ఆదివారం, మార్చి 27

స్వాతంత్య్ర ఫలాలు..

దరిచేరని స్వాతంత్య్ర ఫలాలు..

-కంచర్ల

స్వాతంత్య్రం అంటే- జన్మసిద్ధ అధికారమని జనం జపించిన మంత్రం. శృంఖలాబద్దమైన హస్తాల్ని బలంగా పైకి లేపి, దిక్కులు పిక్కటిల్లేలా మోగిన రణాన్నినాదం.
అయితే- అరవై మూడేళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఎన్నో ప్రశ్నల్ని మిగిల్చింది. సామాన్యుడు ఆశించే కనీస అవసరాల్ని ఏ మేరకు సమకూర్చామో ఆత్మవిమర్శ చేసుకోమంది. స్వరాజ్యానికి అసలైన అర్థాన్ని వివరిస్తూ, స్వావలంబనానికి సరైన నిర్వచనాన్ని అందించింది.
ఇప్పుడు స్వాతంత్య్రం అంటే- ఆలోచనల అగడ్తల్ని అధిగమించడం, ఆచరణాత్మక పథంలో పురోగమించడం... అట్టడుగు వ్యక్తికి కూడు, గూడు, గుడ్డల్ని అందించడం కోసం నిర్మాణాత్మక కృషిచెయ్యాలని, నిజాయితీగా సంకల్పం చెప్పుకోవడం... జనం కలల గురించి జాతీయ జెండా సాక్షిగా కార్యోన్ముఖతను సంతరించుకోవడం...
పగ్గాలు ఒక చేతినుంచి మరోచేతికి మారడమే స్వాతంత్య్రమనుకొనే దశ అంతరించిపోయింది. ఇలా అనడం- ప్రజలకొరకు, ప్రజల చేత, ప్రజలవలన ఎన్నికయిన ప్రభుత్వ వ్యవస్థను చిన్నచూపు చూడటం కాదు. ఒక దేశ ప్రజలు తమ సాంస్కృతిక మూలాల్ని పరిరక్షించుకొంటూ, అభివృద్ధి పథంలోకి ప్రయాణించడానికి స్వపరిపాలన అవసరం ఎంతయినా ఉంది. ఆటవిక స్థితిలో ఏకాకిగా సంచరించిన మనిషి, సామూహిక జీవనంలోని ప్రయోజనాల్ని గుర్తించాడు. కలిసి జీవించడం అనివార్యమనీ గ్రహించాడు. మనుషులు గణాలుగా ఏర్పడ్డారు. నాయకులూ పుట్టుకొచ్చారు. సామూహిక జీవితాన్నీ, సంఘ జీవనాన్నీ ప్రభావితం చేసే వ్యవస్థలు అనేకం రూపుదిద్దుకున్నాయి. తెరమీద ఒకదానివెంట ఒకటి చకచకా కదిలే సన్నివేశాల్లా చారిత్రక యవనిక మీద శతాబ్దాల వ్యవధిలో అవి తమ ఉనికిని ప్రదర్శించి, కాలం చెల్లగానే తెరమరుగయ్యాయి. వాటన్నింటిలోనూ అత్యుత్తమమైన ప్రజాస్వామ్యం సుస్థిర స్థానాన్ని సంపాదించుకొంది. స్వేచ్ఛ, సమానత్వం తలెత్తుకుని ధైర్యంగా జీవించే అవకాశం, నమ్మిన మార్గంలో నడిచే సౌలభ్యం, వివక్షకు తావులేని సాంఘిక న్యాయం వీటన్నిటితో పాటు ప్రతి వ్యక్తీ ప్రాధమికంగా కోరుకునే కనీస వసతులు పరికల్పనలాంటి లక్షణాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలని, కలకాలం నిలచే మూలస్తంభాల్లాంటివని అనేకులు అభివర్ణిస్తారు.
ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం ప్రవచిత లక్ష్యాన్ని సాధించే అత్యుత్తమ మార్గమే తప్ప అంతిమ ధ్యేయం కాదన్న సంగతి స్పష్టమవుతోంది. మహత్తర కాంక్షతో నిర్దేశిత గమ్యాలకు చేర్చగలదని విశ్వసించిన మార్గం వక్రగతులు పడితేనో, వ్యతిరేక దిశలో ఉపమిస్తేనో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అనేక రాజకీయ వ్యవస్థల ఉత్థాన పతనాల ద్వారా ప్రపంచం గ్రహించింది. సరైన గమ్యాన్ని చేర్చే గమనం తాలూకు ప్రాముఖ్యాన్ని గుర్తించింది.
అరవై మూడేళ్ళ క్రిందట స్వాతంత్య్రాన్ని సంపాదించినపుడు మన దేశానికి సరిపడే రాజకీయ, పాలన వ్యవస్థల్ని మనం నిర్మించుకొన్నాం. దీన్ని తులనాత్మకంగా విశే్లషిస్తే, అత్యంత ప్రాథమిక లక్ష్యమైన సగటు మనిషి తాలూకు కనీస అవసరాల్ని నెరవేర్చడంలో మనం సాధించిన ప్రగతి ప్రశ్నార్థకంగానే మిగిలిపోతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి