ఆదివారం, మార్చి 27

వ్యక్తిత్వమే

గెలిచేది.. నిలిచేది వ్యక్తిత్వమే

అందం అయస్కాంతం లాంటిది. అందుకే నాటితరం నుంచి నేటితరం వరకూ అందరూ -అందానికి దాసులే. అందాల పోటీలు జరుగుతున్నాయంటే ప్రతిఒక్కరూ టీవీలకు అతుక్కుపోతారు. అంటే -దేశమంతటా సౌందర్య స్పృహ పెరిగింది. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ అందాన్ని ఆపాదించుకోడానికి తాపత్రయపడుతున్నారు. అందానికి ఉన్న ఆకర్షణ అలాంటిది. అయితే -శారీరక సౌందర్యం కాలంతోపాటు కరిగిపోతుంది. వ్యక్తిత్వ సౌందర్యమే కలకాలం నిలిచి ఉంటుంది.
ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్, దియామీర్జా, గద్దె సింధూర వీళ్లంతా భారతదేశపు అందాల రాణులు. సౌందర్యం వీరికి విశ్వఖ్యాతి అందించింది. అందం పట్ల మోజు పెరుగుతోన్న నేపథ్యంలో నగరాలు, పట్టణాలకే కాదు పల్లెలకూ బ్యూటీపార్లర్లు విస్తరించాయి. దేశంలో సౌందర్య సాధనాల అమ్మకాలు కోట్లకు పడగలెత్తుతున్నాయి. అందానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈనాటిది కాదు. కావ్యాలు, ప్రబంధాల్లోనూ అందాల వర్ణనలు కోకొల్లలు. కాళిదాసులాంటి కవులు తమ కథానాయకుల అందచందాల గురించి చేసిన వర్ణనలు ఈనాటికీ అద్భుతమే. కాలమేదైనా అందం అయస్కాంతం లాంటిది!
ఆకర్షణ శక్తిని పెంచుకోడానికి ఆసక్తి చూడపంలో తప్పులేదు. అయితే వ్యాపార ప్రకటనలను నమ్మి పెంచుకునే కృత్రిమ అందంతో ఎంతవరకూ సఫలీకృతులం అవుతాం అన్నదే ప్రశ్న.
సహజ సౌందర్యానికి మెరుగులు దిద్దడం మరచి, కృత్రిమ అందాలకు తాపత్రయపడటం ఎండమావుల వెంట పరుగెత్తడం లాంటిదే. సహజమైన జీవన శైలి, తగినంత వ్యాయామం, మంచి ఆహారం ద్వారా పొందే ఆరోగ్యం మన అందాన్ని, ఆకర్షణనూ పంపొందిస్తుంది. అంతేతప్ప కృత్రిమ సౌందర్యం కలకాలం నిలవదు.
అందం ఆకర్షిస్తుంది. ఆకర్షణ సమాజానికి ఆధారం. ఆకర్షణతోనే మనుషుల మధ్య సంబంధాలు ఏర్పడతాయి. పరస్పర ఆకర్షణ ద్వారా మాత్రమే వ్యక్తులు సమాజంలో సభ్యులుగా రాణించగలుగుతారు. ఎక్కువ కాలం జీవించగలుగుతారు.
అయితే, దీనికి శారీరక ఆకర్షణ ఒక్కటే సరిపోదు. గుణగణాలు, వ్యక్తిత్వం లాంటి మానసిక ఆకర్షణలు అవసరం. ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యానికి, భౌతిక, మానసిక అంశాలు రెండూ ముఖ్యమే. అయితే, ఇందులో శారీరక ఆకర్షణ తొలిమెట్టు మాత్రమే. అది వయసుతో పాటు కరిగిపోతుంది. సాన్నిహిత్యం పెరిగేకొద్దీ మానవ సంబంధాల్లో వ్యక్తిత్వ అంశాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది వయసుతోపాటు పెరుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వాములు సైతం ఒకరినొకరు వ్యక్తిత్వ లక్షణాలతోనే ఎక్కువ ఆకర్షణకు గురవుతారు. యువతీ యువకులు ఎక్కువగా శారీరక ఆకర్షణకు గురికావచ్చు కానీ, ఆ ఆకర్షణలోనూ వ్యక్తిత్వ లక్షణాలు, బుద్ధి, తెలివి తేటల ప్రాధాన్యతా ఉంటుంది.
కాబట్టి పదిగురినీ ఆకట్టుకోవడానికి బ్యూటీపార్లర్ల చుట్టూ అదే పనిగా తిరగాల్సిన అవసరం లేదు. అంతకంటే ముదు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.
ఎదుటివారి ముందు ఎలాంటి దాపరికం లేకుండా మనం మన వ్యక్తిత్వ లక్షణాలను ప్రదర్శించాలి. అయిస్కాంతంలాంటి చిర్నవ్వుతో ఎదుటివారిని ఆకర్షించాలి. అందంగా ఉండటమంటే డిజైనింగ్ దుస్తులు వాడమని కాదు, ఉన్నవాటిని శుభ్రంగా వాడుకుంటే చాలని. ఎదుటివారికి అందంగా కనిపిస్తారు. కూర్చున్నా, నిల్చున్నా మనకంటూ ఒక స్టయిల్ ఉండాలి. మాట్లాడే వ్యక్తి కళ్లలోకి సూటిగా చూడటం అలవాటు చేసుకోవాలి. కళ్లతోనే ఆకర్షణ పెంచుకోవాలి. ఆత్మ విశ్వాసం కలిగించే స్నేహాన్ని నలుగురికీ పంచాలి. ఎదుటివారు చెప్పేదాన్ని పూర్తిగా విని, తర్వాత మనోభావాలను వ్యక్తీకరించాలి. ఒకరితో మాట్లాడుతున్నపుడు మరొకరిని పొగడకూడదు లేదా నిందించకూడదు. మాటల్లో వ్యక్తంకాని విషయాలను తెలిపే బాడీ లాంగ్వేజ్‌ని గమనించాలి. చిన్న, పెద్ద తేడాలు లేకుండా అందరిపట్లా గౌరవ మర్యాదలు ప్రదర్శించాలి. క్రమశిక్షణ అలవర్చుకోవాలి.
మృదుభాషణతో ఎదుటివారి స్పందనను అంచనా వేయాలి. ఎదుటివారి స్పందనకు అనుగుణంగా మన మనసులోని భావాలను వెల్లడించాలి. అవతలివారు మనతో మాట్లాడటం ఓ ఆనందకరమైన విషయంగా పరిగణించేలా నడచుకోవాలి. వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉన్నంతలో శుభ్రంగా, పోషక విలువలతో మంచి ఆహారం తీసుకుంటూ రోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉంటే చాలు. ఆనందంతోపాటు అందమూ మీ సొంతమవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి