ఆదివారం, మార్చి 27

పసుపు.

ముత్యమంతా పసుపు..

ముతైదువుకు పసుపుతోబాటు కుంకుమ కూడా ఎంతో పవిత్రమైనది. లక్ష్మీప్రదము. శుభకారకం. తులసికోటను పసుపు, కుంకుమలతో అలంకరించి, అచట ముగ్గులు పెట్టి, దీపారాధన చేసి తులసిమాతను అర్చిస్తే ధనధాన్యాలు, శాంతి సుఖాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నాస్తికవాదులు తులసిలోని ఆయుర్వేద ఔషధ గుణాలు ఎన్నో వున్నాయని అంగీకరిస్తారు. ఎన్నో రకాల వైద్య చికిత్సలు తులసితో చేయించవచ్చు. ఇక పసుపు విషయానికొస్తే అది స్ర్తిలకు ప్రకృతి ప్రసాదించిన సౌందర్య సాధనం. పసుపును ఆహార పదార్థాలలో వాడుతున్నారు. ఎన్నో వ్యాధులకు మందుగా ఉపయోగిస్తున్నారు. పసుపునీరును వారానికి ఒకసారి తాగడంవలన ఒంట్లోని వేడిని, రక్తాన్ని శుద్ధిచేస్తుంది. వర్షాకాలంలో పాదాలు నాని ఒరుసుకొని పోయి దురదలు, పుళ్ళు, చర్మవ్యాధులు వస్తాయి. పసుపు రెండు పాదాలమీద రాసుకుంటే యాంటీసెప్టిక్‌గా పనిచేసి క్రిమి సంహారిణిగా వుండి పాదాలు పరిశుభ్రంగా, అందంగా వుంటాయి. పసుపులో ఆముదం కలిపి శరీరానికి పూసుకొని పది నిమిషాలు తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేస్తే శరీరం మీద మచ్చలు, పొక్కులు చర్మదోషాలు పోతాయి. వచ్చే వ్యాధులు పోయి ప్రివెంటివ్‌గా పనిచేస్తుంది. కొంతమంది శరీరంపై దద్దుర్లు, చీము పొక్కులు, మచ్చలు ఏర్పడి దురదతో బాధపడుతుంటే పసుపు, వేపాకుని నూరి ఒంటిమీద రోజుకునాలుగుసార్లు రాసుకుంటే సుగుణం త్వరలో కనిపిస్తుంది. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయడానికి అరగంట ముందుగా పసుపు, సానమీద అరగదీసిన గంధం ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతోబాటు ఒంటికి సువాసన, ఆరోగ్యం, శరీర లావణ్యం, మెత్తదనం (మృదుత్వం) కలుగుతాయి. పసుపుకొమ్ము అరగదీసి తలకు పట్టించి అరగంట తర్వాత చన్నీటితో స్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. వస్తుగుణ దీపిక పరిశీలిస్తే పసుపు వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చదివితే మీకే తెలుస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి