ఆదివారం, మార్చి 27

సంసారంలో సరిగమలు


సర్దు‘బాట’ తప్పదు!

దాంపత్యం అంటే... భార్యాభర్తల అన్యోన్యత! ‘దర్పణం’ అంటే... అద్దం! అద్దంలో మన ప్రతిబింబం ఏ రీతిలో కనబడుతుందో, మనని మనం స్పష్టంగా ఎలా చూడగలమో, ఎలా చూస్తామో అలాగే దాంపత్య దర్పణంలో ఇతరులు అంత స్పష్టంగానూ భార్యా భర్తల జీవితాలను, నడవడికను, వారి అన్యోన్యతను లేదా వారి కయ్యాలను, ప్రవర్తనలను అంత స్పష్టంగా చూడగలుగుతారు. అందరూ చూసేదీ చూడగలిగేదీ, కనిపిస్తున్న భార్యాభర్తల జీవితాల్నే.
ఇది దాచినా ఎవరికీ చెప్పకూడనిదీ చెప్పరానిదీ, చెప్పలేనిదీ, చెప్పము, చూపించము అనుకున్నా-
భార్యాభర్తల అన్యోన్యతలూ, తగువులూ ఎదుటివారికీ చుట్టూ ఉన్నవారికి తప్పనిసరిగా టీవీ సీరియల్‌లా, సినిమా రీలులా కనిపిస్తూనే వుంటాయి.
దర్పణంలో మనని మనమే కాక ఇతరులనూ ఎలా చూస్తామో, ఎలా చూడగలుగుతామో, అలాగే బాహ్య దర్పణం నుండి ఇతరులూ మనల్ని గమనిస్తూనే ఉంటారు. అందుకని ‘దాంపత్యం’ అనేది మనకు కాక చూపరులకీ ఆనందంగా, ఆదర్శంగా, ఆహ్లాదంగా అగుపించాలనే కానీ విందుగా, వినోదంగా, వింతగా, వెక్కిరించేలా అగుపించకూడదు.
మా వీధిలో ఓ కుటుంబం ఉంది. ఏడేళ్లుగా మా యింటి ఎదురుగానే ఓ అద్దె ఇంటిలో ఉంటున్నారు. వారికి పిల్లలు కూడా లేరు. అయితే వారి అన్యోన్యతను చూడనూ లేదు. మేం గమనిస్తూనే ఉన్నాం. ఏళ్లు గడిచినా ఇంకా వారి మధ్య ఐక్యత, అవగాహన, పరస్పర సహకారం ఏవీ ఉన్నట్లుగా కనిపించవు.
ఎప్పుడూ ఏదో విషయంలో అరుచుకోవడం, పోట్లాడుకోవడం ఆనక ఒకరిమీద ఒకరు పడీ, ఆడా మగా ‘మొగుడూ - పెళ్లాం’ అనే తేడాలు ఏవీ చూపించుకోక సమ ఉజ్జీల్లా ఘర్షణ పడుతుంటారు. ఆఖరికి వారు రోడ్డున పడుతుంటారు. పాపం, వాళ్ళింట్లో ఉన్న అక్క పిల్లలు బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఏడుస్తూ దడుసుకుంటూ వణికిపోతూ, ఓ మూలగా నక్కి నక్కి చూస్తూ నిలబడుతుంటారు. వాళ్ల అన్నా వదినల పిల్లలున్నారన్న విషయాన్ని పట్టించుకోరు. రోడ్డునపడ్డ వాళ్ళ గలాటాను చూసి జనం గుమిగూడి వారిని విడదీసి నచ్చచెప్తూ తగవులు తీర్చపోతే-
అటు చెప్తే ఇటు కోపం ఇటు చెప్తే అటు కోపంతో ‘‘చాల్చాల్చేవమ్మా, వెళ్లు, వెళ్లు మా భార్యాభర్తల గొడవల మధ్య మీరెందుకు? వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. ఏం, మీ ఇళ్ళలో మీకు మాత్రం భార్యాభర్తల మధ్య స్పర్థలు రావా? ఏం... ఏం’’ అంటూ తిట్టిపోస్తూ- వాళ్ళిద్దరూ కల్సి, ఇవతలివారినే ఫూల్స్‌ని చేసి మరీ లోపలికి వెళ్లిపోతుంటారు. ఇది అందరికీ నిత్యభాగోతంలా అనిపిస్తూంటుంది. విసుగూ, అసహ్యం పుట్టిస్తుంది.
కలగజేసుకోకపోతే, ఎక్కడ ఆవేశాలతో పొడుచుకు చచ్చిపోతారు అనే భయం! కలగచేసుకుంటే ఫూల్స్‌మై వెనక్కి తిరిగి రావాలి తిట్లు చీవాట్లు, శాపనార్థాలూ తిని మరీ!
ఇదా.. ఇదా? దాంపత్యం అంటే? వినడానికి, చెప్పుకోవడానికీ, ఎంత అసహ్యంగా వుంటుంది. ఇది బాహ్య దర్పణంలోంచి అందరూ చూస్తూ విందు వినోదం గొల్పించే దాంపత్యం కాదా! ఇలాంటి దాంపత్యాలను చూసి ఎవరు హర్షిస్తారు? ఎవరు ఆనందిస్తారు?
మరి అందరికీ ఆదర్శం అనిపించగలిగే ‘దాంపత్యం’ అంటే ఎలా ఉండాలో మీరే ఆలోచించండి! ఆదర్శ దంపతులను చూసి నేర్చుకోండి! ‘దాంపత్యం’లో సర్దుబాటు తప్పనిసరి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి