గురువారం, మార్చి 31

ఇ - షాపింగ్ డేంజర్స్!

డిస్కౌంట్  డేంజర్స్!



గ్లోబల్ ప్రపంచంలో షాపింగ్ చేయడానికి ఆడా, మగా అన్న తేడా లేదు.
సంపాదన పెరగడం, ప్లాస్టిక్ మనీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో -
వినియోగదారుల వస్తు కొనుగోలు సామర్థ్యం పెరగడం, సులభమవ్వడం కూడా జరిగింది.దీన్ని ఆసరా చేసుకుని - మార్కెట్ మోసాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఇటీవలి కాలంలో మార్కెట్‌లో ప్రతి ఒక్కరి నోటా వినే పదం ‘డిస్కౌంట్’. డిస్కౌంట్ సేల్స్, ఒకటికొంటె మరొకటి ఉచితమన్న ప్రకటనలతో అమ్మకాలు బాగా పెరిగాయి. ఇలాంటి ఆఫర్లుతో వినియోగదార్లు ఆకర్షణకు గురౌతారని అమ్మకందార్లకు బాగా తెలుసు. అందుకే ఈ ఆఫర్లు పెట్టిన షాపులు జనాలతో కిటకిటలాడుతుంటాయి చూడండి.
డిస్కౌంట్ సేల్స్‌లో కొనేటప్పుడు బాగానే ఉంటుంది, తరువాతే కొంప ముంచుతుందన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. నాణ్యత గురించి ఆలోచించకుండా వస్తువులు కొనడమే ఇక్కడ చాలామంది చేసే పొరబాటు. తరువాత చూసుకుని బాధ పడుతుంటారు. ఈ మధ్య నెట్ సేల్స్‌కు కూడా బాగా ఆదరణ పెరిగింది. కంప్యూటర్ ముందు కూర్చుని వస్తువులను కొనుగోలు చేసేయడం సుళువే, కానీ వాటి నాణ్యత, పనితీరు అందులో పేర్కొన్నట్టు ఉండొచ్చు, ఉండక పోవచ్చు అన్న విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి.



డిస్కౌంట్‌లో ‘అప్ టు’ అనే చిన్న పదం వినియోగదారుల సొమ్ముతో ఆటలాడుతోంది. ఆ చిన్న పదమే కొనుగోలుదారుల్ని తప్పుదారి పట్టిస్తుందని గుర్తెరగండి. కనిపించని డామేజ్‌లు, సెకెండ్ సేల్ వస్తువుల్ని ఈ కోవలో అంటగట్టేస్తారన్నది నిజం. ప్రత్యేకంగా అద్దెహాళ్లలో పెట్టే డిస్కౌంట్ అమ్మకాలకు దూరంగా ఉండటమే మంచిది. కొన్న వస్తువులో ఏవైనా లోపాలుంటే అడగడానికి తర్వాత అక్కడ షాపు కూడా ఉండదు. ఒకవేళ అలాంటి చోట్ల కొనాల్సివస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రాండ్‌నేమ్,
ఉత్పత్తిదారుల చిరునామాలు సరిగా ఉన్నాయో లేదో గమనించుకోవాలి.
 

బిల్లు, క్యాష్‌మెమో లేకుండా కొనడం మంచి పద్ధతి కాదు.
అవిలేకుండా కొనడం అంటే
నాణ్యత మీద ఆశ వదులుకున్నట్టే. వినియోగదారుల్ని ఆకర్షించేందుకు 
‘డిస్కౌంట్ సేల్’ అని పెట్టి, తీరా అక్కడికి వెళ్ళిన తరువాత ఆ స్టాకు అయిపోయిందని, మరోరకం స్టాకు తీసుకోవచ్చని నేర్పరితనంతో అంటగడతారు.
ఒకవేళ మీరు ఇలాంటి మాయలో చిక్కుకుని మోసపోతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు.
1986 వినియోగదారుల చట్టం కింద పని చేసే ఫోరమ్‌లు దేశవ్యాప్తంగా 588 జిల్లాలో ఉన్నాయి. 34మంది రాష్ట్ర కమిషనర్లు ఉన్నారు. ఇవేకాక నేషనల్ కమిషన్ ఒకటి ఢిల్లీలో పని చేస్తుంటుంది.

వినియోగదారులు మోసపోతే, ఫోరంల ద్వారా నష్టాన్ని
రాబట్టుకునే ప్రయత్నం చేయొచ్చు.
సేల్స్ జిమ్మిక్స్‌లో మరోరకం ఏంటంటే -పాత వస్తువు తెచ్చి కొత్త వస్తువు తీసుకెళ్లమనేది. ఇలా ఇచ్చే వాటిలో ఎక్కువగా రిఫ్రిజిరేటర్లు, కప్‌బోర్డులు, టీవీలు ఉంటుంటాయి. అయితే, పాత వస్తువు ధరను
కొత్త వస్తువు ధరలో ఎంత మినహాయించారో గమనించుకోవాలి.
కొత్తగాకొనే వస్తువు యొక్క నాణ్యత గుర్తించాలి. ఒక్కసారి మీ వస్తువులను కొనేవారు మీరు చెప్పిన ధరకే కొన్నప్పుడు, బదులుగా మరో వస్తువు తీసుకున్నప్పుడు ఆ మొత్తాన్ని మినహాయించారో లేదో చూసుకోవాలి. ఇలాంటిచోట్ల మీరు తీసుకున్న వస్తువుకు వారెంటీ ఉందో లేదో చూసుకోవాలి. రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నింటికైతే కొంతకాలం ఫ్రీ సర్వీసు కూడా ఉంటుంది. ఇటీవలి కాలంలో కంప్యూటర్లు, లాప్‌టాప్‌లకు డిమాండ్ పెరగడంతో, కొన్నిరకాల మోసాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పాతవాటినే సర్వీసు చేసి, పైకప్పు కొత్తదివేసి అమ్ముతున్న సందర్భాలూ ఉన్నాయి. కంప్యూటర్ల కొనుగోలులో వాటి శక్తి సామర్థ్యాల, వారెంటీలను ఫ్రీ సర్వీసు ఇతర వివరాలను తెలుసుకుని కంపెనీలకు సంబంధించిన వాటినే కొనుక్కోవాలి. బిల్లులు, క్యాష్‌మెమోలు లేకుండా వస్తువుల్ని కొనొద్దు. అప్పుడే వినియోగదారుడు డిస్కౌంట్ డేంజర్స్ నుంచి బయట పడతారు. చివరిగా ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి.
మార్కెట్లో వస్తువు ధరకంటే తక్కువకు అమ్మకం దారుడు ఎందుకు ఇస్తాడు.
వ్యాపారం చేసేది నష్టాలు పోగేసుకోడానికి కాదుకదా! అన్న స్పృహతో ఆలోచిస్తే 
మార్కెట్ మర్మం మీకే అర్థమవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి