అనేక రకాలున్నాయి. కొందరికి పరిశుభ్రత పిచ్చి. మరికొందరికి సోకుపిచ్చి. పరిశుభ్రత, ఆరోగ్యం, వస్తధ్రారణ.. ఇలా ఏదో ఒక అంశంమీద చాలామంది పిచ్చి వ్యామోహంతో ఎక్కువ దృష్టి పెడుతుంటారు.
ఈ శ్రద్ధ, ఆసక్తి మితిమీరకుండా వున్నంతవరకు ఫరవాలేదు. అవధులు దాటి అనుక్షణం వాటి గురించే ఆలోచిస్తూ, ఆ భ్రాంతిలోనే పొద్దుపుచ్చుతుంటే మనసులో చీకాకు ఏర్పడుతుంది.
ఆహారం గురించి, వయసు గురించి, నిద్ర అలవాట్లగురించి, వృత్తి- ఉద్యోగం జీవితం గురించి, వ్యాపారం గురించి, ప్రమోషన్ల గురించి, పై చదువుల గురించి, పై అధికారులు, సహోద్యోగులు.. ఇలా ఎదుటివారి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ చింతిస్తూ కాలం గడిపేస్తుంటారు. అవే సర్వస్వం అనుకుంటూ, ఇరవై నాలుగు గంటలు అదే భ్రమతో మానసికంగా వేదనకు గురౌతుంటారు.
ఈ అబ్సెషన్లకు దూరంగా వుండకపోతే అసాధారణమైన అలవాట్లు కూడా వచ్చి మనపై పడతాయి. అబ్సెషన్ల ఫలితంగా జీవితం సాఫీగా సాగకపోగా మనశ్శాంతి, సుఖ సంతోషాలు కరవవుతాయి. తమకి తెలియకుండానే జీవితానికి, వ్యక్తిత్వానికి సంబంధించి అనేక అంశాలను అలక్ష్యం చేయడం జరుగుతుంది. ఫలితంగా మానసిక ప్రశాంతత, ఆనందం దూరం కాకమానదు.
ఇలాంటి ‘అబ్సెషన్’ ఉచ్చు లో ఇరుక్కొనడానికి కచ్చితమైన కారణం ఏమిటో ఇంతవరకు రుజువుకాలేదు. అయితే కొంతమంది మానసిక భ్రాంతులకు కొన్ని కారణాలను గుర్తించి నివారణకోపాయాలు సూచించారు.
సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, సాంఘిక సేవ, నటన, నాట్యం, పుస్తక పఠనం, వ్యాయామం, ఆటలు వంటి వాటి పట్ల అత్యంత ఆసక్తి కనబరచడంవల్ల మానసిక ఉల్లాసం, విజ్ఞానం పొందవచ్చు. మనలోని ప్రతిభ కూడా బయటకు వస్తుంది.
ఏది ఏమైనా- ప్రతి నిమిషం ఒకే యావ ఉండే వ్యక్తి, దాని ప్రతికూల ప్రభావాలనుంచి తప్పించుకోవాలంటే మనసును ఇతర అంశాల మీదకు మళ్లించడం సరైన వైద్యం.
ఏదో వ్యాపకం పెట్టుకోవడం, శారీరక శ్రమ చేయడం, విహార యాత్రలకు వెళ్లిరావడం, పత్రికలు - పుస్తకాలు చదవడం, రచనలు చేయడం వంటి వాటి ద్వారా మనసును పక్కకు మళ్లించి ‘అబ్సెషన్ల’ నుంచి దూరం కావాలి. క్రమంతప్పక ఇలాంటి నివారణోపాయాలను పాటించడంవల్ల ఆలోచనలను నియంత్రణలో వుంచుకోగలిగి, అనవసర భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండగలుగుతారు.
లేదంటే అబ్సెషన్లవల్ల ఎన్నో నష్టాలకు గురికావాల్సి వస్తోంది. ప్రతి నిమిషానికీ ఆందోళన, చింత పెరిగిపోతాయి. నిద్రపట్టకపోవడం, గాభరాగా వుండడం, రక్తపోటు ఎక్కువ కావడం జరుగుతాయి. మానసిక ఒత్తిడివల్ల తలెత్తే తలపోటు, అజీర్తి, ఆర్థరైటిస్, ఎలర్జీలవంటి అనారోగ్యాలూ కలుగుతాయి. ఈ అబ్సెషన్ తారాస్థాయికి చేరుకుంటే మానసిక బలహీనతకు దారితీసి పిచ్చివాళ్లుగా మారవచ్చు.
అలాగే మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకం, ధూమపానం వంటివాటికి దగ్గరై లేదా మితిమీరి మానసిక రుగ్మతలకు, అర్థంపర్థంలేని ‘అబ్సెషన్ల’కు గురికావాల్సి వస్తోంది. 
కాబట్టి ప్రతి వ్యక్తి ఈ అబ్సెషన్లకు దూరంగా ఉండాలి. అబ్సెషన్ తీవ్రమైపోతే మానసిక వైద్య నిపుణుల నుంచి
వైద్య సహాయాన్ని తీసుకోవడం తప్పనిసరి.
అబ్సెషన్లవల్ల మనోవ్యాకులత పెరిగి, అనర్థాలు సంభవిస్తాయని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. 
మన పురోగతికి అది ఓ పెద్ద ప్రతిబంధకమని గ్రహించాలి. సాధ్యమైనంతవరకు ఏవేవో భ్రాంతులలో పడి కొట్టుకుపోకుండా ముందుగా జాగ్రత్తపడాలి. ఒకవేళ పొరపాటున ‘అబ్సెషన్’ బారిన పడినా వీలైనంత త్వరగా బయట పడడానికి ఆత్మీయులు, బంధు మిత్రుల మధ్య గడపడం, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం ‘అబ్సెషన్ల’ నివారణోపాయాలను పాటించడం చేయాల్సిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి