మంగళవారం, మార్చి 29

యువతరం వెర్రికేక

ఫ్యాషన్ ఓషన్


  

ఫ్యాషన్ నేటి యువతరం జీవితంలో ఒక భాగం. 
ఫ్యాషన్ లేకపోతే, యువత మనుగడ ఎలా ఉంటుందో ఊహించలేం.
దినచర్య ఫ్యాషన్‌తోనే ప్రారంభమవుతోందంటే ఫ్యాషన్ స్థానం ఎలాంటిదో ఊహించుకోవచ్చు. 
ఫ్యాషన్ నేటి ప్రపంచాన్ని ఒక కోణంలో శాసిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
కాలంతోపాటు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఫ్యాషన్స్ మారడం సహజమే.
అయినా, వాటిని అనుకరించడమే జీవితంగా మార్చుకోకూడదు.
చిన్నతనంలో నిబంధనలనుంచి స్వేచ్ఛా జీవితంలోకి..
తిరిగిరాని, మరవలేని టీనేజీలోకి అడుగుపెట్టే యువతరం తమ జీవితంలో ఏదో ఆస్వాదించాలని 
ఫ్యాషన్ వైపు పరుగులు తీస్తున్నారు. నేడు కానె్వంట్‌కు వెళ్ళే పిల్లలు కూడా స్టైల్‌గా వుండాలని తహతహలాడుతున్నారు. ఇలాంటి బాల్య జీవితాన్ని వదిలి కాలేజీ జీవితంలోకి అడుగుపెట్టే యువతరం
జీవితంలో ఫ్యాషన్ ఒక భాగంగా మారిపోయింది. ఫ్యాషన్లకు ప్రతిపాదనలుగా
మన కాలేజీ పరిసరాలను పేర్కొనవచ్చు.

అందరిలో భిన్నంగా వుండాలని కొందరనుకుంటే, 
మరికొంతమంది రొటీన్లకు భిన్నంగా వుండటమేనని అంటున్నారు. 
ఏ రకంగానైనా ఒక కొత్తదనాన్ని అందిస్తూ రొటీన్‌కు భిన్నంగా వుంటే చాలు అని అనుకరిస్తున్నారు. 
ఫ్యాషన్లను రెండు రకాలుగా అభివర్ణించవచ్చు. పాశ్చాత్య ప్రభావానికి గురయ్యే ఫ్యాషన్లు 
ఒక రకం కాగా మరొకటి స్వదేశీ సంప్రదాయాలను అనుకరించేవి.
నేడు ఫ్యాషన్లో మెళకువలు నేర్పించేందుకు కళాశాలలు కూడా 
ప్రత్యేకంగా కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.

ఫ్యాషన్ పారిస్‌లో పుట్టిందని భావిస్తున్న ఈ పదం 
నేడు ప్రపంచంలో అందరికీ కడు ప్రీతిపాత్రమైంది. 
మారుతోన్న అవసరమే అయినా అదే జీవితంగా కాకూడదు. 
కానీ నేడు అలా జరగడం లేదు.
ఫ్యాషన్ లేనిదే నిద్ర కూడా పట్టని స్థితికి నేటి యువత చేరుకుంది. 
కాలానికి తగ్గట్టుగా హుందాతనాన్ని జోడించే ఫ్యాషన్లు కూడా మార్కెట్లోకి మరిన్ని ప్రవేశించాయి. 
ఒక ఉత్పత్తిని అమ్మడం కోసం ప్రకటనలలో వైవిధ్యం చూపుతుండడంతో
ఫ్యాషన్లు మరీ విపరీతంగా పెరిగిపోయాయి. క్షణక్షణానికి ఫ్యాషన్లు 
అన్ని అంచుల్లోనూ మారిపోతున్నాయి.


ఫ్యాషన్‌గా వుండడం తప్పులేదు కానీ, 
అదే పనిగా కాలాన్ని వృధా చేసుకుంటూ దాని గురించే ఆలోచించడం చాలా తప్పు. 
కొంతమందికి వృత్తిరీత్యా ఫ్యాషన్‌గా వుండడం తప్పనిసరి.
మోడల్స్, సినీతారలు ఫ్యాషన్‌గా వుండకపోతే వెనకబడిపోతారన్నది వాళ్ళ అభిప్రాయం.
ఆ రంగం కూడా అటువంటిదే.
అయితే మనం మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో వుంది.
పెడదారి పట్టించే పాశ్చాత్య సంస్కృతిని 
మనం అనుకరిస్తే ఎలా?

మోడల్స్, తారలతో పాటు 
ఇప్పుడు మామూలు వాళ్ళు కూడా కొత్త ఫ్యాషన్లను 
ముందుగా తామే అనుకరించాలని మరీ తపన పడిపోవడం, 
అందరూ తమనే గుర్తించాలని విచిత్రంగా ప్రవర్తించడం విడ్డూరం.
అవసరానికి మించి ఎవరు అనుకరించినా అది ఎబ్బెట్టుగానే వుంటుంది.
 సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి స్థాయిని మించి ప్రవర్తించినట్టుగా 
సమాజంలో హేళన భావన కూడా ఏర్పడుతోంది. ఫ్యాషన్‌గా వుండాలని
అందరూ అనుకుంటే అది ఎంతమందికి సాధ్యపడుతోంది.

‘‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్న’ చందంగా 
పాశ్చాత్య ఫ్యాషన్లకు లోనై మన సంస్కృతిని మంటకలపడం ఎందుకు?
కొత్త కొత్త ఫ్యాషన్లను అనుకరించడం డబ్బు ఖర్చు చేయడం కాక యువత పెడదారి పట్టే
అవకాశాలు ఏర్పడ్డాయి. గతంలో ఈ ఫ్యాషన్లను ధనిక వర్గాలే ఎక్కువగా అనుకరించేవి. 
అయితే ఈమధ్య సాదా సీదా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత కూడా అనుకరిస్తోంది.
ఇటీవలకాలంలో వీరితో పాటు పెద్దవాళ్ళు కూడా పాశ్చాత్య సంస్కృతిని అవలంభిస్తున్నారు. 
ఈ ఫ్యాషన్లు ఎలా ఉండాలనేది మనం శాసించాలేగానీ, మనల్ని ఫ్యాషన్లు ఆడించే స్థితికి చేరుకోకూడదు.
-కంచర్ల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి