సోమవారం, మార్చి 28

అమ్మ కాబోతున్నారా?

 అమ్మకాబోయే ముందు ఆరోగ్యం జాగ్రత్త

 
ఒక బిడ్డకు జన్మనివ్వటమంటే స్ర్తికి మరో జనే్మ..
వైద్యరంగం ఎంత అభివృద్ధి చెందినా ఈ మాటకున్న పదును తగ్గలేదు.
స్ర్తి జీవితంలో అంత ప్రాధాన్యత కల్గిన ఈ సందర్భానికి కూడా ఆరోగ్య రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవటంలో అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న పద్ధతినే అవలంభిస్తారు. డెలివరీ అయ్యే సమయం దగ్గరపడేకొద్దీ అలాంటి జాగ్రత్తలపై ఎక్కువ దృష్టిని పెడతారు. టెన్షన్ పడుతూ ఉంటారు. అంతకుముందున్న ఆరోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయడం వలన అవి గర్భం దాల్చినపుడు బాధించవచ్చు. అందుకే తల్లి కావాలని తలచినప్పటినుండే ఆరోగ్యానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలను పాటిస్తే ఆరోగ్యంతో పాటు పండంటి బిడ్డను కనవచ్చు.


తల్లి కావాలనుకునే ముందు భాగస్వామితో కలిసి
అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించాలి.
ఆహార అలవాట్లు, మీకున్న సమస్యల గురించి ఏమాత్రం దాచకుండా చెప్పాలి.
మూడు నెలల ముందునుంచే భార్యాభర్తలిద్దరూ పోషక ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాదు క్రమపద్ధతిలో ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.
ఇద్దరిలో ఎవరూ పొగత్రాగడం, మద్యం సేవించటం, డ్రగ్స్ వాడటం వంటివి చేయకూడదు.
 మీకు ఎలాంటి విటమిన్లు అవసరమో డాక్టర్‌ను అడిగి తెలుసుకుని పుష్కలంగా లభించే
వాటిని ఆహారంగా తీసుకోవాలి. అలాగే వివిధ రకాల విటమిన్లను అందించే మందులను వేసుకోవాలి.
 

మీరు నివాసముండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
గర్భం నిర్థారించాక ఎండకు వేడిగా మారిన పంపునీటి జోలికి అసలు పోవద్దు.
రకరకాల పెయింట్‌లనుండి వచ్చే వాసనలకు దూరంగా ఉండాలి.
సాధ్యమైనంత వరకు కెఫిన్ తీసుకోవడం ఆపేస్తే మంచిది. ఒత్తిడికి దూరంగా ఉండాలి.
మంచి పుస్తకాలను చదవటం ద్వారా ఒత్తిడి నుంచి బయట పడొచ్చు.
అలాగే అధిక ఉష్ణోగ్రతకు దూరంగా ఉండాలి. మరీ వేడి నీళ్ళతో ఎక్కువ సమయంతో స్నానం చేయడం మంచిదికాదు.


గర్భం దాల్చిన మొదటి 30 రోజుల్లో బాగా వేడిగా ఉన్న నీళ్ళ టబ్‌లో
ఎక్కువసేపు కూర్చుని స్నానం చేయడం వలన పిండానికి హాని కలిగి,
నరాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.



ఆహారం విషయానికి వస్తే- బాగా ఉడకని మాంసాహారం తినకూడదు.
అలాగే పరిశుభ్రంగా కడగని పండ్లు, ఆకు కూరలు, ఇతరత్రా ఆహార పదార్థాలను సేవించడం మంచిదికాదు.
ఇవి పుట్టే శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
అసలు గర్భవతి కావాలని తలచినప్పటినుండే వ్యాయామం అవసరం.
వ్యాయామాన్ని అలవాటు చేస్తే అది మీ ఆరోగ్యానికి, తరవాత
పుట్టబోయే బిడ్డకు ఎంతో ఉపకరిస్తుంది.



ఇవన్నీ ఒక ఎత్తయితే, మంచి రూపురేఖలతో
అందంగా, ఆకర్షణీయంగా ఆరోగ్యవంతంగా పసికందును ఆహ్వానించడానికి
అవసరమైన అనువుగా ఇంటి వాతావరణం ఉండాలి.
అలాగే తల్లి కాబోయే మీ మనస్సు ఎప్పుడూ ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండాలి.
ఇతర సమస్యల్ని దరిదాపుల్లోకి రానీయకుండా చురుకుగా
చలాకీగా తిరుగుతూ ఆరోగ్యవంతంగా పండంటి బిడ్డను ఆహ్వానించండి!

-కంచర్ల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి