ఆదివారం, మార్చి 27

ప్రణాళిక అవసరం

ఆర్థిక ప్రణాళిక అవసరం

ఫ్యామిలీ బడ్జెట్

ఒకప్పుడు జేబునిండా చిల్లర డబ్బులు వేసుకునిపోతే సంచినిండా నిత్యావసర వస్తువులు వచ్చేవి. నేడు అది రివర్స్ అయ్యింది. అయినా సరిపడా వస్తువులు రావడంలేదు. నిత్యావసర ధరలు నింగిని తాకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక ప్రణాళికే లేకుంటే కుటుంబ బడ్జెట్ అస్తవ్యస్తం కాగలదు. తమకొచ్చే ఆదాయాన్ని జాగ్రత్తగా, పారదర్శకతతో నిర్వహించుకోవడం ఉత్తమం.
ఈ రోజుల్లో చాలామంది తమ వాస్తవిక ఆదాయంపైన మాత్రమే ఆధారపడి జీవనాన్ని సాగించడంలేదు. నేటి క్రెడిట్ కల్చర్‌వల్ల ఖర్చులు ఆదాయాన్ని మించిపోతున్నాయి. ఈ సంస్కృతి లేనప్పుడు చేతిలో డబ్బు వుంటేనే ఆర్థిక అవసరాన్ని తీర్చుకునేవారు. ఇప్పుడు చేతిలో పచ్చ కాగితం వుండాల్సిన పనిలేదు. ప్లాస్టిక్ కార్డు వుంటే చాలు. కనబడ్డ వస్తువు ఇంటికొచ్చేస్తుంది. ఆనక జేబుకు చిల్లుపడుతుంది. ఇలా కాకుండా ఓ పద్ధతి ప్రకారం బడ్జెట్‌ను రూపొందించుకొని కొంచెం అటూ ఇటూగానైనా దాని ప్రకారం నడుచుకుంటే ఎటువంటి ఆర్థిక ఒత్తిడులూ వేధించవు. వారి జీవితం మూడు పూలు ఆరు కాయలుగా సజావుగా సాగిపోతుంది.
ముందు మనం ఖర్చులపై నిఘా వేయాలి. అన్నింటికి లెక్కలు కట్టి స్వయం నియంత్రణ విధించుకోవాలి. ఆదాయ లెక్కల్లో స్థిర చర ఆస్తులు రెండింటినీ కూడా కలుపుకోవాలి. ఖర్చును మించి ఆదాయం వున్నట్లైతే, దాన్ని అనవసర ఖర్చుల కోసం వినియోగించుకోకుండా పొదుపు ఖాతాలో జమ చేయాలి. ఆదాయం ఖర్చుల కోసం చాలడం లేదనుకున్నపుడు ప్రత్యామ్నాయ మార్గాల్ని అనే్వషించాల్సిందే.
క్రెడిట్ కార్డులు దేన్నయినా కొనాలన్న ఆతృతను ఎంతగా కలిగిస్తాయో అదే సమయంలో సమస్యనూ అంతే సృష్టిస్తాయి. అవసరం వున్నా, లేకపోయినా షాపింగ్‌ను చేయాలన్న కోరికను కలిగిస్తాయి. అందుకే ఎప్పుడో తప్పదు అనుకున్నపుడు మాత్రమే కార్డుల్ని ఉపయోగించుకోవాలి. కార్డు బదులుగా క్యాష్‌నే చెల్లించే అలవాటు ఉత్తమం. జరుగుతున్న కార్డుల మోసాలను దృష్టిలో పెట్టుకొని కూడా వాటిని జాగ్రత్తగా వినియోగించుకోక తప్పదు. కుటుంబ బడ్జెట్- అవసరాలు, విలువలు, ప్రాధాన్యాలకు అనువుగా, అనుకూలంగా వుండాలి. వ్యక్తిగత లక్ష్యాల్ని పూరించేదిగా ఉండాలి. ఉన్నంతలో సంతృప్తికరంగా మలుచుకోవాలే తప్ప లేనిదాని గురించి ఆలోచించకూడదు. అసంతృప్తిని పెంచుకోకూడదు. ‘‘ఆదాయానే్న అనుసరించి ఖర్చులు’’ అన్న తరతరాల నానుడిని ఎవరికివారు అప్లయ్ చేసుకోవాలి.
ఏ రకం బడ్జెట్‌లోనైనా తగు మాత్రం పొదుపు వుండే విధంగా శ్రద్ధ వహించి, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే, అత్యవసర సమయాల్లో ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. ఆర్థిక ఇబ్బందులవలన కుటుంబంలో కలిగే చిరాకు పరాకులు, చీకు చింతకు దూరం కాగలరు.
ఉన్నది ఉన్నట్లు ఖర్చు పెట్టేసే ధోరణిని విడనాడి, కొంత మొత్తాన్ని పొదుపుచేసే సూత్రాన్ని నేర్చుకోవాలి. లక్ష్యం ఏదైనా తగుమాత్రంగా, ఇబ్బందిపెట్టకుండా వాస్తవిక దృక్పథంతో వుండాలి. పెద్ద పెద్ద ప్రణాళికలతో పనిలేదు. నిర్ణయిచుకున్న లక్ష్యాన్ని స్పష్టంగా అనుసరించగలిగేలా అందుబాటులో వుంచుకోవాలి.
ముందే పెద్ద మొత్తంలో దాచుకోవాలనే అత్యాస ఉండకూడదు. కొద్దికొద్దిగా పదులు, వందల్లో మొదలుపెట్టినా చాలు. అవి క్రమంగా పెరిగి ఏడాదికో, ఐదేళ్ళకో పెద్ద మొత్తంగా చూపగలవు. ఆ తర్వాత లక్ష్యాన్ని చేరుకోగలవు.
ఈ ప్రక్రియవల్ల సమస్యల్లోంచి కూడా గట్టెక్కగలవు. ఏ రకం ఒత్తిడి, ఆందోళన కలగవు. జీవితంలో అనుకోని అవాంతరాలకు సంబంధించి ఒక ధైర్యం, నమ్మకం కూడా కలుగుతుంది.
అవకాశాలను బట్టి ఎవరైనా, ఎప్పుడైనా ఆదాయాన్ని పెంచుకునే మార్గాల కోసమో లేదా ఖర్చులను తగ్గించుకునే పద్ధతుల కోసమో అనే్వషించాలి తప్ప సరితూగని ఆదాయ వ్యయాల లెక్కల నడుమ సతమతం కాకూడదు. పెరిగే ఖర్చులు, నిలకడగా వున్న ఆదాయం నిరంతరం ఒత్తిడిని పెంచుతాయని గుర్తెరిగి ఆ ప్రకారం ప్రతి ఖర్చునూ బేరీజు వేసుకుంటూ నడుచుకోవాలి. బడ్జెట్‌లో హెచ్చుతగ్గులు, ఖచ్చితంగా పాటించలేకపోవడం సహజమే. అయితే, బడ్జెట్ వేసుకోవడం తప్పనిసరి. అనుకోని ఖర్చులు వచ్చిపడినా దిగులుపడాల్సిన అవసరం లేదు.
ఓ ప్రణాళిక, పద్ధతి ప్రకారం, వాటిని అనుసరించడానికి ప్రయత్నలోపం లేకుండా వుంటే చాలు. సగం విజయం సాధించినట్లే. ఆదాయ వ్యయాల నడుమ సమతౌల్య ప్రయత్నమే ఆర్థిక ప్రణాళిక అన్న సంగతిని గుర్తుంచుకుంటే ర్థిక ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి