బుధవారం, మార్చి 30

వెండి వెన్నెల


వన్నె తెచ్చే  వెండి   వెన్నెల
 


వెండి మాట వినగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చేది పడుచుల అందాల పాదాలపై మెరిసే పట్టీలే. 
లేత తమలపాకుల్లాంటి అమ్మాయిల అందెల రవళిని బట్టి వారి మనసును అర్థం చేసుకోవచ్చు.
పసితనం నుంచి పెళ్ళయ్యేవరకు పట్టీలుగా, తర్వాత వాటితో పాటు మెట్టెలుగా వెండిని ధరించడం సర్వసాధారణం. సంప్రదాయం కూడా. వెండి ఆభరణాలు ధరించడం, రకరకాల డిజైన్లు తయారీలోనూ భారత్ అగ్రగామి. బంగారం, వెండితో చేసే మీనాకారి ఆభరణాలకు ఆంధ్ర నాట చెప్పలేనంత డిమాండ్. వెండి, బంగారాలను సరిపోల్చవలసి వస్తే... పసిడి ఖరీదైనది, తక్కువగా లభించేది.
బంగారం, ప్లాటినం, ఇర్రీడియం, పెల్లాడియం వంటి విలువైన లోహాల్లో అధికంగా లభ్యమయ్యేది వెండి మాత్రమే. ధరలో ఆదరణలో వెండిది ఎప్పుడూ పుత్తడి తరువాతి స్థానం. అయితే, బంగారానికి లేని ఎన్నో విశేష గుణాలు వెండికి ఉన్నాయి కనుకే ఆంధ్రుల ఆదరణ పొందింది.
అందం, గట్టితనం, కాంతికి స్పందించే గుణం, తేలికగా వివిధ ఆకృతుల్లోకి మారే తీరు వెండికి మాత్రమే ప్రత్యేకం. ఇతర దేశాల్లో కూడా వెండిని రకరకాలు ఉపయోగిస్తున్నారు. మీకో విషయం తెలుసా?... మనం నేడు విరివిగా ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్లు, టీవీలు, మైక్రోవేవ్ ఓవెన్‌లు, టెలిఫోన్‌లు, వాషింగ్ మెషీన్లు, కంప్యూటర్లు... అన్నింటిలోనూ వెండిని వినియోగిస్తున్నారు. ఇంకా ఫొటోగ్రఫీ, వైద్యం, ఫార్మసీ, ఎలక్ట్రికల్.. తదితర రంగాల్లోనూ ఇది ఉంది.
పారిశ్రామికంగా కూడా వెండికి మంచి గిరాకీ ఉంది. చాలామంది వెండిని లాకెట్ రూపంలో మెడలో వేసుకుంటారు. చిన్నపిల్లలపై దుష్టశక్తుల కన్ను పడకుండా ఉండేందుకు నడుముకో, కాలికో, మెడలోనో వెండి ఆభరణాలను ధరిస్తారు. బంగారంలో హాల్ మార్క్‌లాగే వెండి ప్రామాణికతకు గుర్తు స్టెర్లింగ్ సిల్వర్. ఇందులో 92 శాతం వెండి వుంటే మిగిలింది రాగిలాంటి ఇతర లోహమే. స్వచ్ఛమైన వెండి, స్టెర్లింగ్ సిల్వర్‌తో ఆభరణాలు చేయవచ్చు. అయితే మిశ్రమ లోహమైన స్టెర్లింగ్ సిల్వర్‌తో నాజూకైన ఆభరణాలే కాక విగ్రహాలు, టేబుల్‌వేర్, ఫర్నీచర్... తదితర వస్తువులుగా రూపొందించవచ్చు. సంపన్నులకయితే వెండి ఉపయోగం మరింత ఎక్కువ. సంపన్నుల ఇళ్ళలో నాలుగు వైపులా కుర్చీలు వేసిన డైనింగ్ టేబుల్ భోజన గదిలో కనిపిస్తుంది. మధ్యలో ఉన్న అద్దంతో సమానంగా మెరిసే సిల్వర్ డ్రస్సింగ్ మిర్రర్ సోఫా.. లాంటి అందాలతో వెండి పలకరిస్తుంది.
ఇక పూజా మందిరం మొత్తంగా వెండికాంతులతో మెరిసిపోతుంది. వెంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి.. ఇలా రకరకాల విగ్రహాల నుంచి దీపాలు, పళ్లాలు, పీటలు, పూల సజ్జెలు, కంకుమ బరిణెలు.. అన్నీ వెండివే. బిందెలు, గ్లాసులు, చెంచాలు, స్పూన్లు.. అందానిచ్చే ఇంటి అలంకారాలెన్నో. ఇంటి నిండా వెండివెనె్నలే. వెండిని ఎక్కువగా చూడటంవల్ల పాజిటివ్ శక్తి ప్రసరించి మనసుకు ప్రశాంతత చేకూరుతుందని, ఆరోగ్యకరమని పరిశీలకులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో వెండికి మరింత క్రేజ్ పెరిగింది. వెండి కానుకలు లేందే పెళ్ళిళ్ళు జరగడంలేదు. వెండితో చేసిన పూజా సామగ్రి, డిన్నర్ సెట్లు కానుకలుగా మారాయి. అత్తారింటికి వెళ్ళే కూతురికి మురిపెంగా వెండి ఆభరణాలు, వస్తువులు అందిస్తేగానీ తృప్తిపడని ఆడపడుచులు, తల్లిదండ్రులు ఎందరో?!
అయితే, వెండిని ఇంటికి తెచ్చుకోవడమే కాదు, వాటి జిలుగులు తరగకుండా పదికాలాలు
వెలుగులు చిందించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
బూడిద లేదా ముగ్గుతో రుద్దితే వెండి వస్తువులు నిగనిగలాడతాయి. 
రోజూ వాడని వెండి వస్తువులను మఖమల్ లేదా పట్టు వస్త్రంతో చుట్టి గాలి చొరని డబ్బాల్లో భద్రపరచాలి.
ఎలాంటి కవర్ లేకుండా చెక్క డబ్బాల్లో వెండి వస్తువులను పెట్టనే కూడదు.
వెండి పాత్రలను వాడిన వెంటనే కడగాలి. కుంకుడు కాయ రసం లేదా సబ్బు నీటిలో కొద్దిసేపు నానపెట్టి బేబి బ్రష్‌తో శుభ్రపరచాలి. తర్వాత మెత్తటి కాటన్ బట్టతో తుడవాలి. ఎక్కువ డిజైన్ ఉన్న ఆభరణాలకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది.
స్టీలు పాత్రలను, వెండి గిన్నెలను  నలనూ రెండూ ఒకేచోట పెట్టకూడదు. 
దీనివల్ల వస్తువులు దెబ్బతింటాయి. రంగు మారతాయి. మార్కెట్లలో లభిస్తున్న
‘సిల్వర్ డిష్’, ‘సిల్వర్ పాలిష్’ తదితర సొల్యూషన్ ఉపయోగించి వెండి వస్తువులకు మరింత వన్నె
తీసుకురావచ్చు. రసాయనిక చర్యల కారంగా ఉప్పు, కోడిగుడ్డు వంటివి తగిలితే వెండిగినె్నలు వెంటనే నల్లబడతాయి. విలువైన వెండి ఆభరణాలు, పెద్ద పెద్ద వస్తువులను ఏడాదికోసారి వెండి షాపుల్లో పాలిషింగ్‌కి ఇస్తే ఎప్పటికీ వాటి వనె్నలు తగ్గవు. వెండి విలువలు తరగవు.
కాబట్టే... ‘‘వెండి’’ మన జీవన విధానంలో మమేకమైపోయింది.
ఇది కాదనలేని వాస్తవం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి