ఆదివారం, మార్చి 27

ఒత్తిడులు ఎన్నయనా... విరుగుడొక్కటే!

‘‘ఏంటి! వీడింకా నిద్ర లేవలేదా... పనిమనిషి అంతులేదు... ఓవైపు టైం అయిపోతోంది. ఆదివారం కాస్తా పాదరసంలా చేతుల్లోంచి జారిపోయింది. ఈయన కూడా ఇంతే... టైం ఆరు గంటలయినా కుంభకర్ణుడిలా ఇంకా గుర్రునిద్ర.
ఇవాళ అసలే బోలెడు పనులు. ఒక్క పని కూడా కాలేదు... ఇలాంటి అవధాన ప్రకియ ప్రతి ఇంట్లోనూ ప్రొద్దునే్న కనిపించే సాధారణ దృశ్యం. తల్లిగా, భార్యగా, వంటమనిషి, పనిమనిషి, డ్రైవరు... ఇలా అన్ని పాత్రల్ని సమర్థంగా పోషిస్తూ ఇటు ఇల్లూ... అటు ఆఫీసు చక్కబెట్టుకొస్తున్న మహిళ చాకచక్యానికి నిజంగా జోహార్లు.
అయితే, ఈక్రమంలో ఎన్నో ఒత్తిడులు... మానసిక ఆందోళనలు. భర్తకు చేదోడు వాదోడుగా ఉద్యోగమో, వ్యాపారమో, ఆఫీసులో ఏదోక పనో వెతుక్కుని సంసార సాగరాన్ని ఈదుకొస్తున్నారు. తలకు మించిన పనులతో చాలామంది మహిళలు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నో అనారోగ్యలకు, చికాకులకు గురౌతున్నారు. ఇలాంటప్పుడే వీరికి సరైన సలహా అవసరం.
ఏవైనా సమస్యలు వచ్చినపుడు, చికాకు కలిగినపుడు ధైర్యం చెప్పే స్నేహితులు, కుటుంబంలో తలెత్తిన మానసిక సమస్యలకు బెదిరిపోకుండా తోడుగా నిలిచే ఆత్మీయులు, కుటుంబ సభ్యులుంటే చాలు. ఇంకేమి అక్కరలేదు. పిల్లల చికాకులు, కుటుంబ సమస్యలు, భర్తతో అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్థల తాలూకు సెగ ఏదీ కూడా తమను తాకదన్నది ఎందరో మహిళల మనోగతం. మంచి సహచరులు, శ్రేయోభిలాషులుంటే కొండంత అండగా అనిపిస్తుందన్నది అంగీకరించాల్సిందే.
ఎంత పనిభారమున్నా మోయగల్గిన మహిళలు ఇంట్లో పోరును మాత్రం భరాయించలేరు. దీంతో సతమతమవుతారు. ఇంట్లో పెద్దవాళ్ళుంటే పిల్లలను నిశ్చితంగా వదిలేసి బయట క్యాంపులకైనా వెళ్ళవచ్చు అనుకునే వారికి కొన్ని సందర్భాల్లో చిక్కులు తప్పదు. వాళ్ళ ఆరోగ్య సమస్యలతోపాటు, ఉచిత సలహాలతో తలనొప్పి వచ్చిపడే ప్రమాదం. అందుకే బాగా సహకరించగలిగిన కుటుంబ సభ్యులు, భర్త ఉంటే చాలు. ఎన్ని ఒత్తిడులునైనా ఎదుర్కోగలరు. అలా కాకుండా ఇంటి పోరు ఇంతింతగాదయా... అన్న చందంగా ఉంటే నిత్యం ఆ మహిళకు చికాకులే, చెప్పుకోలేని వ్యధలే. పరిస్థితులను అవగాహన చేసుకొని తదనుగుణంగా భర్త, ఇంట్లో పెద్దలు నడుచుకుంటే ఇలాంటి ఇబ్బందులుండవు.
కొంతమంది మహిళలు ఎన్ని ఒత్తిడులు చుట్టుముడుతున్నా తొణకరు. అన్నిటినీ సమన్వయపరచుకుంటూ ముందుకెళ్లగలుగుతారు. కానీ, కొందరుంటారు... తాను పట్టిన కుందేటికి మూడేకాళ్ళనేవారు. అంటే... ప్రతి పనీ తాము అను కున్నట్లుగానే జరగాలనుకునేవారు. అలాంటివారికి ఇబ్బందులు తప్పవు.
అందుకే ప్రతిదానికీ పరిమితులుంటాయి. వాటిని బట్టిపోతుంటే ఎలాంటి చికాకులు, ఒత్తిడులనైనా అవలీలగా అధిగమించవచ్చు.
ఇకపోతే, ఎవరేది అడిగినా వెనుకాముందాలోచించకుండా సరేననడం.. తర్వాత ఆ పని చేయలేక నానా తంటాలు పడటం సమర్థనీయం కాదు.
ఎందుకంటే గొప్పలకుపోయి ఇబ్బందుల్లో పడటం కంటే (అంత్య నిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు) ముందే చాకచక్యంగా తప్పించుకోవడం ఉత్తమం. చేయగలిగిందయితే పర్వాలేదు. తలకు మించిన భారం పెట్టుకోవద్దు.
సాధ్యమైనంతవరకు ఎక్కడి విషయాలను అక్కడే మరచిపోవాలి. బయట విషయాలు ఇంటికి, ఇంటి విషయాలు బయటకు పోనీయకూడదు. అలాగే ఇంట్లో చికాకులు, ఇబ్బందులూ ఉన్నా అవి మీరు చేసే పనిమీద ప్రభావితం చూపేలా ఉండకూడదు. మనోనిబ్బరం ఉంటే ఏ సమస్యా మనల్నేవీ ఏమీ చేయవు. మీరు చేసే పనిని నిశ్చితంగా, ఏకాగ్రతకు ఎలాంటి భంగం కలగకుండా చేయండి. ఎప్పుడు చేయాల్సిన పనులను అప్పుడే ఎక్కడ చేయాల్సిన పనులను అక్కడే చేసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తవు. మానసికంగా, శారీరకంగా మీపైబడిన ఒత్తిడులను తగ్గించుకోవచ్చు.
వృత్తి మూలంగా, ఇంటి సమస్యల కారణంగా తలెత్తే ఒత్తిడిని తట్టుకోవాలంటే మనం ఆసక్తిగా చేసే కొన్ని హాబీలే చక్కటి పరిష్కారాలు. వీటివల్ల కూడా ఒత్తిడిని తేలిగ్గా అధిగమించవచ్చు.
ఈ విషయాలను చాలామంది గమనించకుండా ‘‘ఇంకా ఇలాంటి హంగులకు సమయమెక్కడా...’’ అంటూ నిరాశగా దీర్ఘాలు తీస్తుంటారు.
పుస్తక పఠనం, వ్యాయామం, సంగీతం, కుట్టు, అల్లికలు, చెట్లు పెంచడం, పిల్లలతో అంత్యాక్షరి, క్విజ్‌లు, వినోదాలతో కూడిన ఎలాంటి మంచి అలవాట్లయినా, హాబీ ఏదైనా సరే మన మనస్సుకు ఎంతో ఉల్లాసం కలిగిస్తుంది. అంతేకాదు మానసిక, శారీరక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మనసుకు ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది.
తల్లిగా, భార్యగా, భర్తకు చేదోడు వాదోడుగా మీ బాధ్యతలను చక్కబెట్టడానికి హాబీలు కూడా దగ్గరయితే మీ సామర్థ్యాన్ని.. స్థైర్యాన్ని ఎంతో పెంచుతాయి. ఒత్తిడులను అధిగమించి జీవితాన్ని ప్రశాంతంగా గడపగలుగుతారు. ఇందువల్ల ఇంటిల్లిపాది ఆనందడోలికల్లో తేలిఆడుతారు.
-కంచర్ల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి